Nagoba-Jatara
-
మొదలైన ‘నాగోబా’ జాతర.. ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్
ఇంద్రవెల్లి/ఉట్నూర్(ఖానాపూర్): ఆదివాసీలు గూడేలు వీడెను. నాగోబా నీడన చేరెను. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. పుష్య అమావాస్య అర్థరాత్రి పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించిన అనంతరం జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు ఉదయం నుంచి ఆచార సంప్రదాయాలు పాటిస్తూ నాగోబాను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ సమీపంలోని వడమర వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు, పెద్దలు(పటేళ్లు) శనివారం తెల్లవారుజామున 84 మందికి తూమ్ నిర్వహించారు. శనివారం నాగేంద్రుడి విగ్రహంతో నియమనిష్టలు, వాయిద్య చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు. సిరికొండ మండల కేంద్రం నుంచి తెప్పించిన మట్టికుండలకు మెస్రం పెద్దలు పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన ఆడపడుచులు పెద్దలకు, పూజారులకు పాదాభివందనం చేస్తూ నాయక్పాడ్ నుంచి మట్టికుండలు స్వీకరించారు. అనంతరం వడమర సమీపంలోని కోనేరు నుంచి పవిత్రజలాలను నాగోబా సన్నిధికి తెచ్చారు. గతేడాది నిర్మించిన మట్టిపుట్టలను మెస్రం వంశ అల్లుళ్లు తొలగించగా దానిస్థానంలో కొత్తగా పుట్టలను తయారు చేశారు. మట్టి ఉండలను మహిళలు చేతుల మీదుగా తరలించి సతిదేవతల ఎదుట మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మెస్రం వంశీయులు గోవాడా (గుండ్రంగా గోడకట్టి ఉండే ప్రదేశం) చేరుకుని విడిది చేశారు. మహాపూజకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాగా జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చివరి నిమిషంలో కేసీఆర్ ఆదిలాబాద్ పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చివరి నిమిషంలో రేపటి ఆదిలాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లో వైభవంగా జరుగుతున్న నాగోబా జాతరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెళ్లడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలిజాతరకు సీఎం కేసీఆర్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన గిరిజనులు సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ పర్యటన రద్దు చేసుకోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు. నాగోబా జాతరకు గిరిజన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు హాజరవుతారా? లేదా అన్నదానిపై కూడా సందేహాలున్నాయి. ఈ ఇద్దరు మంత్రుల పర్యటన వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, జాతరకు కేసీఆర్ హెలీకాఫ్టర్లో రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను సీఎం సెక్యూరిటీ అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ నెల 27 వరకు నాగోబా జాతర కొనసాగుతుంది. -
నాగోబా జాతరకు కేసీఆర్
కేస్లాపూర్: ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లో వైభవంగా జరుగుతున్న నాగోబా జాతర కు గురువారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరుకానున్నారు. జాతరలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అక్కడ జరిగే ప్రజాదర్బార్ లో పాల్గొంటారు. జాతరకు కేసీఆర్ హెలీకాఫ్టర్ లో రానున్న నేపధ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను సీఎం సెక్యూరిటీ అధికారులు బుధవారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపండుగగా జరుగుతున్న తొలిజాతరకు సీఎం కేసీఆర్ రావడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌తో పాటు మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వేలాదిగా తరలి వచ్చిన వివిధ తెగల ఆదివాసీలతో జాతర కిటకిటలాడుతోంది. ఈ నెల 27 వరకు నాగోబా జాతర కొనసాగుతుంది. -
నాగోబా జాతరలో మంత్రి ప్రత్యేక పూజలు
కేస్లాపూర్,(ఆదిలాబాద్): అడవితల్లి ఒడిలో కొలువై ఆదివాసులు కొంగుబంగారంలా కొలుచుకునే నాగోబా జాతరను తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాబురావులు పూజల్లో పాల్గన్నారు. ఆదిలాబాద్‌తో పాటు మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వేలాదిగా తరలి వచ్చిన వివిధ తెగల ఆదివాసీలతో జాతర కిటకిటలాడుతోంది. ఈ నెల 27 వరకు నాగోబా జాతర కొనసాగుతుంది.