పైడిపనుకులలో గంగాలమ్మ
కొయ్యూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): వర్షంతో తడిపి భూములను సస్యశ్యామలం చేయాలని గిరిజనులు ఏటా ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు గంగాలమ్మ తల్లి పండగను నిర్వహిస్తారు. దాదాపుగా 300 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. నాడు అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి వచ్చిన ఆంగ్లేయులు కూడా ఈ పండగను చూశారు. పంటలు పండాలంటే నీరు కావాలి. అందుకే గంగమ్మను పూజిస్తే.. తల్లి వర్షాన్ని కురిపించి పంటలను పండిస్తుందని ఇక్కడి గిరిజనుల నమ్మకం. ఇక్కడి భూములు చాలా వరకు వర్షాధారం కావడంతో వర్షం తప్పనిసరి. ఒకప్పుడు నెల రోజుల పాటు పండగ చేస్తే.. ఇప్పుడు వారానికే పరిమితమైంది.
గిరిజన గ్రామాల్లో విత్తనాలు చల్లికతో ప్రతీ చోట పండగ ప్రారంభిస్తారు. కొన్ని రకాల పప్పులు, వరి విత్తనాలను గంగాలమ్మ తల్లి పేరు చెప్పి పొలంలో చల్లుతారు. ఆ విత్తనాల్లో కొన్నైనా మహిళల చీరకొంగులో పడే విధంగా చూస్తారు. అలా పడిన విత్తనాలను దాస్తారు. తర్వాత వారు వేసే విత్తనాల్లో వీటిని కలిపివేస్తారు. ఇలా వేస్తే తల్లి ఆశీస్సులతో పంటలు బాగా పండుతాయని భావిస్తారు. గ్రామాన్ని క్షేమంగా చూడాలని చిన్న ఈరేడును తయారు చేసి దానిలో బుట్టను ఉంచుతారు. చిన్న కోడిపిల్లను బలి ఇచ్చి గ్రామంలో రెండు వైపులా పొలిమేర వరకు తీసుకువచ్చి వదిలిపెడతారు. దీనిని జడిగా పిలుస్తారు.
వారం రోజులే తల్లి ఊరేగింపు
ప్రతి రోజూ సాయంత్రం సమయంలో తల్లిని ఊరేగింపుగా అన్ని గృహాల వద్దకు తీసుకెళ్తారు. కుండపై దీపం పెట్టి గంధం, పాల ఆకుల పూలు పెడతారు. ఇలా ఊరేగించిన తర్వాత అసలు పండగ చేపడతారు. ఈ సందర్బంగా గ్రామాల్లో ఊయలను ఏర్పాటు చేస్తారు. ఇందులో పెద్దల నుంచి పిల్లల వరకు అంతా సంతోషంగా ఊగుతారు. గతంలో తల్లి ఊరేగింపును దాదాపుగా నెల రోజుల పాటు చేసేవారు. ఇప్పుడు వారం రోజులకే పరిమితమైంది.
కోలాటం.. గంగాచెల్లు..
తల్లికి మేకలను బలి ఇస్తారు. అనేకచోట్ల మంగళవారం రాత్రి అంతా కోలాటం, గంగా చెల్లు పాటలతో జాగారం చేస్తారు. బుధవారం ఉదయాన్నే మేకలను బలి ఇస్తారు. గతంలో కోలాటం, గంగాచెల్లు ఆటలను రాత్రి నుంచి తెల్లవారే వరకు పాడే వారు. ఇప్పుడు ఆ గంగా చెల్లును చాలా చోట్ల మానేశారు. కొంత సేపు కోలాటం ఆడుతున్నారు.
బాసికాలు వసూలు
మరోవైపు మేకపోతులను వేసిన తర్వాత నుంచి మహిళలు రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టి బాసికాల పేరిట డబ్బులు వసూలు చేస్తారు. వాహనచోదకులకు పసుపు నీటిని రాస్తారు. పురుషులు కోలాటం చేస్తూ ఇంటింటికీ తిరిగి డబ్బులు వసూలు చేస్తారు. గతంలోలా కాకపోయినా.. ప్రతి గ్రామంలో ఈ పండగ నిర్వహిస్తున్నారు.
తగ్గిన గొర వేషం, వేటలు
మేకలను బలి ఇచ్చిన తర్వాత గ్రామంలో పెద్దలు సంప్రదాయ ఆయుధాలతో వేటకు వెళ్తారు. వేటకు వెళ్లే ముందు పూజలు నిర్వహించి పనసకాయకు బాణాలు వేస్తారు. మరికొన్ని చోట్ల అయితే పంది పిల్లకు బాణాలు వేస్తారు. గతంలో అడవి విస్తరించి ఉండడంతో పాటు వేటాడే నిపుణులు ఉండేవారు. దీంతో వేటకు వెళ్తే ఏదో ఒక జంతువును తెచ్చేవారు. ఇప్పుడు వేటలను చాలా వరకు తగ్గించారు. ఇలా వేటకు వెళ్లే ప్రతి రోజూ రాత్రి సమయంలో గొర వేషాన్ని నిర్వహిస్తారు. జంతువు వేషధారణతో ఒకరిని తయారు చేస్తారు. అతన్ని వేటాడుతున్నట్టుగా బాణాలు వేస్తారు. చుట్టూ జనాలు ఉండి ఆటలాడుతారు. ఈ సందర్భంగా అతని తోకకు పేడ లేదా పసుపు నీరు పూస్తారు. ఇంటింటికీ తిరిగి తోకకు రాసిన పేడ లేదా పసుపు నీరును అందరికీ అంటిస్తారు. ఇదంతా సరదా సాగుతుంది.
చిన్నతనంలో బాగుండేది
మా చిన్నతనంలో పండగ చాలా బాగుండేది. నెల రోజులకు పైగా జరిగేది. ఇప్పుడు పండగ చేసే రోజులు తగ్గిపోయాయి. అప్పటి మాదిరిగా మహిళలు ఇప్పుడు గంగాచెల్లు ఆడేందుకు రావడం లేదు. పండగ సంప్రదాయ ప్రకారం చేస్తున్నారు.
– కె.గంగరాజు, రాజేంద్రపాలెం
అన్నిచోట్ల నిర్వహణ
మన్యంలో వందల ఏళ్ల నుంచి ఈ పండగ కొనసాగుతోంది. నేడు అనేక చోట్ల బాగానే జరుగుతోంది. అయితే పండగ జరిగే రోజుల సంఖ్య తగ్గిపోయింది. వేటలను చాలా వరకు తగ్గించారు. నాడు కోలాటం, గంగా చెల్లు ఆటలు జరిగితే.. నేడు దానికి భిన్నంగా ఆధునిక పద్ధతిలో పండగ నిర్వహిస్తున్నారు.
– డి.వి.డి.ప్రసాద్, ధర్మ జాగరణ సమితి గిరిజన పరియోజన ప్రముఖ్
Comments
Please login to add a commentAdd a comment