ప్రకృతి ఆరాధనే.. సీత్లా పండుగ | Seetlabhavani Tribal Festival Special Story In Suryapet | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఆరాధనే.. సీత్లా పండుగ

Published Sat, Jul 11 2020 10:32 AM | Last Updated on Sat, Jul 11 2020 10:32 AM

Seetlabhavani Tribal Festival Special Story In Suryapet - Sakshi

భవానీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న గిరిజన మహిళలు (ఫైల్‌)

ఆత్మకూర్(సూర్యాపేట): ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని, చెరువులు, కుంటలు నిండి సమృద్ధిగా పంటలు పండాలని గిరిజనులు జరుపుకునే పురాతన సంప్రదాయ పండుగ సీత్లాభవాని (దాటుడు) పండుగ. అతిపురాతన ఈ పండుగను తమ తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏటా పెద్దపుష్యమి కార్తెలో వచ్చే మంగళవారాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆషాఢ మాసం పెద్దపుష్యమి కార్తెలోని తొలి మంగళవారం ఇప్పటికే చాలాప్రాంతాల్లోని తండాల్లో సీత్లాపండుగను నిర్వహించుకోగా.. మిగిలిన ప్రాంతాల్లో గిరిజనులు పండుగకు సన్నద్ధమై ఉన్నారు.

ప్రతి తండాలో ఇక్కడే..
సీత్లాపండుగను ప్రతి తండాలో తూర్పు దిక్కున ఉండే చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో సీత్లాభవాని అందరి కంటే చిన్నది. సీత్లామాత ప్రతిమ మధ్యభాగంలో ఉంచి మిగతా భవానీలను ఇరువైపులా ముగ్గురు అక్కల చొప్పున ఉండేలా తూర్పున చూసే విధంగా ప్రతిష్టిస్తారు. భవాని ప్రతిమల ఎదురుగా కొద్దిదూరంలో లుంకడ్యా పేరు మీద రాయితో చేసిన ప్రతిమను భవానీల వైపు చూసే విధంగా ఉంచుతారు. లుంకడ్యా ప్రతిమ మీదపడ్డ నీరు గుంతలో పడేలా గుంతను తీసి ఉంచుతారు.

పండుగ విధానం..

  • పునర్వసు కార్తెలో ఏదైనా ఒక మంగళవారం ఉదయాన్నే తండా ప్రజలంతా స్నానాలు ఆచరించి తమ ఇళ్లలో తమ ఇష్టదేవతలకు పూజలు నిర్వహిస్తారు.
  • సీత్లాపూజను ఇతర పండుగల మాదిరిగా కాకుండా చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. పూజారి సీత్లాపూజ అయ్యే వరకు ఉపవాసంతో ఉంటారు.
  • భవానీల ప్రతిమలకు గేరు (జాజు) పూసి పూలు, మామిడాకులతో అలంకరిస్తారు. రైతులు తమ పశువులను సింగారించుకుని దాటుడు కోసం తయారు చేసుకుంటారు. ఒకరోజు ముందు జొన్నలు, పప్పు ధాన్యాలు కలిపి నానబెట్టిన తర్వాత తయారైన ఘుగ్రిని (గుగ్గిళ్లను) నైవేద్యంగా తీసుకెళ్తారు. దీన్నే ‘వాంసిడో ’ అంటారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద పూజలు పూర్తయిన తర్వాత లాప్సి (పాయసం), గుగ్గిళ్లు (వాంసిడో), ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు రూపాయి బిళ్లలను కాకోటి (ఒక వెడల్పాటి చెక్క పాత్ర)లో ఉంచి తండా యువతులు తలపై మోసుకుని సీత్లా పూజ ప్రదేశానికి తీసుకెళ్తారు.
  • సంప్రదాయం ప్రకారం భవానీల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు.
  • ఆనాదిగా వస్తున్న జంతుబలి (గొర్రెపోతు) ఇచ్చి ఓ పేగును భవానీల ప్రతిమల నుంచి లుంకడ్యా ప్రతిమ వ రకు పరుస్తారు.
  • తండా పశువులన్నింటి పరిచిన పేగు పైనుంచి దాటిస్తుండగా.. పూజారి వాంసిడో మిశ్రమాన్ని అన్ని పశువులపై చల్లుతారు. అందుకే ఈ పండుగను‘గొడ్లు దాటుడు పండుగగా’ పిలుస్తారు.
  • ఈ క్రమంలో గిరిజన మహిళలు ఆటపాటలతో నృత్యాలు చేస్తారు.
  • బలిచ్చిన మాంసంతో సలోయి వండి తండావా సులంతా అమ్మవార్లకు సమర్పించుకుంటారు.

సీత్లాపండుగ నేపథ్యం..
పూర్వం నాటి నుంచి గిరిజనులు పశుసంపదను అధికంగా కలిగి ఉండి వ్యవసాయమే జీవన ఆధారంగా వ్యవసాయ క్షేత్రాల్లోనే గుడిసెలు వేసుకుని జీవించేవారు. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పులు, పచ్చని గడ్డితో గొర్రెలు, మేకలు, ఆవులకు వివిధ రోగాలు వస్తుండేవి. రోగాల బారిన పడి తమ పశుసంపద మొత్తం రోజురోజుకూ తగ్గిపోయి తండావాసులు తల్లాడిల్లుతున్న క్రమంలో.. ఓ రోజు రాత్రి తండాపెద్దకు గిరిజన దేవతలు మేరామ, తోళ్జా, మాత్రాల్, కంకాళి, హీంగ్లా, ద్వాళాంగర్, సీత్లా దేవతలు కలలో కనిపిస్తారు. సీత్లాదేవత తండాపెద్దతో మాట్లాడి తండావాసులంతా కలిసి తనకు జంతుబలి ఇవ్వాలని చెబుతుంది. కలలో వచ్చిన దేవతల విషయాన్ని తండావాసులకు చెప్పి జంతుబలి ఇస్తారు. నాటినుంచి నేటి వరకు తమ పశుసంపదను కాపాడుకునేందుకు, వర్షాలు కురవాలని ఏటా పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికితోడుగా మరో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.

లుంకడ్యా నేపథ్యం..
ఓరోజు సీత్లాభవాని తన ఆరుగురి అక్కలతో కలిసి నదిలో స్నానం చేస్తుండగా లుంకడ్యా అనే వ్యక్తి వారి వస్త్రాలు తీసుకుని చెట్టు ఎక్కాడని.. విషయం తెలుసుకున్న సీత్లాభవాని మంత్రశక్తితో అతన్ని చెట్టు నుంచి దింపి ఇకపై ఏడుగురు అక్కాచెల్లెళ్లకు కాపలా కాసేలా శపించినట్లు చెప్పుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement