సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సైనిక అమర వీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు.
సైనిక అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోవిడ్–19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సీనియర్ సైనిక అధికారులు లెఫ్టినెంట్ జనరల్ టీఎస్‌ఏ నారాయణ్, మేజర్ జనరల్ ఆర్కే సింగ్, బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏటా గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని సైతం సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment