జలదృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా.. | KTR Spoke To Media On Occasion TRS Formation Day | Sakshi
Sakshi News home page

జలదృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా..

Published Mon, Apr 27 2020 1:21 AM | Last Updated on Mon, Apr 27 2020 7:36 AM

KTR Spoke To Media On Occasion TRS Formation Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన రాజకీయ పార్టీ దేశంలో 2 దశాబ్దాల పాటు మనగలగడం ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. తానెంచుకున్న ఎజెం డాను విజయవంతంగా అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లడం కూడా ప్రజల సహకారంతోనే సాధ్యమవుతోంది’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ‘జలదృశ్యం’నుంచి ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి.. కేసీఆర్‌ నాయకత్వంలో ఒక సుజల దృశ్యాన్ని ఆవిష్కరించే స్థాయికి చేరుకుందన్నారు. టీఆర్‌ఎస్‌ 19ఏళ్లు పూర్తిచేసుకుని ఏప్రిల్‌ 27న 20వ పడిలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆదివారం మీడియాతో ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అంతకుముందు ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతిభవన్‌లో రక్తదానం చేశారు. 

ఉద్యమ నేత.. పాలనాదక్షుడు
‘పదునైన ఉద్యమ నాయకుడు పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకోవడం కేసీఆర్‌లో చూశా’అని అరుణ్‌జైట్లీ గతంలో ఓసారి అన్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక లక్ష్యాన్ని అనుకుని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. ప్రొఫెసర్‌ జయశంకర్, విద్యాసాగర్‌రావు వంటి ఎందరో మేధావులు, తెలంగాణ ప్రజలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ రెండు దశాబ్దాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. స్వాతంత్య్రం తర్వాత జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో రెండు దశాబ్దాలుగా మనుగడ సాధించిన పార్టీలు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నాయి. రెండు దశాబ్దాలకు పైబడి ప్రజా జీవితంలో ఉన్న ఒకపార్టీకి ఇంత ఆదరణ, అభిమానం లభించడం అపురూపం. ప్రస్తుతం 60లక్షల మంది కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిలిపిన కార్యకర్తలు, ప్రజలకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా.

ఆదివారం ప్రగతి భవన్‌లో రక్తదానం చేస్తున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ 
తెలంగాణలో ‘పంచ విప్లవం’

గతంలో బెంగాల్, గుజరాత్‌ నమూనాల తరహాలో, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. తెలంగాణలో జల విప్లవం ఆధారంగా రెండో హరిత విప్లవం, నీలి విప్లవం (మత్స్యసంపద), క్షీర విప్లవం (పాడి పరిశ్రమ), పింక్‌ రివల్యూషన్‌ (మాంస పరిశ్రమ) అనే పంచవిప్లవం రాబోతోంది. వీటి ద్వారా రాష్ట్ర ముఖచిత్రం శాశ్వతంగా మారడంతో పాటు, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. భవిష్యత్తులో దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం చేరుతుంది. 

కేసీఆర్‌ కృషితో ‘తెలంగాణ మోడల్‌’
తెలంగాణ అస్తిత్వ పోరాట ఫలితంగా ఈరోజు తెలంగాణ సంస్కృతి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తనదైన ముద్ర వేయడంతోపాటు, తెలంగాణ మోడల్‌ను రూపొందించడంలో కేసీఆర్‌ కృషి, పట్టుదల ఉన్నాయి. నిధులు, నీళ్లు, నియామకాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా నడిపించి, రాజకీయ పార్టీలను ఒప్పించి తూలనాడిన వాళ్లతోనే శభాష్‌ అనిపించుకున్నాం. కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉందనేందుకు జిల్లా పరిషత్‌ మొదలుకుని అన్ని రకాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

ఇళ్లపై గులాబీ జెండాలు రెపరెపలాడాలి
రెండోసారి అధికారంలోకి వచ్చాక గతేడాది పార్లమెంటు ఎన్నికలు, ఈ ఏడాది కరోనా మూలంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకోలేకపోతున్నాం. సోమవారం పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై గులాబీ జెండాలు ఎగురవేసి సంఘీభావం తెలపాలి. ఏరియా ఆసుపత్రులు, బ్లడ్‌బ్యాంకులను సంప్రదించి భౌతికదూరం పాటిస్తూ వారంపాటు రక్తదానం చేయండి. హడావుడి లేకుండా సేవా కార్యక్రమాలను నిర్వర్తించాలి. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. కరోనా నుంచి కుదుటపడ్డాక కార్యకర్తలకు శిక్షణ ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పునరంకితమవుదాం. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ తప్ప ఇంకెవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని నమ్మి ప్రజలు మాకు మద్దతు పలుకుతున్నారు. 

దేశ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ పరోక్ష ముద్ర
దేశ రాజకీయాలపై పరోక్షంగా ముద్ర వేస్తున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే మంచి పాత్ర పోషించాలనుకున్నాం. పార్లమెంటులో శాసించే స్థాయిలో టీఆర్‌ఎస్‌ లేకున్నా తెలంగాణ మోడల్, కేసీఆర్‌ పాలనను కేంద్రం, ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. రైతుబంధు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి పథకాలే దీనికి ఉదాహరణ.

సెకండ్‌ ఇన్‌ కమాండ్‌గానే కొనసాగుతా
పార్టీలో సెకండ్‌ ఇన్‌ కమాండ్‌గానే కొనసాగుతా. కేసీఆర్‌ కార్యదక్షత, నాయకత్వం తెలంగాణకు మరో 15–20ఏళ్లు అవసరం. నాతో సహా ఈటల రాజేందర్, హరీశ్‌ వంటి ఎంతోమంది నాయకులం కేసీఆర్‌ శిక్షణలో ఎదుగుతున్నాం. ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే వెయ్యి శాతం క్రెడిట్‌ కేసీఆర్‌దే. మేం డబ్బా కొట్టుకోవట్లేదు. కానీ దేశంలో క్వాలిటీ లీడర్‌షిప్‌ తెలంగాణలోనే ఉంది. 

కేసీఆర్‌ నాయకత్వంపై పుస్తకాలు, గ్రంథాలు
రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజం. కాంగ్రెస్‌తో సహా ఎవరూ ఒకే పార్టీలో జీవిత కాలం కొనసాగరు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులుండాలని ప్రజలు కోరుకోవాలి.. పార్టీలు కాదు. ప్రతిపక్షాలు వద్దని, కేసీఆర్‌ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. మేం తప్పుచేస్తే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపుతారు. రాజకీయ పార్టీలు మనగలగాలంటే ప్రజల విశ్వాసం పొందాలి. మేం రెండు దశాబ్దాల్లో ఎన్నో అవమానాలు, గెలుపోటములు చవిచూశాం. లక్ష్యం దిశగా ఉద్యమాన్ని నడిపేందుకు కేసీఆర్‌ అనుసరించిన వ్యూహంపై భవిష్యత్తులో పుస్తకాలు, పరిశోధన గ్రంథాలు వస్తాయి. కేసీఆర్‌ నాయకత్వ తీరుపై కథలుకథలుగా చెప్పుకుంటారు. 

సైద్దాంతిక విభేదాలున్నా సంఘీభావం
ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయ విమర్శలు చేయకుండా ప్రధానికి సంఘీభావం ప్రకటించాం. బీజేపీ, ఎన్డీయేతో సైద్ధాంతిక విభేదాలున్నా ఇలాంటి సంక్షోభ సమయంలో మాట్లాడకూడదని అనుకున్నాం. రాష్ట్రాలను ఆదుకునేందుకు పలు సలహా సూచనలు ప్రధానికి ఇచ్చాం. ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. కరోనా సంక్షోభ సమయంలో కేసీఆర్‌ నాయకత్వ పటిమను దేశం ఆమోదిస్తోంది. చాలా రాష్ట్రాలు సీఎంకు సెల్యూట్‌ చేస్తూ ధీరోదాత్తంగా వ్యవహరిస్తున్నారని అంటున్నాయి. లాక్‌డౌన్‌ పొడిగింపు, చికెన్‌ తినడం, సీ విటమిన్‌ వంటి విషయాల్లో కేసీఆర్‌ చెప్పిన దానిని ప్రజలు ఆమోదిస్తున్నారు. నాయకుడిపై నమ్మకం ఉంటేనే ఇది సాధ్యం.

రెండు దశాబ్దాల్లో ఎత్తుపల్లాలు
రెండు దశాబ్దాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. 2008, 2009లో ఎదురుదెబ్బలు తగిలినపుడు కేసీఆర్‌ ఫీనిక్స్‌లా లేచి తెలంగాణ సమాజాన్ని ఏకంచేశారు. జాతీయ పార్టీలు మోసం చేసినా అన్ని భావజాలాలకు చెందిన వారిని ఏకంచేసి కేంద్రంలో తప్పనిసరి పరిస్థితి సృష్టించి తెలంగాణ సాధించాం. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడమే అత్యంత సంతృప్తినిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు మమ్మల్ని ప్రత్యర్థులుగా, ఆంధ్ర నాయకులు శత్రువులుగా చూసినా, ఎన్ని అవమానాలు పడినా చివరకు తెలంగాణ సాధించాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేం కూడా ఫక్తు రాజకీయ పార్టీగా మారాం. తెలంగాణ వచ్చాక గిల్లికజ్జాలు పెట్టుకోకుండా అందరినీ కలుపుకుపోయాం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా ప్రజలు గెలిపించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి నాకు సమాచారం లేదు. నామినేటెడ్‌ పదవుల భర్తీ కొనసాగుతుంది. ఈ ఏడాది చివరిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

వ్యాక్సిన్‌ వచ్చే వరకు జాగ్రత్త
కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జీవనశైలి మారడంతో పాటు ఇతర మార్పులను మనం స్వాగతించాలి. కరోనాపై పోరు విషయంలో అమెరికా, ఇటలీ సహా ఇతర రాష్ట్ర్‌రాలతో మాకు పోటీలేదు. బయట జరుగుతున్న అన్ని విషయాలు సీఎం కేసీఆర్‌కు తెలుసు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు. రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి.  

నమ్మకం కుదిరాకే.. ఇల్లాలితో కటింగ్‌!
‘ఏంటి జుత్తు పెరిగినా కత్తిరించుకోవడం లేదు. మీ ఆవిడకు మీ తల ఎప్పుడు అప్పగిస్తారు’అంటూ మంత్రి కేటీఆర్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం సరదా సంభాషణకు దారితీసింది. ‘విరాట్‌ కోహ్లి వాళ్ల ఆవిడకు జుత్తు అప్పగించినపుడు నీకేం స మస్య అంటూ ఓ నెటిజన్‌ను ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనికి కేటీఆర్‌ సోదరి కవిత స్పందిస్తూ.. అన్నయ్యా వదినమ్మకు నువ్వు ఎప్పుడు అప్పగిస్తున్నావు అంటూ సరదాగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఆదివారం చిట్‌చాట్‌ సందర్భంగా మీడియా కేటీఆర్‌ వద్ద ప్రస్తావించింది. ‘ఇదుగో కోవిడ్‌ వల్ల నేను జు త్తు కత్తిరించుకోవడం లేదు. మా ఆవిడ కత్తిరి స్తానంటే మా అబ్బాయి మీద ప్రయోగం చేయమని చెప్తా. వాడికి కూడా జుత్తు బాగా పెరిగింది. వాడి కటిం గ్‌ చూసిన తర్వాత నేను సంతృప్తి చెందితే నా జుత్తు అప్పగిస్తా’అని సరదాగా సమాధానం ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement