వరంగల్: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సగటున కోటి మంది భక్తులు వస్తారు. జాతర సందర్భంగా వందల ఎకరాల్లో ఎటు చూసినా భక్తులే కనిపిస్తారు. జాతర జరిగే ఏడాది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఇంతటి ప్రాశస్థ్యం ఉన్న ఆలయానికి ఉన్న భూమి కేవలం ఒక ఎకరం మాత్రమే. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. అయినా.. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించడం లేదు.
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఇక్కడ 155 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలో 155 ఎకరాల ప్రభుత్వ భూముల్లో, దీని చుట్టూ ఉండే అటవీ శాఖకు చెందిన వందల ఎకరాల్లో భక్తులు బస చేస్తారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నా వన దేవతలకు ప్రత్యేకంగా భూమి కేటాయించే దిశగా ఏ ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదు.
శాశ్వత భూమిలేదు
జాతర జరిగే సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాత్రమే వన దేవతల ఆలయం పేరిట దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాంకేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. మేడారం జాతర జరిగే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ భూములను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. శాశ్వతంగా మాత్రం వన దేవతలకు భూములను కేటాయించలేదు. తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న ప్రస్తుత జాతర మొదలయ్యే వరకైనా వన దేవతలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తుందనే ఆశాభావంతో ఆదివాసీలున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో వన దేవతల ఆలయానికి ప్రభుత్వ భూములను బదలాయించేందుకు ప్రయత్నించాలని వారు కోరుతున్నారు.