కరోనా.. పాఠం నేర్వాలి | CM KCR Video Conference With PM Modi Over Corona Virus | Sakshi
Sakshi News home page

కరోనా.. పాఠం నేర్వాలి

Published Wed, Aug 12 2020 12:47 AM | Last Updated on Wed, Aug 12 2020 5:42 AM

CM KCR Video Conference With PM Modi Over Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తితో ఎదురవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై కేంద్ర, రాష్ట్రాలు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడిపై 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, వైద్య శాఖ విభాగాధిపతులు శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి, గంగాధర్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ చేసిన సూచనలు ఆయన మాటల్లోనే...
 
వైద్య రంగం బలోపేతం కావాలి... 
‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలి. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక రచించాలి. కేంద్ర, రాష్ట్రాలు కలసి ఈ ప్రణాళిక అమలు చేయాలి. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలి. గతంలోనూ అనేక వైరస్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కరోనా లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకొనేలా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్‌ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి. ఐఎంఏ లాంటి సంస్థలను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇది దేశానికి మంచి చేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏన్ని వచ్చినా సరే తట్టుకొని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలి. దీని కోసం మీరు (ప్రధాని) చొరవ తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేసి దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రంలో కరోనా కట్టడికి చర్యలు... 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతంగా ఉంది. మరణాల రేటు 0.7 శాతంగా ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధం గా ఉంచాం. ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తోంది.’ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement