సంపూర్ణ అక్షరాస్యత | CM KCR Comments Over Complete Literacy In Telangana | Sakshi
Sakshi News home page

సంపూర్ణ అక్షరాస్యత

Published Wed, Jan 1 2020 2:05 AM | Last Updated on Wed, Jan 1 2020 2:05 AM

CM KCR Comments Over Complete Literacy In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమన్నారు. సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణను 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రతిన తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘ప్రతి ఒక్కరు–ఒకరికి బోధించాలి’అనే నినాదం అందుకుని ప్రతీ విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని కోరారు. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్‌ స్వీకరించాలని పిలుపునిచ్చారు. ‘ఆరేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళుతూ గొప్ప విజయాలు సాధించింది.

అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి, అనేక మంది ప్రశంసలను అందుకున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను తెలంగాణ సొంతం చేసుకుంది. అనతికాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. అంధకారమైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడం తెలంగాణ సాధించిన గొప్ప విజయాల్లో ప్రథమంగా నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11,703 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ వచ్చినప్పటికీ ఏమాత్రం కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయగలిగే శక్తిని రాష్ట్రం సంతరించుకున్నది. మిషన్‌ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది.

తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్‌ భగీరథ లాంటి పథకం తీసుకురావడానికి మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇది కూడా మనందరికీ గర్వకారణం. సాగునీటి రంగంలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తున్నది. పెండింగ్‌ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని, పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకోగలిగాం. ప్రపంచమే అబ్బురపడే ఇంజనీరింగ్‌ అద్భుతంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. రాబోయే జూన్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వంద శాతం అందుతాయి.. రాష్ట్రం సుభిక్షమవుతుంది. ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచింది. అనేక రకాల సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవనభద్రత కల్పించుకోగలిగాం. పారిశ్రామిక, ఐటి రంగాల్లో దూసుకుపోతున్నాం’అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 

అక్షరాస్యతలో వెనకబడటం మచ్చ 
‘అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. అక్షరాస్యతలో వెనుక వరుసలో ఉండటం ఓ మచ్చగా మిగిలింది. అందరినీ అక్షరాస్యులను చేయడంలో గత పాలకులు విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితిని తెలంగాణ అధిగమించాలి. రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు మనందరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువురాని మరొకరిని అక్షరాస్యులుగా మార్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్న భరితమైన పోరాటం చేసి లక్ష్యం సాధించారు. ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగాం. అదే స్ఫూర్తితో తెలంగాణను వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేయాలి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అక్షరాస్యత విషయంలో అప్రతిష్టను రూపుమాపాలి’అని సీఎం పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement