ఏప్రిల్‌ 30 దాకా.. లాక్‌డౌన్‌ పొడిగింపు.. | CM KCR Comments Over Lockdown In Telangana | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 30 దాకా.. లాక్‌డౌన్‌ పొడిగింపు..

Published Sun, Apr 12 2020 1:18 AM | Last Updated on Sun, Apr 12 2020 3:51 PM

CM KCR Comments Over Lockdown In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌  : ‘రాష్ట్రంలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ఇది సమాజం, మన పిల్లలు, భవిష్యత్తు సంక్షేమం కోసం కాబట్టి అందరూ సహకరించాలి. అన్ని మతాలు, కులాలు, వర్గాలు సామూహిక కార్యక్రమాలను మానుకోవాలి. మీరు నష్టపోయి, సమాజానికి నష్టం చేయొద్దు’అని సీఎం కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలం కలిసొస్తే ఏప్రిల్‌ 30 తర్వాత దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ఆలోచిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో శనివారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై కోవిడ్‌–19 వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అలాగే అంతకుముందు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన డిమాండ్లను కేసీఆర్‌ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

వ్యవసాయానికి మినహాయింపు...
లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయానికి అనుమతి ఉంటుంది. లేకపోతే మనకు బువ్వ దొరకదు. ధాన్యం వచ్చింది... కోతలు జరగాలె... పంటంతా చేతికి రావాలె... ఎఫ్‌సీఐకి పోవాలె. అదంతా జరగాలె. ధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసే రైస్‌మిల్లులు నడుస్తాయి. వాటికి అనుమతిస్తాం. పిండిమరలకు అనుమతి ఉంటుంది. ఆయిల్‌ సీడ్స్‌ను నూనెగా చేసే మిల్లులుంటాయి. ఆహార సంబంధిత అనుమతి ఇస్తాం. కూర గాయలు రావాలన్నా వ్యవసాయం అవసరం. మన దేశ జనాభా దాదాపు 135 కోట్లు. ప్రపంచంలోనే భారత్‌కు అన్నంపెట్టే శక్తి ఏ దేశానికీ లేదు. మన దేశాన్ని ఎవరూ సాకలేరు. ఎందుకంటే తెలంగాణ కంటే 100 దేశాలు చిన్నగా ఉన్నాయి. ఏ దేశం మనకు అన్నం పెడుతుంది? విశాల భారతానికి ఎవరూ అన్నం పెట్టలేరు. ఆహారంలో స్వావలంబన సాధించిన దేశం మనది. మోదీకి కూడా అదే చెప్పినం. ఎట్టి పరిస్థితుల్లో మనం మన స్థాయిని కోల్పోవద్దు. మన ఆహారాన్ని మనమే సాధించుకోవాలె. వ్యవసాయాన్ని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను అనుమతించాలె. అప్పుడే 135 కోట్ల పొట్టలు నింపుకోగలుగుతాం. అయితే ఈ విషయంలోనూ కొన్ని నియమాలు పాటిస్తూ ముందుకెళ్లాలి. అందరూ మాస్కులు ధరించాలి. ఎవరైనా వినకుండా బయటకు వస్తే పోలీసులు కొడ్తరు.

క్యూఈ పద్ధతిలో రూ. 10 లక్షల కోట్లు..
ప్రస్తుతం చాలా విచిత్ర, విపత్కర పరిస్తితి ఉంది. ప్రపంచ మానవ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు. 1918లో స్పానిష్‌ ఫ్లూ, 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తిన సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక పద్ధతిని అవలంబించారు. ఇటువంటి సంక్షోభాల సమయంలో కేంద్ర రాష్ట్రాల రెవెన్యూ పడిపోయినందున వ్యవస్థను నడిపేందుకు ప్రపంచవ్యాప్తంగా క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (క్యూఈ) అనే పద్ధతిని పాటిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ విపత్కర పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు అమెరికా ఫెడరల్‌ బ్యాంకు తమ జీడీపీలో 10 శాతం అంటే 2 ట్రిలియన్‌ డాలర్లను సమాజంలోకి పంప్‌ చేసింది. బ్రిటిష్‌ బ్యాంక్‌ ఆఫ్‌ లండన్‌ కూడా ఆ దేశ జీడీపీలో 15 శాతం పంప్‌ చేసింది. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్రాల వద్ద డబ్బు లేదు. రెవెన్యూ, ట్యాక్సులు వచ్చే పరిస్థితి లేనందున ఆర్‌బీఐ నుంచి క్యూఈ విధానంలో డబ్బు తీసుకోవడం మినహా గత్యంతరం లేదు. 2019–20కిగాను జీడీపీని 203.85 లక్షల కోట్లుగా నిర్ధారించారు. ఇందులో ఐదు శాతం అంటే రూ. 10.15 లక్షల కోట్లను ఆర్‌బీఐ విడుదల చేసినా అవి కేంద్ర, రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తాయి. 

హెలికాప్టర్‌ మనీ పంప్‌ చేయాలి...
మన దేశంలో చిన్నా, చితక వ్యాపారులు, కార్మికులు, రేషన్‌ కార్డులు లేనివారు, రైతులు తదితర వర్గాల నుంచి అనేక డిమాండ్లు ఉన్నాయి. మనం రూ. 30 వేల కోట్ల ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం కొనగోలు చేస్తున్నాం. క్యూఈ విధానంలో డబ్బును సమాజంలోకి పంప్‌ చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఏప్రిల్‌తో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కితే తిరిగి పుంజుకొనే అవకాశం ఉంది. ఇలా పంప్‌ చేసే డబ్బును ‘హెలికాప్టర్‌ మనీ’అంటారు. ఆర్‌బీఐ ముందుకు వచ్చి హెలికాప్టర్‌ మనీని సప్‌లై చేయాలని ప్రధానికి వివరించాం. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఇదే కోరారు. ప్రధాని నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం.

యథాతథ స్థితి కొనసాగించాలి...
ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో మూడు గంటలపాటు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌ను కనీసం రెండు వారాలు పొడిగించాలని అన్ని రాష్ట్రాల సీఎంలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కొందరు సీఎంలు కోరారు. దీన్ని ససేమిరా అంగీకరించం. సీఎంఆర్‌ఎఫ్‌కు సీఎస్‌ఆర్, పన్నుల మినహాయింపు ఇవ్వాలి. పీఎం కేర్స్‌ తరహాలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు ఇచ్చే వారికి సీఎస్‌ఆర్, ట్యాక్సుల నుంచి మినహాయించే నిబంధనలు వర్తింపజేయాలి. రాష్ట్రాల్లోనూ విరాళాలు ఇచ్చేందుకు విరివిగా ముందుకొస్తున్న వారికి ఈ వెసులుబాటు కల్పించాలని ప్రధానిని కోరా. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలను మళ్లీ లేఖ రూపంలో ప్రధానికి పంపించాం.

తొలి దశ రోగుల వంద శాతం డిశ్చార్జి..
తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో వైరస్‌ సంక్రమించిన వారిని వంద శాతం డిశ్చార్జి చేశాం. తొలి దశలో క్వారంటైన్‌లో పెట్టిన 25,937 మంది కూడా డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసులను కూడా కలుపుకొని మొత్తంగా శనివారం వరకు 503 పాజిటివ్‌ కేసులు రాగా ఇందులో 14 మంది మరణించారు. ఇండోనేషియన్లు సహా విదేశాల నుంచి వచ్చిన 96 మందిని డిశ్చార్జి చేశాం. ఆస్పత్రుల్లో ప్రస్తుతం 393 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిజాముద్దిన్‌ ఘటన తర్వాత మొత్తంగా 1,200 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు చేశాం. ప్రస్తుతం 1,654 మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారు. ఆస్పత్రికి రెఫర్‌ అవుతున్న కేసుల సంఖ్య కూడా తగ్గింది. రిస్క్‌ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో గతంలో ఆచూకీ లభించని వారిని కూడా గుర్తించి పరీక్షలు చేస్తున్నాం.

ఏప్రిల్‌ 24 తర్వాత యాక్టివ్‌ కేసులుండవ్‌!
కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎక్కడా రాజీపడకుండా 234 చోట్ల కంటెయిన్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 ప్రాంతాలు, ఇతర చోట్ల 120 ప్రాంతాలు ఉన్నాయి. కంటెయిన్‌మెంట్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయి. అదృష్టవశాత్తూ చికిత్స పొందుతున్న వారు, క్వారంటైన్, కంటెయిన్‌మెంట్‌ ఏరియాలో ఉన్న వారిలో ఏ ఒక్కరూ సీరియస్‌గా లేరు. భగవంతుడి దయతో ఎవరికీ ఆక్సిజన్, వెంటిలేటర్‌ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ దశ నుంచి సంక్రమణ తగ్గిపోతే ఏప్రిల్‌ 24 వరకు దాదాపు కోవిడ్‌ బాధితులు ఎవరూ ఉండరు. కొత్త ఉత్పాతం, ఉప్పెన రాకపోతే మనం బయట పడతాం.

మహారాష్ట్ర సరిహద్దు మూసివేత...
మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 11 మంది మరణించారు. రాజస్తాన్‌లో 117 మందికి వైరస్‌ సోకింది. మహరాష్ట్రతో మనకు ఐదారు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కాళేశ్వరం మొదలుకొని నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, నారాయణఖేడ్‌ వరకు సరిహద్దు ఉండటంతో బంధుత్వాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. కఠినంగా వ్యవహరిస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేం. మహారాష్ట్ర సరిహద్దును వంద శాతం మూసేస్తాం. అక్కడి నుంచి వచ్చే నిత్యావసరాలను కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

ఏప్రిల్‌ 15 వరకు సాగునీరు...
రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పరిధిలో ఏప్రిల్‌ 15 వరకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్రం శనగల కొనుగోలుకు తక్కువ కోటా ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్లకు గ్యారంటీ ఇచ్చింది. కనీస మద్దతు ధరకు కొనేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున రైతులు ఆందోళన చెందవద్దు. బత్తాయి, ఉల్లి, మామిడి దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయదు. అన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటే సాధ్యం కాదు. రాష్ట్రంలో పండే పంటల్లో 95 శాతం వాటా వరి, పత్తి, మొక్కజొన్న పంటలదే. వాటితోపాటు పప్పుశనగలు కొనుగోలు చేస్తున్నం.

ఏకతాటిపైకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..
కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్రాలు ఏకతాటిపై పనిచేస్తున్నాయి. రైలు, విమానాల రాకపోకలు సహా లాక్‌డౌన్‌ కొనసాగింపునకు సంబంధించి అన్ని విషయాలపై ప్రధాని అధికారికంగా జాతికి సందేశం ఇచ్చే అవకాశం ఉంది. కరోనా నియంత్రణలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మంచి స్థితిలో ఉంది. ప్రధాని కూడా లాక్‌డౌన్‌ విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి యావత్‌ దేశం ఒకే మూసలో పనిచేసింది కాబట్టి కరోనా నియంత్రణలో ఉంది. ఇంకో 10–15 రోజులు రాజకీయాలను పక్కనపెట్టి మనం ముందుకెళ్తే కచ్చితంగా బయటపడే ఆస్కారం ఉంది.

అత్యవసర వైద్య సేవలు నిరాకరించొద్దు..
ఆరోగ్యం విషమించి అత్యవసర పరిస్థితిలో చికిత్స కోసం వచ్చే రోగులను ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకోకపోవడం మంచిది కాదు. మామూలు సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు సంపాదించుకొని ఈ సమయంలో రోగులకు చికిత్స చేయకపోతే ఎలా? ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుంది. దీనిపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్షించి ఆదేశాలు జారీ చేస్తారు.

ప్రైవేటులో కోవిడ్‌ చికిత్సకు నో..
ప్రభుత్వ కోవిడ్‌–19 ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ సామర్థ్యం పూర్తిగా వినియోగంలోకి వచ్చాకే ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అనుమతిస్తాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించేసరికి ప్రైవేటు ఆస్పత్రులు గమ్మున ఉండిపోయాయి. పేదలకు ఇబ్బంది కావద్దనే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 రోగులకు అందించే చికిత్సలో వస్తున్న కొత్త పరిజ్ఞానం తొలుత ప్రభుత్వానికే తెలిసే అవకాశముంది. ఇది కూడా ముఖ్య కారణం. వ్యాధి నయమైందని పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్నాకే రోగులను డిశ్చార్జి చేసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా నయం కాకుండానే రోగులను డిశ్చార్జి చేస్తే వారు ఆటంబాంబుగా మారి వందలాది మందికి వ్యాధిని అంటించే ప్రమాదముంటుంది. అందుకే ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. నిజాముద్దీన్‌ ఘటన జరగకపోయి వుంటే ఈ రోజు మనం ఆరామ్‌గా ఉండేవాళ్లం. రోజుకు రెండు, మూడు కేసులే వచ్చేవి.

మద్యం షాపులు తెరిచే ప్రసక్తే లేదు..
కేరళ తరహాలో మద్యాన్ని హోం డెలివరీ చేసే యోచన లేదు. రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచే ప్రసక్తే లేదు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో దస్తీలు, టవల్స్‌ కట్టుకున్నా పర్వాలేదు. మార్కెట్లో మాస్కులు లభించకపోతే ఇంట్లోనే కుట్టుకోవాలి. ఎవరైనా ధరలు పెంచినా, నిత్యవసర సరుకుల కత్రిమ కొరత సష్టించినా పీడీ యాక్ట్‌ కింద చర్యలు తీసుకుంటాం. ఈ విపత్కర సమయంలో దుర్మార్గంగా డబ్బులు సంపాధించుకోవడానికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదు. 

1–9 వరకు అందరూ పాస్‌
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రకటించిన సెలవులు కొనసాగుతుండటం, ఫలి తంగా వార్షిక పరీక్షలను ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా పాసైనట్లేనని ప్రకటించారు. ‘‘ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డిటెన్షన్‌ విధానం లేదు కాబట్టి విద్యార్థులంతా పాస్‌ అయినట్లే ప్రకటిస్తున్నాం. ఇతర రాష్ట్రాల తరహాలో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులకు బెంబేలు, చింత అవసరం లేదు’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. అయితే మధ్యలో ఆగిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై మాత్రం మరికొన్ని రోజులు ఆగి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement