నాగోబా మహాపూజకు బయలుదేరిన మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి/ఉట్నూర్(ఖానాపూర్): ఆదివాసీలు గూడేలు వీడెను. నాగోబా నీడన చేరెను. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు.
పుష్య అమావాస్య అర్థరాత్రి పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించిన అనంతరం జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు ఉదయం నుంచి ఆచార సంప్రదాయాలు పాటిస్తూ నాగోబాను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ సమీపంలోని వడమర వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు, పెద్దలు(పటేళ్లు) శనివారం తెల్లవారుజామున 84 మందికి తూమ్ నిర్వహించారు. శనివారం నాగేంద్రుడి విగ్రహంతో నియమనిష్టలు, వాయిద్య చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు.
సిరికొండ మండల కేంద్రం నుంచి తెప్పించిన మట్టికుండలకు మెస్రం పెద్దలు పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన ఆడపడుచులు పెద్దలకు, పూజారులకు పాదాభివందనం చేస్తూ నాయక్పాడ్ నుంచి మట్టికుండలు స్వీకరించారు. అనంతరం వడమర సమీపంలోని కోనేరు నుంచి పవిత్రజలాలను నాగోబా సన్నిధికి తెచ్చారు.
గతేడాది నిర్మించిన మట్టిపుట్టలను మెస్రం వంశ అల్లుళ్లు తొలగించగా దానిస్థానంలో కొత్తగా పుట్టలను తయారు చేశారు. మట్టి ఉండలను మహిళలు చేతుల మీదుగా తరలించి సతిదేవతల ఎదుట మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మెస్రం వంశీయులు గోవాడా (గుండ్రంగా గోడకట్టి ఉండే ప్రదేశం) చేరుకుని విడిది చేశారు. మహాపూజకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాగా జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment