మంత్రి డప్పు వాయిద్యానికి చిందులేస్తున్న కలెక్టర్ ప్రమోద్ కుమార్ బెహరా
రాయగడ: ఆదివాసీ సంస్కృతి, కళ, పండుగలు, భాష, పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివాసీ పండగల్లో ఒకటైన రాయగడ జిల్లా చొయితి మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. చొయితి మహోత్సవంలో ఆదివాసీ కళ, సంస్కృతులకు వేదికను కల్పిస్తూ మారుమూల గ్రామీణ కళాకారులను ప్రోత్సహిస్తూ జిల్లా, రాష్ట్ర అంతర్ రాష్ట్ర స్థాయి కళాకారులకు కూడా అవకాశం కల్పిస్తున్న చొయితి మహోత్సవం ఏటా డిసెంబరు 26వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరుపుకోవడం అనవాయితీ. ఈ సంవత్సరం 30వ తేదీన చొయితి ఆఖరి రోజు కావడంతోచొయితి మహోత్సవ కమిటీ సభ్యులు ఆడంబరంగా ముగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసీ మంత్రి జగన్నాథసారక, డీఆర్‌డీఏ పీడీ అమృతరుతురాజులు ఆదివాసీ సంప్రదాయ వాయిద్యం అయిన డప్పును చొయితి వేదికపై వాయించగా కలెక్టర్ ప్రమోద్‌కుమార్ బెహరా, రాయగడ ఎంఎల్‌ఏ మకరందముదులి సహా ఇతర అతిథులు, ఆదివాసీ మహిళలు లయబద్ధంగా వేదికపై నృత్యం చేసి వేలాది మంది ప్రజల మదిలో సంతోషం నింపారు.
ముగింపు ఉత్సవానికి అతిథులుగా హాజరైన గుణుపురం ఎంఎల్‌ఏ రఘునాథ్ గొమాంగో, రాష్ట్ర బిజూ స్వాస్థ్య కల్యాణ్ యోజన అడ్వయిజర్ సుధీర్‌దాస్‌లు మాట్లాడుతూ భూమండలం పుట్టిన తరువాత మొదటి జన్మించిన జాతి ఆదివాసీ జాతి అని, వారి కళ సంస్కృతులు, ఆచారాలు నేటి వరకు జీవించి ఉన్నాయని, నేడు ఆధునిక విజ్ఞానం, ఆధునిక వైద్యం, వారి కళల నుండి జన్మించినవేనన్నారు. నేటికీ ఆదివాసీలు స్వయంగా పండించే ఆహారధాన్యాలు తినడం, సొంతంగా నేసుకునే వస్త్రాలు ధరించడం, అటవీ వనమూలికలతో ఔషధాలను స్వయంగా తయారు చేసుకోవడం వారి సంస్కృతి అని, ఆదివాసీ సంస్కృతితో ఏ ఒక్క సంస్కృతి కూడా పోటీ పడలేదని, నేటికీ ఈ సంస్కృతులు జీవించి ఉండగా వాటిని ప్రపంచవేదికపైకి తీసుకురావడమే చొయితి మహోత్సవం లక్ష్యమని వివరించారు.
రూ. 6 కోట్లకు పైగా వ్యాపారం
చొయితి మహోత్సవం సందర్భంగా జీసీడీ గ్రౌండ్‌లో 308 దుకాణాలు ఏర్పాటు చేయగా ఐదు రోజుల్లో రూ.6 కోట్ల 60 లక్షల వ్యాపారం జరిగినట్లు సమాచారం. మహోత్సవం ఆఖరిరోజున ఒడిస్సీ డ్యాన్స్, చౌ డ్యాన్స్, బెంగాలీ బిహు డ్యాన్స్, థింసా, మణిపురి, ఒరే ఒ బేటి తు లే ఉడాన్, నృత్యకళ పరిషత్ వారి నృత్యం, ఓం నమశ్శివాయ నృత్యం, ఆదివాసీ నృత్యాలు, దులాహభీహ రాజస్థాన్ గుమ్మర, లోహరి, ప్యూజన్, సంబల్‌పురి నృత్యాలతో సహా చొయితి సీడీలను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారులను అతిథులు సన్మానించారు. ఐదు రోజుల పాటు జిల్లా పోలీసు యంత్రాంగం 380 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఆసాంఘిక చర్యలు జరగలేదదని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. విభిన్న ప్రభుత్వ పథకాలపై ప్రజలకు చైతన్యం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం విభిన్న శాఖల అభివృద్ధి పథకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment