వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చిన తరువాత చాలా ప్రాంతాల మధ్య దూరం తగ్గిపోయింది. కానీ టికెట్ ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడంతో కొంతమంది దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఇలా వందేభారత్‌కు దూరంగా ఉన్న గ్రామానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చి అబ్బుర పరుస్తోంది పూర్ణిమా ముర్ము. అవును మీరు కరెక్ట్‌గానే చదివారు. మారుమూల గ్రామానికి వందే భారత్‌ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది పూర్ణిమ.
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు పక్కనే ఉన్న ఓ గ్రామం పేరు జొండరాగోడ. ఈ గ్రామానికి చెందిన విద్యార్థే పూర్ణిమా ముర్ము. గిరిజనులు ఎక్కువ ఉండే ఈప్రాంతంలో దీపావళి సమయంలోనే సోహ్రాయ్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. దీపావళి రెండో రోజున జరుపుకునే ఈ పండక్కి గిరిజనులంతా... తమ మట్టి ఇళ్లను శుభ్రం చేసి, రకరకాల సాంప్రదాయ డిజైన్లతో పెయింట్ వేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూర్ణిమ తన ఇంటిని వందే భారత్ చిత్రంతో నింపేసింది.
మట్టింటికి ముచ్చటగా..
గ్రామంలో ఎంతో సంతోషంగా ఆర్భాటంగా జరుపుకునే పండగను మరింత బాగా జరుపుకోవాలన్న ఉద్ధేశ్యంతో హైస్పీడ్ ట్రైన్‌తో ఇంటిని అలంకరించాలనుకుంది పూర్ణిమ. గ్రామవాసులు సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసే రంగుల నుంచి.. తెలుపు, నీలం, నల్లరంగులు తీసుకుని ఇంటి గోడపైన వందేభారత్ రైలు బొమ్మను చక్కగా చిత్రించింది. రైలు బొమ్మ ఆకర్షణీయంగా ఉండడంతో గ్రామస్థులు పూర్ణిమ ఇంటిని చూసేందుకు ఎగబడుతున్నారు.
‘‘గ్రామంలోని చాలామందికి ‘వందేభారత్ రైలు’ ఎలా ఉంటుందో తెలియదు. దీని గురించి వినడమేగాని చూసింది లేదు. అందుకే అందరికీ వందేభారత్‌ను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో రైలు బొమ్మను చిత్రించాను. నిజానికి నేను కూడా ఇప్పటిదాకా వందేభారత్ చూసింది లేదు. ఫోన్‌లో వందేభారత్ బొమ్మను చూసి గీశాను. అచ్చం వందేభారత్‌ను పోలి ఉండడంతో నా పెయింటింగ్ గురించి తెలిసిన వారంతా చూడడానికి వస్తున్నారు. రైలు పెయింటింగ్ వేసిన తరువాత ఇంట్లో ఉన్నట్టుగా గాక, ట్రైన్‌లో ఉన్నట్టు ఉంది’’ అని సంతోషంగా చెబుతోంది పూర్ణిమ.
వేడుకల్లో వందేభారత్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పెయింటింగ్‌ను చూసిన గ్రామస్థులంతా.. ‘‘మేమయితే ఇంతవరకు ఈ రైలు ఎక్కలేదు. కనీసం ఇలాగైనా చూడగలుగుతున్నాం. వందే భారత్‌ను పూర్ణిమ చక్కగా వేసింది’’ అని మెచ్చుకుంటున్నారు. పిల్లలైతే కొత్త రైలు తమ ఊరు వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment