బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వన దేవత సారలమ్మ బుధవారం రాత్రి మేడారం గద్దెపై కొలువుదీరింది. తొలుత కన్నెపల్లి నుంచి మేడారంలో ఉన్న కన్నతల్లి సమ్మక్క చెంతకు సారలమ్మ చేరుకుంది. రాత్రి 10.45 గంటలకు గద్దెలపైకి వచ్చింది. సారలమ్మతోపాటే గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర వైభవంగా మొదలైంది.
కన్నెపల్లి నుంచి మేడారానికి సారలమ్మ
బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనకమ్మ, కాక భుజంగరావు పూజా క్రతువులు ప్రారంభించారు. 7 గంటల వర కు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. అనంతరం ఆలయం నుంచి రాత్రి 7.09 గంటలకు మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి పూజారులు బయలుదేరారు. మార్గమధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు చేశారు. వంతెన ఉన్నా నీటిలో నుంచే నడుస్తూ వాగును దాటారు. అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత పూజారులు ముగ్గురి రూపాలను గద్దెలపైన ప్రతిష్టించారు.పగిడిద్ద రాజు రాత్రి 10.40కి, గోవిందరాజు 10.42కు, సారలమ్మ 10.45 గంటలకు గద్దెలపై కొలువుదీరారు.
సంతాన భాగ్యం కోసం ‘వరం’పట్టిన భక్తులు
సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె (వెదురు బుట్ట)లో తీసుకొని కన్నెపల్లి ఆలయం మెట్లు దిగి ముందుకు కదులుతుండగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే భక్తులు గుడి ముందు కింద పడుకుని పొర్లు దండాలతో వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై దాటి వెళ్లారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్, డీఎస్పీలు కొత్త దేవేందర్‌రెడ్డి, విష్ణుమూర్తి, రోప్ పార్టీ ఓఎస్‌డీ సంజీవ్‌రావు, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు మూడంచెల రోప్ పార్టీతో భద్రత కల్పించారు. ప్రభుత్వం తరఫున ములుగు జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి పీవో కృష్ణ ఆదిత్య హాజరయ్యారు.
ఎదురెళ్లి దండాలు పెడుతూ..
మేడారానికి బుధవారం మధ్యాహ్నం వరకు భక్తుల తాకిడి మామూలుగానే ఉన్నా సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా జనం పోటెత్తారు. కన్నెపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకొచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదగా భక్తులు దారి పొడవునా ఇరువైపులా ఎదురెళ్లి దండాలు పెట్టారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం పరవశించింది. ఎమ్మెల్యే సీతక్క తదితరులు కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ఆదివాసీ నృత్యం చేశారు.
భారీగా జనం.. కిక్కిరిసిన వనం
సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకోవ డంతో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం నలువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు, గుడారాలతో కిక్కిరిసిపోయింది. కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. భక్తుల పుణ్య స్నానాలతో జంపన్న వాగు నిండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment