tribal festival
-
వందే సృజన!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చిన తరువాత చాలా ప్రాంతాల మధ్య దూరం తగ్గిపోయింది. కానీ టికెట్ ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడంతో కొంతమంది దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఇలా వందేభారత్‌కు దూరంగా ఉన్న గ్రామానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చి అబ్బుర పరుస్తోంది పూర్ణిమా ముర్ము. అవును మీరు కరెక్ట్‌గానే చదివారు. మారుమూల గ్రామానికి వందే భారత్‌ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది పూర్ణిమ. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు పక్కనే ఉన్న ఓ గ్రామం పేరు జొండరాగోడ. ఈ గ్రామానికి చెందిన విద్యార్థే పూర్ణిమా ముర్ము. గిరిజనులు ఎక్కువ ఉండే ఈప్రాంతంలో దీపావళి సమయంలోనే సోహ్రాయ్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. దీపావళి రెండో రోజున జరుపుకునే ఈ పండక్కి గిరిజనులంతా... తమ మట్టి ఇళ్లను శుభ్రం చేసి, రకరకాల సాంప్రదాయ డిజైన్లతో పెయింట్ వేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూర్ణిమ తన ఇంటిని వందే భారత్ చిత్రంతో నింపేసింది. మట్టింటికి ముచ్చటగా.. గ్రామంలో ఎంతో సంతోషంగా ఆర్భాటంగా జరుపుకునే పండగను మరింత బాగా జరుపుకోవాలన్న ఉద్ధేశ్యంతో హైస్పీడ్ ట్రైన్‌తో ఇంటిని అలంకరించాలనుకుంది పూర్ణిమ. గ్రామవాసులు సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసే రంగుల నుంచి.. తెలుపు, నీలం, నల్లరంగులు తీసుకుని ఇంటి గోడపైన వందేభారత్ రైలు బొమ్మను చక్కగా చిత్రించింది. రైలు బొమ్మ ఆకర్షణీయంగా ఉండడంతో గ్రామస్థులు పూర్ణిమ ఇంటిని చూసేందుకు ఎగబడుతున్నారు. ‘‘గ్రామంలోని చాలామందికి ‘వందేభారత్ రైలు’ ఎలా ఉంటుందో తెలియదు. దీని గురించి వినడమేగాని చూసింది లేదు. అందుకే అందరికీ వందేభారత్‌ను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో రైలు బొమ్మను చిత్రించాను. నిజానికి నేను కూడా ఇప్పటిదాకా వందేభారత్ చూసింది లేదు. ఫోన్లో వందేభారత్ బొమ్మను చూసి గీశాను. అచ్చం వందేభారత్‌ను పోలి ఉండడంతో నా పెయింటింగ్ గురించి తెలిసిన వారంతా చూడడానికి వస్తున్నారు. రైలు పెయింటింగ్ వేసిన తరువాత ఇంట్లో ఉన్నట్టుగా గాక, ట్రైన్లో ఉన్నట్టు ఉంది’’ అని సంతోషంగా చెబుతోంది పూర్ణిమ. వేడుకల్లో వందేభారత్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పెయింటింగ్‌ను చూసిన గ్రామస్థులంతా.. ‘‘మేమయితే ఇంతవరకు ఈ రైలు ఎక్కలేదు. కనీసం ఇలాగైనా చూడగలుగుతున్నాం. వందే భారత్‌ను పూర్ణిమ చక్కగా వేసింది’’ అని మెచ్చుకుంటున్నారు. పిల్లలైతే కొత్త రైలు తమ ఊరు వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు. -
ఆది మహోత్సవను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
Nagoba Jatara 2023 : ఆదిలాబాద్‌లో ‘నాగోబా’ జాతర ప్రారంభం (ఫొటోలు)
-
వర్షం కోసం గంగాలమ్మ పండగ
కొయ్యూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): వర్షంతో తడిపి భూములను సస్యశ్యామలం చేయాలని గిరిజనులు ఏటా ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు గంగాలమ్మ తల్లి పండగను నిర్వహిస్తారు. దాదాపుగా 300 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. నాడు అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి వచ్చిన ఆంగ్లేయులు కూడా ఈ పండగను చూశారు. పంటలు పండాలంటే నీరు కావాలి. అందుకే గంగమ్మను పూజిస్తే.. తల్లి వర్షాన్ని కురిపించి పంటలను పండిస్తుందని ఇక్కడి గిరిజనుల నమ్మకం. ఇక్కడి భూములు చాలా వరకు వర్షాధారం కావడంతో వర్షం తప్పనిసరి. ఒకప్పుడు నెల రోజుల పాటు పండగ చేస్తే.. ఇప్పుడు వారానికే పరిమితమైంది. గిరిజన గ్రామాల్లో విత్తనాలు చల్లికతో ప్రతీ చోట పండగ ప్రారంభిస్తారు. కొన్ని రకాల పప్పులు, వరి విత్తనాలను గంగాలమ్మ తల్లి పేరు చెప్పి పొలంలో చల్లుతారు. ఆ విత్తనాల్లో కొన్నైనా మహిళల చీరకొంగులో పడే విధంగా చూస్తారు. అలా పడిన విత్తనాలను దాస్తారు. తర్వాత వారు వేసే విత్తనాల్లో వీటిని కలిపివేస్తారు. ఇలా వేస్తే తల్లి ఆశీస్సులతో పంటలు బాగా పండుతాయని భావిస్తారు. గ్రామాన్ని క్షేమంగా చూడాలని చిన్న ఈరేడును తయారు చేసి దానిలో బుట్టను ఉంచుతారు. చిన్న కోడిపిల్లను బలి ఇచ్చి గ్రామంలో రెండు వైపులా పొలిమేర వరకు తీసుకువచ్చి వదిలిపెడతారు. దీనిని జడిగా పిలుస్తారు. వారం రోజులే తల్లి ఊరేగింపు ప్రతి రోజూ సాయంత్రం సమయంలో తల్లిని ఊరేగింపుగా అన్ని గృహాల వద్దకు తీసుకెళ్తారు. కుండపై దీపం పెట్టి గంధం, పాల ఆకుల పూలు పెడతారు. ఇలా ఊరేగించిన తర్వాత అసలు పండగ చేపడతారు. ఈ సందర్బంగా గ్రామాల్లో ఊయలను ఏర్పాటు చేస్తారు. ఇందులో పెద్దల నుంచి పిల్లల వరకు అంతా సంతోషంగా ఊగుతారు. గతంలో తల్లి ఊరేగింపును దాదాపుగా నెల రోజుల పాటు చేసేవారు. ఇప్పుడు వారం రోజులకే పరిమితమైంది. కోలాటం.. గంగాచెల్లు.. తల్లికి మేకలను బలి ఇస్తారు. అనేకచోట్ల మంగళవారం రాత్రి అంతా కోలాటం, గంగా చెల్లు పాటలతో జాగారం చేస్తారు. బుధవారం ఉదయాన్నే మేకలను బలి ఇస్తారు. గతంలో కోలాటం, గంగాచెల్లు ఆటలను రాత్రి నుంచి తెల్లవారే వరకు పాడే వారు. ఇప్పుడు ఆ గంగా చెల్లును చాలా చోట్ల మానేశారు. కొంత సేపు కోలాటం ఆడుతున్నారు. బాసికాలు వసూలు మరోవైపు మేకపోతులను వేసిన తర్వాత నుంచి మహిళలు రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టి బాసికాల పేరిట డబ్బులు వసూలు చేస్తారు. వాహనచోదకులకు పసుపు నీటిని రాస్తారు. పురుషులు కోలాటం చేస్తూ ఇంటింటికీ తిరిగి డబ్బులు వసూలు చేస్తారు. గతంలోలా కాకపోయినా.. ప్రతి గ్రామంలో ఈ పండగ నిర్వహిస్తున్నారు. తగ్గిన గొర వేషం, వేటలు మేకలను బలి ఇచ్చిన తర్వాత గ్రామంలో పెద్దలు సంప్రదాయ ఆయుధాలతో వేటకు వెళ్తారు. వేటకు వెళ్లే ముందు పూజలు నిర్వహించి పనసకాయకు బాణాలు వేస్తారు. మరికొన్ని చోట్ల అయితే పంది పిల్లకు బాణాలు వేస్తారు. గతంలో అడవి విస్తరించి ఉండడంతో పాటు వేటాడే నిపుణులు ఉండేవారు. దీంతో వేటకు వెళ్తే ఏదో ఒక జంతువును తెచ్చేవారు. ఇప్పుడు వేటలను చాలా వరకు తగ్గించారు. ఇలా వేటకు వెళ్లే ప్రతి రోజూ రాత్రి సమయంలో గొర వేషాన్ని నిర్వహిస్తారు. జంతువు వేషధారణతో ఒకరిని తయారు చేస్తారు. అతన్ని వేటాడుతున్నట్టుగా బాణాలు వేస్తారు. చుట్టూ జనాలు ఉండి ఆటలాడుతారు. ఈ సందర్భంగా అతని తోకకు పేడ లేదా పసుపు నీరు పూస్తారు. ఇంటింటికీ తిరిగి తోకకు రాసిన పేడ లేదా పసుపు నీరును అందరికీ అంటిస్తారు. ఇదంతా సరదా సాగుతుంది. చిన్నతనంలో బాగుండేది మా చిన్నతనంలో పండగ చాలా బాగుండేది. నెల రోజులకు పైగా జరిగేది. ఇప్పుడు పండగ చేసే రోజులు తగ్గిపోయాయి. అప్పటి మాదిరిగా మహిళలు ఇప్పుడు గంగాచెల్లు ఆడేందుకు రావడం లేదు. పండగ సంప్రదాయ ప్రకారం చేస్తున్నారు. – కె.గంగరాజు, రాజేంద్రపాలెం అన్నిచోట్ల నిర్వహణ మన్యంలో వందల ఏళ్ల నుంచి ఈ పండగ కొనసాగుతోంది. నేడు అనేక చోట్ల బాగానే జరుగుతోంది. అయితే పండగ జరిగే రోజుల సంఖ్య తగ్గిపోయింది. వేటలను చాలా వరకు తగ్గించారు. నాడు కోలాటం, గంగా చెల్లు ఆటలు జరిగితే.. నేడు దానికి భిన్నంగా ఆధునిక పద్ధతిలో పండగ నిర్వహిస్తున్నారు. – డి.వి.డి.ప్రసాద్, ధర్మ జాగరణ సమితి గిరిజన పరియోజన ప్రముఖ్ -
మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వన దేవత సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెపై కొలువుదీరింది. తొలుత కన్నెపల్లి నుంచి మేడారంలో ఉన్న కన్నతల్లి సమ్మక్క చెంతకు సారలమ్మ చేరుకుంది. రాత్రి 10.45 గంటలకు గద్దెలపైకి వచ్చింది. సారలమ్మతోపాటే గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర వైభవంగా మొదలైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి సారలమ్మ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనకమ్మ, కాక భుజంగరావు పూజా క్రతువులు ప్రారంభించారు. 7 గంటల వర కు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. అనంతరం ఆలయం నుంచి రాత్రి 7.09 గంటలకు మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి పూజారులు బయలుదేరారు. మార్గమధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు చేశారు. వంతెన ఉన్నా నీటిలో నుంచే నడుస్తూ వాగును దాటారు. అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత పూజారులు ముగ్గురి రూపాలను గద్దెలపైన ప్రతిష్టించారు.పగిడిద్ద రాజు రాత్రి 10.40కి, గోవిందరాజు 10.42కు, సారలమ్మ 10.45 గంటలకు గద్దెలపై కొలువుదీరారు. సంతాన భాగ్యం కోసం ‘వరం’పట్టిన భక్తులు సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె (వెదురు బుట్ట)లో తీసుకొని కన్నెపల్లి ఆలయం మెట్లు దిగి ముందుకు కదులుతుండగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే భక్తులు గుడి ముందు కింద పడుకుని పొర్లు దండాలతో వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై దాటి వెళ్లారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్, డీఎస్పీలు కొత్త దేవేందర్‌రెడ్డి, విష్ణుమూర్తి, రోప్ పార్టీ ఓఎస్డీ సంజీవ్‌రావు, పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు మూడంచెల రోప్ పార్టీతో భద్రత కల్పించారు. ప్రభుత్వం తరఫున ములుగు జిల్లా కలెక్టర్, ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య హాజరయ్యారు. ఎదురెళ్లి దండాలు పెడుతూ.. మేడారానికి బుధవారం మధ్యాహ్నం వరకు భక్తుల తాకిడి మామూలుగానే ఉన్నా సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా జనం పోటెత్తారు. కన్నెపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకొచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదగా భక్తులు దారి పొడవునా ఇరువైపులా ఎదురెళ్లి దండాలు పెట్టారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం పరవశించింది. ఎమ్మెల్యే సీతక్క తదితరులు కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ఆదివాసీ నృత్యం చేశారు. భారీగా జనం.. కిక్కిరిసిన వనం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకోవ డంతో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం నలువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు, గుడారాలతో కిక్కిరిసిపోయింది. కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. భక్తుల పుణ్య స్నానాలతో జంపన్న వాగు నిండిపోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కన్నెపల్లి నుంచి సారలమ్మ.. చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్క
సాక్షిప్రతినిధి, వరంగల్: భక్తజనమంతా వనమంతా నిండి కుంభమేళాను తలపించే ఆదివాసీల వేడుకకు వేళ అయింది. జనం కదిలి వచ్చి కడలిలా మారే అపురూప సన్నివేశం మేడారం జాతరలో సాక్షాత్కరించనుంది. ఉత్సాహం ఉరకలేసి ఉత్సవంగా మారే సందర్భం రానే వచ్చింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవమైన మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది. గత జాతరకు 1.20 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు ప్రకటించిన అధికారులు, ఈసారి కూడా అదేస్థాయిలో వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది. నాలుగు రోజులు కుంభమేళా.. ఇలా ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలోని ఓ గిరిజన గ్రామం మేడారం. మేడారం జాతరను రెండేళ్లకోసారి నాలుగురోజులపాటు సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలిరోజు ఘట్టం పూర్తవుతుంది. గురువారం సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం కాగా, కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం చూసి తరించి అందరూ పులకించిపోతారు. సమ్మక్కను పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొని జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. 18న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వనప్రవేశం ఉంటుంది. జాతర కోసం భారీ ఏర్పాట్లు... ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేస్తోంది. టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,850 బస్సులను నడుపుతోంది. మేడారం భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు వన్ వే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి పర్యవేక్షిస్తున్నారు. గతంలో రెండే ప్రధాన రోడ్డు మార్గాలుండగా, ఈసారి ఆరింటిని ఏర్పాటు చేశారు. మేడారం జాతర ప్రదేశంలో 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణ కోసం 11 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ జాతర బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు జంపన్న వాగుకు ఇరువైపులా 3.6 కిలో మీటర్ల పొడవునా స్నానఘట్టాలను, విడిది కోసం భవనాలను నిర్మించారు. వన దేవతల గద్దెల పక్కనే ఉన్న వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని వైద్యశాఖ ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్యసేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచింది. 1968 నుంచి.. 1968 నుంచి ప్రభుత్వం ఈ జాతర ఏర్పాట్లు చేస్తోంది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మొదట సమ్మక్క, సారలమ్మ జాతరలు వేర్వేరు గ్రామాల్లో జరిగేవి. సారలమ్మను సైతం కన్నెపల్లి నుంచి మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు చేర్చడం 1960 నుంచి మొదలైంది. అప్పటినుంచి మేడారం జాతర సమ్మక్క–సారలమ్మ జాతరగా మారింది. ప్రభుత్వ పరంగా 1944లోనే మేడారం జాతరపై తహసీల్దారుతో కమిటీ ఏర్పాటైనట్లు రికార్డులు చెబుతుండగా, 1967లో దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. మేడారం బయలెళ్లిన పగిడిద్దరాజు గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో వెలిసిన పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. ఆలయంలో మొక్కులు సమర్పించిన వడ్డెలు (పూజారులు) పగిడిద్దరాజు పడిగెను పట్టుకుని గ్రామం గుండా తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు పోస్తూ ‘వరుడై వెళ్లి మరుబెల్లికి రావయ్యా’అంటూ మొక్కులు చెల్లించారు. రాత్రి కర్లపెల్లి, లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో సేదదీరారు. వారిచ్చిన విందును ఆరగిఆంచి తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి మేడారానికి పయణమవుతారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మేడారం చేరుకుంటామని ప్రధాన పూజారులు పెనక బుచ్చిరాములు, సురేందర్, రాజేష్, పురుష్తోతం తెలిపారు. -
వీపులు పగులుతయ్! పాపాలు నశిస్తయ్! ఈ పండుగ గురించి తెలుసా?
మల్కన్‌గిరి (ఒడిశా): జిల్లాలోని ఖొయిరాపుట్ సమితి, బోండా ఘాటీ ప్రాంతంలో పుష్య పొరబ్ (పండగ) శనివారం సంప్రదాయంగా నిర్వహించారు. తరతరాలుగా ఏటా పుష్య మాసంలో చేసుకునే ఈ పండగలో బోండా జాతి గిరిజనులు నెలంతా అడవి తల్లికి పూజలు చేస్తారు. చివరి 3 రోజులను జాండీ ఉత్సవంగా భావించి, అడవిలో పుట్టి పెరిగిన కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలో బోండా జాతి గిరిజనులు ఇలా దెబ్బలు తినడం ద్వారా ఏడాది అంతా చేసిన పాపాలు నశిస్తాయని వీరి నమ్మకం. శనివారం ఉదయం జరిగిన ఈ వేడుకలో ముదిలిపొడ, దుమురుపొడ, తులగురం, బైగూడ, హంద్రహల్, బద్బేల్ గ్రామస్తులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. (చదవండి: హిమాచల్ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్) గిరిజనుడి వీపుపై గాయాలు -
నాగోబా మహాపూజ; చెట్టెక్కిన మెస్రం అల్లుడు
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా మహాపూజ సందడి మొదలైంది. మహాపూజ కోసం మెస్రం వంశీయులు కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తినమడుగు నుంచి పవిత్ర గంగాజలం సేకరించి తిరిగి వచ్చారు. ముందుగా ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పవిత్ర జలాన్ని కిందపెట్టకుండా మర్రి చెట్టుపై ఉంచి పూజలు చేశారు. అనంతరం నాగోబా ఆలయానికి పవిత్ర జలాన్ని ఆదివారం సాయంత్రం తీసుకెళ్లాల్సి ఉండటంతో, వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయుల అల్లుడు మర్రి చెట్టు ఎక్కి పవిత్ర జలాన్ని కటోడా (పూజారి)కి అందజేశారు. 11న మహాపూజ మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలు చేసి ఈనెల 11న పుష్యమాసం అమావాస్యనుపురస్కరించుకుని గోదావరి నది హస్తీన మడుగు నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన గంగా జలంతో నాగోబా ఆలయాన్ని శుద్దిచేసి మహాపూజలతో నాగోబా జాతరను ప్రారంభించనున్నట్టు మెస్రం వంశం పెద్దలు తెలిపారు. చదవండి: ఆ ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఎందుకంటే! ఉల్లి: ఒక్క ఎకరాలోనూ పంట వేయని రైతులు -
ప్రకృతి ఆరాధనే.. సీత్లా పండుగ
ఆత్మకూర్(సూర్యాపేట): ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని, చెరువులు, కుంటలు నిండి సమృద్ధిగా పంటలు పండాలని గిరిజనులు జరుపుకునే పురాతన సంప్రదాయ పండుగ సీత్లాభవాని (దాటుడు) పండుగ. అతిపురాతన ఈ పండుగను తమ తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏటా పెద్దపుష్యమి కార్తెలో వచ్చే మంగళవారాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆషాఢ మాసం పెద్దపుష్యమి కార్తెలోని తొలి మంగళవారం ఇప్పటికే చాలాప్రాంతాల్లోని తండాల్లో సీత్లాపండుగను నిర్వహించుకోగా.. మిగిలిన ప్రాంతాల్లో గిరిజనులు పండుగకు సన్నద్ధమై ఉన్నారు. ప్రతి తండాలో ఇక్కడే.. సీత్లాపండుగను ప్రతి తండాలో తూర్పు దిక్కున ఉండే చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో సీత్లాభవాని అందరి కంటే చిన్నది. సీత్లామాత ప్రతిమ మధ్యభాగంలో ఉంచి మిగతా భవానీలను ఇరువైపులా ముగ్గురు అక్కల చొప్పున ఉండేలా తూర్పున చూసే విధంగా ప్రతిష్టిస్తారు. భవాని ప్రతిమల ఎదురుగా కొద్దిదూరంలో లుంకడ్యా పేరు మీద రాయితో చేసిన ప్రతిమను భవానీల వైపు చూసే విధంగా ఉంచుతారు. లుంకడ్యా ప్రతిమ మీదపడ్డ నీరు గుంతలో పడేలా గుంతను తీసి ఉంచుతారు. పండుగ విధానం.. పునర్వసు కార్తెలో ఏదైనా ఒక మంగళవారం ఉదయాన్నే తండా ప్రజలంతా స్నానాలు ఆచరించి తమ ఇళ్లలో తమ ఇష్టదేవతలకు పూజలు నిర్వహిస్తారు. సీత్లాపూజను ఇతర పండుగల మాదిరిగా కాకుండా చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. పూజారి సీత్లాపూజ అయ్యే వరకు ఉపవాసంతో ఉంటారు. భవానీల ప్రతిమలకు గేరు (జాజు) పూసి పూలు, మామిడాకులతో అలంకరిస్తారు. రైతులు తమ పశువులను సింగారించుకుని దాటుడు కోసం తయారు చేసుకుంటారు. ఒకరోజు ముందు జొన్నలు, పప్పు ధాన్యాలు కలిపి నానబెట్టిన తర్వాత తయారైన ఘుగ్రిని (గుగ్గిళ్లను) నైవేద్యంగా తీసుకెళ్తారు. దీన్నే ‘వాంసిడో ’ అంటారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద పూజలు పూర్తయిన తర్వాత లాప్సి (పాయసం), గుగ్గిళ్లు (వాంసిడో), ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు రూపాయి బిళ్లలను కాకోటి (ఒక వెడల్పాటి చెక్క పాత్ర)లో ఉంచి తండా యువతులు తలపై మోసుకుని సీత్లా పూజ ప్రదేశానికి తీసుకెళ్తారు. సంప్రదాయం ప్రకారం భవానీల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆనాదిగా వస్తున్న జంతుబలి (గొర్రెపోతు) ఇచ్చి ఓ పేగును భవానీల ప్రతిమల నుంచి లుంకడ్యా ప్రతిమ వ రకు పరుస్తారు. తండా పశువులన్నింటి పరిచిన పేగు పైనుంచి దాటిస్తుండగా.. పూజారి వాంసిడో మిశ్రమాన్ని అన్ని పశువులపై చల్లుతారు. అందుకే ఈ పండుగను‘గొడ్లు దాటుడు పండుగగా’ పిలుస్తారు. ఈ క్రమంలో గిరిజన మహిళలు ఆటపాటలతో నృత్యాలు చేస్తారు. బలిచ్చిన మాంసంతో సలోయి వండి తండావా సులంతా అమ్మవార్లకు సమర్పించుకుంటారు. సీత్లాపండుగ నేపథ్యం.. పూర్వం నాటి నుంచి గిరిజనులు పశుసంపదను అధికంగా కలిగి ఉండి వ్యవసాయమే జీవన ఆధారంగా వ్యవసాయ క్షేత్రాల్లోనే గుడిసెలు వేసుకుని జీవించేవారు. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పులు, పచ్చని గడ్డితో గొర్రెలు, మేకలు, ఆవులకు వివిధ రోగాలు వస్తుండేవి. రోగాల బారిన పడి తమ పశుసంపద మొత్తం రోజురోజుకూ తగ్గిపోయి తండావాసులు తల్లాడిల్లుతున్న క్రమంలో.. ఓ రోజు రాత్రి తండాపెద్దకు గిరిజన దేవతలు మేరామ, తోళ్జా, మాత్రాల్, కంకాళి, హీంగ్లా, ద్వాళాంగర్, సీత్లా దేవతలు కలలో కనిపిస్తారు. సీత్లాదేవత తండాపెద్దతో మాట్లాడి తండావాసులంతా కలిసి తనకు జంతుబలి ఇవ్వాలని చెబుతుంది. కలలో వచ్చిన దేవతల విషయాన్ని తండావాసులకు చెప్పి జంతుబలి ఇస్తారు. నాటినుంచి నేటి వరకు తమ పశుసంపదను కాపాడుకునేందుకు, వర్షాలు కురవాలని ఏటా పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికితోడుగా మరో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. లుంకడ్యా నేపథ్యం.. ఓరోజు సీత్లాభవాని తన ఆరుగురి అక్కలతో కలిసి నదిలో స్నానం చేస్తుండగా లుంకడ్యా అనే వ్యక్తి వారి వస్త్రాలు తీసుకుని చెట్టు ఎక్కాడని.. విషయం తెలుసుకున్న సీత్లాభవాని మంత్రశక్తితో అతన్ని చెట్టు నుంచి దింపి ఇకపై ఏడుగురు అక్కాచెల్లెళ్లకు కాపలా కాసేలా శపించినట్లు చెప్పుకుంటారు. -
నల్లమల ముస్తాబు
అచ్చంపేట: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో జరిగే బౌరాపూర్ చెంచుల పండుగ ఆదివాసీ చెంచుల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి నల్లమల ముస్తాబైంది. ఏటా శివరాత్రికి నల్లమలలోని బౌరాపూర్ భ్రమరాంబ ఆలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘చెంచుల పండుగ’ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈనెల 20 నుంచి 22వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. పురాతన ఆలయంలో కొలువుదీరిన భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామికి చెంచులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరిగే ఉత్సవాల తరహాలోనే ఇక్కడ స్వామికి కల్యాణం నిర్వహిస్తారు. కొన్నేళ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న చెంచుల పండుగను ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ నుంచి అధికారికంగా నిర్వహిస్తుండటంతో పూర్వవైభవం సంతరించుకుంటుంది. ప్రభుత్వం ఈఉత్సవాలకు రూ.12లక్షలు విడుదల చేసింది. అడవులు, కొండలు, వణ్యప్రాణుల మధ్యన ప్రకృతి ఒడిలో జీవనాన్ని కొనసాగిస్తున్న ఆదివాసీల పండగతో అడవితల్లి పులకించనున్నది. ఉత్సవాల కార్యక్రమాలు ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు, అభివద్ధి కార్యక్రమాలపై అవగాహన, 20న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వాగతోపన్యాసం కార్యక్రమాలు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 12గంటల వరకు చెంచుల సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు, చెంచుల ఆట–పాట సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి. 21న 11గంటలకు భ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి కల్యాణం, 22న ప్రత్యేక పూజలు ఉంటాయి. నల్లమల చెంచులతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబా ద్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చెంచులు అధిక సంఖ్యలో వస్తారు. జాతరకు వెల్లేదిలా జాతరకు ఆర్టీసీ బస్సులు నడుపుతారు. బౌరాపూర్‌లో జరిగే జాతరకు అమ్రాబాద్ మండలం మన్ననూర్ నుంచి 15కిలో మీటర్ల దూరంలో పర్హాబాద్ చౌరస్తా అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే ప్రధాన రహదారి నుంచి పదిహేను కిలోమీటర్లు అడవిలోనూ ప్రయాణం చేయాలి. ఏపీ నుంచి వచ్చేవారు శ్రీశైలం నుంచి పర్హాబాద్ చౌరస్తా చెక్‌పోస్టు వద్దకు వచ్చి బౌరాపూర్ చేరుకోవచ్చు. ఐటీడీఏ పీఓ వెంకటయ్య అధికారుల సహకారంతో ఈవేడుకలు నిర్వహిస్తున్నారు. అప్పాపూర్ సర్పంచ్ బాల గురువయ్య, ఆలయ కమిటీ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. -
డప్పు కొట్టిన మంత్రి చిందేసిన కలెక్టర్
రాయగడ: ఆదివాసీ సంస్కృతి, కళ, పండుగలు, భాష, పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివాసీ పండగల్లో ఒకటైన రాయగడ జిల్లా చొయితి మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. చొయితి మహోత్సవంలో ఆదివాసీ కళ, సంస్కృతులకు వేదికను కల్పిస్తూ మారుమూల గ్రామీణ కళాకారులను ప్రోత్సహిస్తూ జిల్లా, రాష్ట్ర అంతర్ రాష్ట్ర స్థాయి కళాకారులకు కూడా అవకాశం కల్పిస్తున్న చొయితి మహోత్సవం ఏటా డిసెంబరు 26వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరుపుకోవడం అనవాయితీ. ఈ సంవత్సరం 30వ తేదీన చొయితి ఆఖరి రోజు కావడంతోచొయితి మహోత్సవ కమిటీ సభ్యులు ఆడంబరంగా ముగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసీ మంత్రి జగన్నాథసారక, డీఆర్డీఏ పీడీ అమృతరుతురాజులు ఆదివాసీ సంప్రదాయ వాయిద్యం అయిన డప్పును చొయితి వేదికపై వాయించగా కలెక్టర్ ప్రమోద్‌కుమార్ బెహరా, రాయగడ ఎంఎల్ఏ మకరందముదులి సహా ఇతర అతిథులు, ఆదివాసీ మహిళలు లయబద్ధంగా వేదికపై నృత్యం చేసి వేలాది మంది ప్రజల మదిలో సంతోషం నింపారు. ముగింపు ఉత్సవానికి అతిథులుగా హాజరైన గుణుపురం ఎంఎల్ఏ రఘునాథ్ గొమాంగో, రాష్ట్ర బిజూ స్వాస్థ్య కల్యాణ్ యోజన అడ్వయిజర్ సుధీర్దాస్లు మాట్లాడుతూ భూమండలం పుట్టిన తరువాత మొదటి జన్మించిన జాతి ఆదివాసీ జాతి అని, వారి కళ సంస్కృతులు, ఆచారాలు నేటి వరకు జీవించి ఉన్నాయని, నేడు ఆధునిక విజ్ఞానం, ఆధునిక వైద్యం, వారి కళల నుండి జన్మించినవేనన్నారు. నేటికీ ఆదివాసీలు స్వయంగా పండించే ఆహారధాన్యాలు తినడం, సొంతంగా నేసుకునే వస్త్రాలు ధరించడం, అటవీ వనమూలికలతో ఔషధాలను స్వయంగా తయారు చేసుకోవడం వారి సంస్కృతి అని, ఆదివాసీ సంస్కృతితో ఏ ఒక్క సంస్కృతి కూడా పోటీ పడలేదని, నేటికీ ఈ సంస్కృతులు జీవించి ఉండగా వాటిని ప్రపంచవేదికపైకి తీసుకురావడమే చొయితి మహోత్సవం లక్ష్యమని వివరించారు. రూ. 6 కోట్లకు పైగా వ్యాపారం చొయితి మహోత్సవం సందర్భంగా జీసీడీ గ్రౌండ్లో 308 దుకాణాలు ఏర్పాటు చేయగా ఐదు రోజుల్లో రూ.6 కోట్ల 60 లక్షల వ్యాపారం జరిగినట్లు సమాచారం. మహోత్సవం ఆఖరిరోజున ఒడిస్సీ డ్యాన్స్, చౌ డ్యాన్స్, బెంగాలీ బిహు డ్యాన్స్, థింసా, మణిపురి, ఒరే ఒ బేటి తు లే ఉడాన్, నృత్యకళ పరిషత్ వారి నృత్యం, ఓం నమశ్శివాయ నృత్యం, ఆదివాసీ నృత్యాలు, దులాహభీహ రాజస్థాన్ గుమ్మర, లోహరి, ప్యూజన్, సంబల్పురి నృత్యాలతో సహా చొయితి సీడీలను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారులను అతిథులు సన్మానించారు. ఐదు రోజుల పాటు జిల్లా పోలీసు యంత్రాంగం 380 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఆసాంఘిక చర్యలు జరగలేదదని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. విభిన్న ప్రభుత్వ పథకాలపై ప్రజలకు చైతన్యం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం విభిన్న శాఖల అభివృద్ధి పథకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. -
గిరిజనులతో చిందేసిన రాహుల్
-
రాహుల్ గాంధీ వెరైటీ డాన్స్ చూశారా?
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. సంప్రదాయ తలపాగా ధరించి... డోలు వాయిస్తూ ఉల్లాసంగా గడిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ గిరిజన నృత్య మహోత్సవాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాహుల్ వేదిక మీద సందడి చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ మేరకు... ‘ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వాన్ని రక్షించేందుకు ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా ఈ ఉత్సవంలో 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆరు దేశాలకు చెందిన దాదాపు 1350పైగా గిరిజన కళాకారులు పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనన్ను ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సహా కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు హాజరయ్యారు. కాగా ఈ నృత్యోత్సవంలో గిరిజన వివాహాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు, వ్యవసాయ పనులు తదితర విషయాలను ప్రతిబింబించేలా కళాకారులు నృత్యరీతులు ప్రదర్శించనున్నారు. మొత్తం 29 గిరిజన సమూహాలు 43కు పైగా సంప్రదాయ పద్ధతులను నృత్య రూపంలో ఆవిష్కరించనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర నాయకులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. #WATCH Chhattisgarh: Congress leader Rahul Gandhi takes part in a traditional dance at the inauguration of Rashtriya Adivasi Nritya Mahotsav in Raipur. pic.twitter.com/HpUvo4khGY — ANI (@ANI) December 27, 2019 -
నేటి సిరిమానోత్సవానికి సర్వం సన్నద్ధం
మక్కువ(సాలూరు): ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ఆరాధ్యదైవం శంబర పోలమాంబ తోలేళ్ల ఉత్సవం సోమవారం సంప్రదాయ బద్ధంగా జరిగింది. సోమవారం రాత్రి అమ్మవారి ఘటాలకు ఊరేగించిన అనంతరం ప్రధానవీధిలో అమ్మవారి ఘటాలను ఉంచి, కారుగేదె వాలకాలను నిర్వహించారు. మహిషాసుర వేషాధారణ, పోతురాజు వేషధారణ, మేళతాళాల నడుమ కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన రైతులు ఉపవాసాలు ఉండి రాత్రి ఏరోత్సవం నిర్వహించారు. గ్రామపెద్దలంతా జన్నివారి ఇంటికి వెళ్లి జన్నివారిని పిలిచి ఏరోత్సవం నిర్వహించారు. జన్నివారి, గిరిడవారి ఇంటి నుంచి విత్తనాలను తీసుకొని వచ్చి అమ్మవారి ముందుంచి పూజ చేస్తారు. అమ్మవారికి అక్షింతలు చల్లి, రైతులు కాళ్లì మీద(పశువులేర్లుకు పూచిన పూజ) నిలబడి రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గిరడవారు తెచ్చిన విత్తనాలను అమ్మవారి వద్ద పూజలు చేసిఅనంతరం రైతులు తలోపిడికెడు తీసుకొని వెళ్లి పంటలు సాగుచేసిన సమయంలో వారి విత్తనాల్లో వీటిని కలుపుతారు. తోలేళ్లనాడు సాధారణ రద్దీ అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి భక్తుల తాకిడి సాధరణంగానే ఉంది. చదురుగుడి వెనుక, వనంగుడి వద్ద భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా దేవాదాయ శాఖాధికారులు ఉచితదర్శనం, రూ.10లు, రూ. 50ల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు ప్రధానాలయంలో ఉన్న శంబర పోలమాంబను, వనంగుడిలోని అమ్మవారిని దర్శించుకున్నారు. వనంగుడి వెనుకన ఉన్న వేపచెట్టుకు పూజలు చేశారు. కోళ్లు, చీరలు, తలనీలాలు సమర్పించారు. జాతరలో పోలీసులు పహారా జాతర సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున పహరా కాశారు. సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలు గ్రామంలోని అన్ని వీధుల్లో పర్యటించారు. ప్రధానాలయం నుంచి, వనంగుడి వరకు అడుగడుగున మోహరించారు. ఓఎస్డీ రామ్మోహన్, ఏఎస్పీ సుమిత్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. అమ్మవారిని ఓఎస్డీ రామ్మోహన్ దర్శించుకున్నారు. అనంతరం సిరిమాను తిరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700మంది పోలీసులు, సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, ఎస్టీఎఫ్ బలగాలు బందోబస్తు నిర్వహించారు. సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ చదురుగుడి, వనంగుడి ఆలయాల వద్ద క్యూలైన్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సిరిమాను తిరిగే ప్రదేశాలను పరిశీలించారు. అయిదుచోట్ల వైద్యశిబిరాలు శంబర పీహెచ్సీ, వైఎస్ఆర్ విగ్రహం వద్ద, వనంగుడి, గ్రంథాలయం, క్యూలైన్లవద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. గోముఖి నది వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేయగా భక్తులు తలనీలాలను సమర్పించి, పక్కనే ఉన్న గోముఖినదిలో స్నానాలు చేసి, వస్త్రమార్పిడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి శంబర పోలమాంబ సిరిమాను సంబరాన్ని లక్షలాది మంది తిలకించేందుకు వీలుగా సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, ఓఎస్డీ రామ్మోహన్, ఏఎస్పీ సుమిత్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వి.ఎస్.ఎన్.మూర్తి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర, మూడు గంటల మధ్య సిరిమానోత్సవం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందుకు అవసరమైన 30అడుగుల సిరిమానును తయారుచేశారు. సిరిమానును పూజారి జన్ని పేకాపు జగదీ అలియాస్ భాస్కరరావు అధిరోహించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ తెలిపారు. సిరిమాను తిరిగే ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన అనంతరం పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు. క్యూలైన్ల వద్ద మంచినీరు, పాలు అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించి, చెత్తను వెంటవెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డీపీవో సత్యనారాయణకు తెలిపారు. ప్రసాదాలు సిద్ధం జాతరకు వచ్చే భక్తులకోసం 40వేల పులిహోర పొట్లాలు, 25వేల లడ్డూలను తయారుచేసినట్లు ఈవో ప్రకాశరావు తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ మూర్తి పర్యవేక్షణలో 100 మంది దేవాదాయశాఖ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వనంగుడి, రామాలయం, గ్రంథాలయం వద్ద ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జాతరకు వచ్చిన భక్తులకు సమాచారం అందించేందుకు చదురుగుడి క్యూలైన్లు, ప్రధానరహదారివద్ద కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేశారు. డీపీవో సత్యనారాయణ, డీఎల్పీఓ రాజు పర్యవేక్షణలో పారిశుద్ధ్యపనులు చురుగ్గా సాగుతున్నాయి. 130 మంది పారిశుద్ధ్యకార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు, ఇద్దరు మేస్త్రీలు పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు జరిపిస్తున్నారు. సిరిమాను అధిరోహించడం పూర్వజన్మ సుకృతం సిరిమాను అధిరోహించడం పూర్వజన్మ సుకృతమని పూజారి జన్ని పేకాపు జగదీ తెలిపారు. ఈయన తండ్రి త్రినాథ రెండేళ్లక్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో, త్రినాథ తమ్ముడు రామారావు గతేడాది సిరిమానును అధిరోహించగా ఈ ఏడాది త్రినాథ కొడుకు జగదీ కొత్తగా సిరిమానును అధిరోహించనున్నారు. పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్తులు సిరిమానోత్సవం తిలకించేందుకు ఒడిశా, చత్తిస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల భక్తులతోపాటు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకు పైబడి భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వారికోసం అయిదుచోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచితం, రూ. 50, రూ. 10ల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, గర్భిణులకు ప్రత్యేక దర్శనం క్యూలైన్ ఏర్పాటుచేశారు. జాతరను రెండు డ్రోన్ కెమెరాలు, 25 సీసీ కెమెరాలతో నిఘా చేపడుతున్నామని ఓఎస్డీ రామ్మోహన్ తెలిపారు. జాతరకు 130 బస్సులు జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఏడు డిపోల నుంచి 130 ఆర్టీసీ బస్సులు నడుపనున్నట్లు పార్వతీపురం డిపో మేనేజర్ డి.జాన్‌సుందరం తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైతే అదనపు సర్వీసులను నిర్వహిస్తామన్నారు. చేరుకోవడం ఇలా... ♦ మక్కువ నుంచి కవిరిపల్లి మీదుగా శంబరకు చేరుకోవాలంటే 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ♦ సాలూరు నుంచి మక్కువ మీదుగా శంబర చేరుకోవడానికి 25 కిలోమీటర్లు ప్రయాణించాలి. ♦ పార్వతీపురం నుంచి తాళ్లబురిడి మీదుగా శంబర చేరుకునేందుకు 47 కిలోమీటర్లు ప్రయాణించాలి. ♦ పార్వతీపురం నుంచి చినబోగిలి మీదుగా శంబర చేరుకోవడానికి 34 కిలోమీటర్లు ప్రయాణించాలి. -
వైభవంగా ‘కాళూబాబా’ ఉత్సవాలు
ఆకట్టుకున్న గిరిజనుల నృత్యాలు సంతానం కోసం మహిళల వేడుకోలు ఉత్సవాల్లో పాల్గొన్న ఖేడ్, జుక్కల్ ఎమ్మెల్యేలు వేల సంఖ్యలో పాల్గొన్న గిరిజనులు కంగ్టి: మండలంలోని తడ్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎడ్లరేగడి తండాలోని జ్వాలాముఖి కాళుబాబా ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలు ఏటా ఆశ్వాయుజ మాసంలోని మొదటి మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ నిత్యపూజారి మంగళ్‌చంద్ మహారాజ్, జవహర్ మహారాజ్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కొనసాగిన గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాకు చెందిన గిరిజనులతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, గాంధారీ, కామారెడ్డి, బాన్సువాడ తదితర ప్రాంతాల నుంచి దాదాపు 5 వేలకు పైగా గిరిజనులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. నృత్యాల్లో దాదాపు 40కి పైగా బృందాలు పాల్గొన్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు వేడుకలు, నృత్యాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. నృత్యాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు మంగల్‌చంద్ మహారాజ్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే పాల్గొని జ్వాలాముఖి కాళుబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవునెయ్యితో ఆలయం ఆవరణలో హోమం నిర్వహించారు. సంతానం లేని మహళలకు హోమంలో వేసిన చెరుకు గడలు ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. దీంతో అధిక సంఖ్యలో మహిళలు ప్రసాదం కోసం పోటీపడ్డారు. కోరికలు తీరిన దాదాపు 100 మంది ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. వసతి కోసం సత్రం ఏర్పాటు చేయడం విశేషం. ఉత్సవాల కోసం భారీగా నిధులు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే మాట్లాడుతూ.. సేవాలాల్ ఉత్సవాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి నిర్వహింస్తుందన్నారు. దీంతో పాటు సేవాలాల్ పూజారులకు తెలంగాణ ప్రభుత్వం గౌరవవేతనం చెల్లిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో కోట ఆంజనేయులు, నారాయణ, దత్తుసేఠ్, పండరి, రమేశ్, మాణిక్‌రెడ్డి, రాజుపటేల్, శివాజీరావు, సాయాగౌడ్, సిద్ధు, రాజప్ప, సంజు, రాములు, వెంకట్రాంరెడ్డి, విశ్వనాథ్, తహసీల్దార్ రాజయ్య, ఎస్సై నానునాయక్, ఎంపీడీఓ మధుసూదన్, పిట్లం మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, నర్సాగౌడ్, వాసరి రమేశ్, ప్రతాప్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
గిరిజన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించి గిరిజనుల హక్కు దినంగా పాటించాలని తెలంగాణ గిరిజన సఘం ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మానాయక్ మాట్లాడుతూ నేటికి గిరిజనులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు ఉన్న హక్కులను కూడ కాలరాస్తున్నారని విమర్శించారు. అనేక మంది గిరిజనులు కనీస సౌకర్యాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు.కూడు, గూడు, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న ప్రభుత్వాలు పట్టన ట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామాకాలు గిరిజనుల ధరి చేరటం లేవని అన్నారు. తెలంగాణలో గిరిజనులు 10 శాతం ఉంటే 6 శాతమే రిజర్వేస్లను అమలు చేస్తూ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు.పట్టణాలకు దూరంగా ఉన్న గిరిజన తండాలకు కనీస సౌకర్యాలు లేక సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు.ఎన్నికల సమయంలో తండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తామని మోసం చేస్తున్నారని విమర్శించారు.విద్య హ క్కు చట్టాన్ని అమలు చేయకుండా మాటలతో గారడి చేస్తున్నారని అన్నారు. ప్రపంచ గిరిజన దినోత్సవం స్పూర్తిగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు చందునాయక్, రాంకుమార్, శేఖర్, కృష్ణ, శోభన్ నాయక్‌లు పాల్గొన్నారు. -
ఇటుకల పండుగలో విషాదం: యువతి మృతి
- గిరిజనుల ఇటుకల పండుగ - బ్రేకులు ఫెయిలై జనంపైకి దుసుకెళ్లిన ప్రైవేటు బస్సు -యువతి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు -ఆగ్రహించిన గిరిజనం... దాడిలో డ్రైవర్, కండక్టర్లపై దాడి -డ్రైవర్ పరిస్థితి విషమం సీలేరు (విశాఖ జిల్లా) : గిరిజనులు సంబరంగా జరుపుకునే ఇటుకల పండుగలో విషాదం చోటుచేసుకుంది. గుమ్మిరేవుల పంచాయతీ బోడిరాయి గ్రామం వద్ద గిరిజనులు ఆదివారం సాయంత్రం ఇటుకల పండుగ నిర్వహించారు. వారంతా రోడ్డుపక్కన ఆనందోత్సాహాలతో గడుపుతున్న వేళ అటుగా వచ్చిన ఒక ప్రైవేటు బస్సు బ్రేకులు ఫెయిలై జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గిరిజన యువతి కాసులమ్మ(22) అక్కడికక్కడే మృతిచెందగా, సీతాపుట్టు మరో మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆగ్రహించిన జనం బస్సు కండక్టర్, డ్రైవర్లకు దేహశుద్ది చేశారు. ఈ దాడిలో డ్రైవర్ కొర్ర సెలూన్, కండక్టర్ రవి తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. -
వన దేవతలకు ఒక్క ఎకరమేనా!
వరంగల్: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సగటున కోటి మంది భక్తులు వస్తారు. జాతర సందర్భంగా వందల ఎకరాల్లో ఎటు చూసినా భక్తులే కనిపిస్తారు. జాతర జరిగే ఏడాది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఇంతటి ప్రాశస్థ్యం ఉన్న ఆలయానికి ఉన్న భూమి కేవలం ఒక ఎకరం మాత్రమే. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. అయినా.. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించడం లేదు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఇక్కడ 155 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలో 155 ఎకరాల ప్రభుత్వ భూముల్లో, దీని చుట్టూ ఉండే అటవీ శాఖకు చెందిన వందల ఎకరాల్లో భక్తులు బస చేస్తారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నా వన దేవతలకు ప్రత్యేకంగా భూమి కేటాయించే దిశగా ఏ ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదు. శాశ్వత భూమిలేదు జాతర జరిగే సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాత్రమే వన దేవతల ఆలయం పేరిట దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాంకేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. మేడారం జాతర జరిగే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ భూములను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. శాశ్వతంగా మాత్రం వన దేవతలకు భూములను కేటాయించలేదు. తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న ప్రస్తుత జాతర మొదలయ్యే వరకైనా వన దేవతలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తుందనే ఆశాభావంతో ఆదివాసీలున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో వన దేవతల ఆలయానికి ప్రభుత్వ భూములను బదలాయించేందుకు ప్రయత్నించాలని వారు కోరుతున్నారు. -
సమ్మక్క-సారలమ్మ జాతరకు 101 కోట్లు
హైదరాబాద్: తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లకు గురువారం తెలంగాణ ప్రభుత్వం రూ.101 కోట్లు విడుదల చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈనెల 13న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించే సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, శాంతి భద్రతల పై అధికారులతో సీఎం చర్చించనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నతాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2013 ఏప్రిల్ నుంచి పెరిగిన ధరల ప్రకారం కాంట్రాక్టర్లకు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు. -
ఫిబ్రవరిలో గిరిజన సంబురం
- ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు వనజాతర సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర 2016 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పూజారులు (వడ్డెలు) ఆదివారం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లు ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ఈసారి ముందుగానే తేదీ లను వెల్లడించారు. నాలుగు రోజులపాటు పతాక స్థాయిలో జరగనున్న జాతర వివరాలను తెలియజేశారు. 2016 ఫిబ్రవరి 17న(బుధవారం) సారలమ్మను గద్దెపైన ప్రతిష్టిస్తారు. అదేరోజు గోవింద రాజు, పగిడిద్దరాజులు గద్దెలపై ఆశీనులవుతారు. 18న(గురువారం) చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. 19న(శుక్రవారం) భక్తులు మొక్కులు సమర్పిస్తారు. 20న తల్లులు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. తెలంగాణలో తొలిసారిగా మహాజాతర జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే చర్యలు మొదలుపెట్టింది. ఏర్పాట్ల కోసమే మహాజాతర తేదీలను ఈసారి ముందుగా ప్రకటించినట్లు మేడారం పూజారు(వడ్డె)ల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. యాదగిరి ఇతర పుణ్యక్షేత్రాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసిన తరుణంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామన్నారు. మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996 నుంచి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మేడారం గత జాతర 2014 ఫిబ్రవరి 12 నుండి 15 వరకు జరిగింది. అంచనాల కంటే అధికంగా 1.30 కోట్ల మంది భక్తులు వచ్చారు. భక్తుల సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం రూ.95 కోట్లను కేటాయిం చింది. అయినా, భక్తులకు తగినట్లు ఏర్పా ట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి.