నగదు బదిలీ షురూ  | Money Distribution Programme Started To White Ration Card Holders Telangana | Sakshi
Sakshi News home page

నగదు బదిలీ షురూ 

Published Sat, Apr 11 2020 1:43 AM | Last Updated on Sat, Apr 11 2020 1:43 AM

Money Distribution Programme Started To White Ration Card Holders Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం తెల్ల రేషన్‌ కార్డున్న ప్రతీ కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదును బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. అందరికీ డబ్బులు చేరతాయి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘రేషన్‌ షాపుల ద్వారా నియం త్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలి’అని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.  కరోనా వైరస్‌ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్‌ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. వారి కుటుంబసభ్యులు, వారు కలసిన వారిని కూడా గుర్తించి క్వారం టైన్‌ చేసినట్లు తెలిపారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువైనప్పటికీ అందరికీ చికి త్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి ని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కోరారు.

కరోనా వైరస్‌ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలసిన వారిని గుర్తించి క్వారంటైన్‌ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు. వరి కోత లు, ధాన్యం ఇతర పంటల కొను గో ళ్లు యథావిధిగా జరపాలని చెప్పా రు. ఇక శనివారం ప్రధాని నరేంద్రమోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌రావు, రామకృష్ణ రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు.  

సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులకు చేసిన సూచనలివే..  

  • లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి. దేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు కావడం వల్లనే వైరస్‌ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదు. ఈ సత్యాన్ని గ్రహించి ప్రజలు సహకరించాలి.  
  • లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలి. పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ షాపుల వద్ద జనం ఒకే దగ్గర పోగవ్వకుండా దూరం పాటించాలి. 
  • గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను సరిగ్గా నిర్వహించాలి. రైతులు చెప్పిన సమయానికే వచ్చి, తమ ధాన్యం అమ్ముకుని పోవాలి.  
  • పట్టణ ప్రాంతాలు, ఇతర చోట్ల వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను, సహాయ కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement