మార్చి 7న నాగోబా జాతర
గంగాజలం కోసం బయల్దేరిన మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నాగోబా జాతర మహాపూజలకు అవసరమయ్యే గంగాజలం తీసుకొచ్చేందుకు బుధవారం మెస్రం వంశీయులు బయలుదేరి వెళ్లారు. గంగాజలం సేకరించే ఝారీ (కలషం) దేవతకు సంప్రదాయపూజలు చేశారు. తర్వాత కాలినడకన యాత్రను ప్రారంభించారు. బుధవారంరాత్రి మండలంలోని వడగామ్ పొలిమేరలో బస చేయగా గురువారం ఉట్నూర్ మండలం సాలేవాడ, 22న అస్నాపూర్, 23న జైనూర్ మండలంలోని గౌరి, 24న సిర్పూర్ మండలంలోని కోహినూర్, 25న కడెం మండలం ఇస్లాపూర్, 26న జన్నారం మండలం కలమడుగు, 27న గోదావరి హస్తిన మడుగుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి గంగాజలం సేకరిస్తారు.
తిరుగు ప్రయాణంలో 28న సిర్పూర్ మండలం దన్నోర, 29న జైనూర్ మండలం గౌరి గ్రామాల్లో బస చేస్తారు. ఫిబ్రవరి 3న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి అదేరోజు సాయంత్రం నుంచి ఆరో తేదీ వరకు కేస్లాపూర్ పొలిమేరలోని మర్రి చెట్టు వద్ద బస చేస్తారు. ఇంకా వివిధ గ్రామాల నుంచి మెస్రం వంశీయులు అక్కడికి చేరుకుంటారు. 7న ప్రత్యేక పూజలు చేసి అదేరోజు రాత్రి పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రిని పురస్కరించుకుని సేకరించిన గంగాజలంతో నాగోబాకు మహాపూజలు చేస్తారు. తర్వాత నాగోబా జాతరను ప్రారంభిస్తారు.