
నాగోబా దర్బార్ హాల్‌లో సమావేశమైన ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి: మెస్రం వంశీయులు సొంత నిధులతో నిర్మించిన నాగోబా ఆలయ ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ ప్రకటించారు. కేస్లాపూర్ నాగోబా ఆలయ దర్బార్‌హాల్‌లో ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఆలయ ప్రారంభోత్సవం, వేడుకలకు అతిథుల ఆహ్వానంపై చర్చించారు. ఈ సందర్భంగా వెంకట్‌రావ్ మాట్లాడుతూ డిసెంబర్ 12 నుంచి 18 వరకు ప్రారంభోత్సవాలుంటాయని వెల్లడించారు. ఏడు రోజుల పాటు భజన, కీర్తన కార్యక్రమాలతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.
17న మెస్రం వంశ ఆడపడుచులకు అతిథి మర్యాదలు చేసి కొత్త దుస్తులు అందించనున్నట్లు పేర్కొన్నారు. 18న ఉదయం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజల మధ్య నాగోబా విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి కుల, మత భేదాలు లేకుండా అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. మెస్రం వంశీయులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై నాగోబా దర్శనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెస్రం వంశ పెద్దలు చిన్ను పటేల్, బాదిరావ్‌పటేల్, కోసేరావ్ కటోడ, మెస్రం వంశం ఉద్యోగులు మనోహర్, సోనేరావ్, దేవ్‌రావ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment