nagoba jathara
-
నాగోబా వైభవం: ఆడపడుచులు... కొత్తకోడళ్లు
నాగోబా అంటే మహిళామణుల మహా జాతర దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర ‘నాగోబా’ మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జాతర మొదలైంది. ‘ఈరోజు కోసమే’ అన్నట్లుగా సంవత్సరమంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు, కెస్లాపూర్ పరిసరాలు పండగ కళతో వెలిగిపోతున్నాయి. ఈ జాతరలో మహిళలది ప్రేక్షక పాత్ర కాదు. అడుగడుగునా ప్రధాన పాత్ర...నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల్లోని ఆదివాసీ మెస్రం వంశీయులకు సర్ప దేవుడు ఆరాధ్య దైవం. భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో ఆ దేవుడికి మహాపూజలు అందించడం ద్వారా ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాపూజకు ముందు, వెనకాల జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రతువులో వీరిద్దరి భాగస్వామ్యం మనకు కనిపిస్తుంది.ఆడపడుచులకు ప్రాధాన్యతమెస్రం వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మహాపూజకు ముందు కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందు ఉంటారు. ముందుగా పురుషులు అందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. మహిళలు బిందెల్లో నీళ్లు, గుళ్లల్లో ఆవుపేడను తీసుకొస్తారు. ఆలయ ప్రవేశం తర్వాత అందరు కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు. ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు, తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు. అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగిస్తారు. ఆపై ఆడపడుచులు పుట్టమట్టి, ఆవుపేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు.కొత్త కోడళ్లు వస్తారునాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ఈ కత్రువులో ఆవిష్కృతం అవుతుంది. ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.ఎప్పుడు వచ్చినా కొత్తగానే..‘కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తాం. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. కొత్త కోడళ్లు దేవుడి దర్శనం ద్వారా మా సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటారనేదే ఈ కార్యంప్రాధాన్యత’ అంటున్నాడు ఉట్నూర్‌కు చెందిన మెస్రం మనోహర్.‘నాగోబా జాతరకు ఎన్నోసార్లు వచ్చాను. విశేషం ఏమిటంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విశేషం తెలుసుకుంటూనే ఉంటాను. నాగోబా జాతర అంటే మహిళలకుప్రాధాన్యత ఇచ్చే మహా జాతర’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన గిరిజ.‘నాగోబా’ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. తరగని మౌఖిక కథలు ఉన్నాయి. అన్నింట్లో మహిళ మహారాణిగా, మíßమాన్వితంగా వెలిగిపోతూనే ఉంటుంది. అదే ఈ మహ జాతర ప్రత్యేకత. పవిత్రత. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి. -
ఘనంగా నాగోబా జాతర
-
నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించే నాగోబా మహా పూజకు గంగాజలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం బయల్దేరి వెళ్లారు. ఏడు రోజులపాటు మెస్రం వంశీయులున్న గ్రామాల్లో నాగోబా మహాపూజ, గంగాజలం సేకరణపై ప్రచారం నిర్వహించి కేస్లాపూర్ చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు అదివారం కేస్లాపూర్ గ్రామానికి చేరి నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ ఆధ్వర్యంలో సమావేశమై గంగాజలం పాదయాత్ర, నాగోబా మహాపూజ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఝరి (కలశం) దేవతకు మెస్రం వంశీయులు, మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం గంగాజలం సేకరణ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు బుందో పట్టగా... మెస్రం వంశీయులు కానుకలు వేసి ముందుకు సాగారు. -
నాగోబా మహాపూజ; చెట్టెక్కిన మెస్రం అల్లుడు
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా మహాపూజ సందడి మొదలైంది. మహాపూజ కోసం మెస్రం వంశీయులు కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తినమడుగు నుంచి పవిత్ర గంగాజలం సేకరించి తిరిగి వచ్చారు. ముందుగా ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పవిత్ర జలాన్ని కిందపెట్టకుండా మర్రి చెట్టుపై ఉంచి పూజలు చేశారు. అనంతరం నాగోబా ఆలయానికి పవిత్ర జలాన్ని ఆదివారం సాయంత్రం తీసుకెళ్లాల్సి ఉండటంతో, వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశీయుల అల్లుడు మర్రి చెట్టు ఎక్కి పవిత్ర జలాన్ని కటోడా (పూజారి)కి అందజేశారు. 11న మహాపూజ మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలు చేసి ఈనెల 11న పుష్యమాసం అమావాస్యనుపురస్కరించుకుని గోదావరి నది హస్తీన మడుగు నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన గంగా జలంతో నాగోబా ఆలయాన్ని శుద్దిచేసి మహాపూజలతో నాగోబా జాతరను ప్రారంభించనున్నట్టు మెస్రం వంశం పెద్దలు తెలిపారు. చదవండి: ఆ ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఎందుకంటే! ఉల్లి: ఒక్క ఎకరాలోనూ పంట వేయని రైతులు -
సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల్లో మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి కళ్లకుకట్టేలా నాగోబా ఆలయం రూపు దిద్దుకుంటోంది. నాగదేవత పడగ ఆకారంలో గర్భగుడి ద్వారం, ఆలయ మండపంలో మెస్రం చరిత్రను తెలిపేలా రూపొందిన శిల్పాలు దర్శనమిస్తాయి. ఒకప్పటి గోండ్వాన రాజ్యం చిహ్నాలు కూడా కనిపించేలా నిర్మాణం చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆలయ రాతికట్టడం పునర్నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. రానున్న పుష్యమాసంలో నాగోబా జాతర నిర్వహిస్తారు. ఈసారి కరోనా నేపథ్యంలో జాతరను సంప్రదాయ పూజలకే పరిమితం చేయనున్నారు. చదవండి: ఇళ్ల నిర్మాణాలకు పక్కా ప్రణాళిక నాగోబా ఆలయ ఆవరణలో కొనసాగుతున్న మండప నిర్మాణం, భావితరాలకు చరిత్ర తెలిసేలా: మెస్రం వంశీయుల ఇంటి దేవుడు నాగోబా. పూర్వం ఈ ప్రాంతం గోండ్వాన రాజ్యంలో ఉండేది. అప్పుడు ఒక గుడిసె కింద నాగోబా పూజలు అందుకున్నట్లు మెస్రం వంశీయులు చెబుతుంటారు. 2005లో రూ. 10 లక్షలతో నాగోబా ఆలయాన్ని విస్తరించారు. నాగోబా చరి త్రను భావితరాలకందించేలా ఆలయ నిర్మాణం ఉండాలని యోచించిన మెస్రం వంశీయులు 2017 జూన్‌లో రూ.3 కోట్లతో పనులు ప్రారంభిం చారు. ప్రస్తుతం రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. పైకప్పు పనులు జరగాల్సి ఉంది. గర్భగుడులకు మెస్రం వంశీయులే విరాళాలు ఇస్తుండగా, మండప నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్ష లు అందించనుంది. ఏపీ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి తలారి రమేశ్.. ఈ శిల్పాలు చెక్కుతున్నారు. ఫిబ్రవరిలో గోదావరి నుంచి గంగాజలాన్ని కేస్లాపూర్‌కు తీసుకురావడంతో పూజలు ప్రారంభమవుతాయి. -
అట్టహాసంగా గిరిజన దర్భార్
సాక్షి, ఆదిలాబాద్ : గిరిజన దర్బార్ అట్టహాసంగా జరిగింది. వేలాదిమంది ఆదివాసీలు తరలివచ్చారు. దీంతో నాగోబా జాతర ప్రాంగణం కళకళలాడింది. జాతర సందర్భంగా ప్రతియేటా నిర్వహించే దర్బార్‌కు ఆదివాసీలు ప్రాముఖ్యతనిస్తారు. సమస్యల పరిష్కారంతో పాటు తమ అర్జీకి న్యాయం జరుగుతుందన్న ఆశాభావం ప్రతిఒక్కరిలో కనిపిస్తుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, శాప్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య తదితరులు దర్బార్‌కు తరలివచ్చారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజనులు గిరిజన దర్బార్‌లో సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులు అర్జీలను స్వీకరించారు. వంద శాతం అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. దర్బార్ సందర్భంగా గిరిజన సంస్కాృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. గిరిజన సంప్రదాయాలు కళ్లకు కట్టేలా ప్రదర్శనలు చేపట్టారు. అంతకుముందు కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గోపి, ట్రైనీ ఐఏఎస్ అధికారి ప్రతీక్‌జైన్, ఐటీడీఏ మాజీ చైర్మన్ లక్కేరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఆర్వో నటరాజన్, డీపీఓ సాయిబాబా, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ట్రాన్స్‌కో ఎస్ఈ ఉత్తం జాడే, ఉట్నూర్ ఏఎస్పీ శబరీ ష్, మెస్రం వంశం పటేల్ వెంకట్రావు, ఎంపీటీïసీ భీంరావు, సర్పంచ్ రేణుక, ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత, తదితరులు పాల్గొన్నారు. పోడు భూములకు పరిష్కారం పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం. పోడు భూముల జోలికి అటవీ శాఖాధికారులు రాకుండా చూస్తాం. నాగోబా ఆలయ నిర్మాణానికి కావాలి్సన నిధులు ఇస్తాం. ఇప్పటికే రూ.50లక్షల నిధులను మంజూరు చేశాం. మరో రూ.50లక్షలు అందిస్తాం. రాజగోపురాలు, గ్రైనేట్, అర్చీల నిర్మాణాలకు రూ.5కోట్ల నిధులు కేటాయించాం. టెండర్‌దారులు ఎవరు ముందుకు రావడం లేదు. ఆలయ కమిటీ టెండర్లో పాల్గొని నిర్మాణం చేపట్టాలి. వెయ్యేళ్లపాటు ఆలయం చెక్కుచెదరకుండా ఉండేలా పనులు జరుగుతున్నాయి. అడవుల రక్షణకు విరివిగా మొక్కలు నాటాలి. ప్రతి గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ లైన్ వేసేలా చర్యలు చేపడతాం. ఐటీసీ ద్వారా 1159 మందికి శిక్షణ కల్పించాం. ఇందులో 24 మంది కానిస్టేబుళ్లు, 16 మంది ఆర్మీ సెలక్షన్‌కు ఎంపికయ్యారు. ఉపాధి అవకాశాల కోసం శిక్షణ కల్పిస్తున్నాం. 150 మంది విద్యార్థులను నర్సింగ్ శిక్షణ కోసం పంపిస్తే ప్రస్తుతం 62 మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. మిగితా వారు తిరిగి వచ్చారు. సొంత స్థలముంటే డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం త్వరలో చేపడతాం. నియోజకవర్గానికి 1400 ఇళ్లు మంజూరయ్యాయి. ఏజెన్సీలో రక్తహీనతతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. రక్తహీనత కారణాలను తెలుసుకోవడానికి హైదరాబాద్ నుంచి వైద్యులను పిలిపించి సర్వే చేయిస్తాం. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఇబ్బంది పెడితే.. తిరగబడతాం ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తే తిరగబడతాం. అడవిలోకి పశువులను పోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోడు వ్యవసాయం చేసేవారిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రానికి నోటీసులు పంపించింది. ప్రభుత్వం సమాధానం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆదివాసీలు విద్యతోనే రాణించే అవకాశముంది. తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపించాలి. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. – సోయం బాపురావు, ఎంపీ పిల్లల్ని బాగా చదివించాలి ఆదివాసీలు పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులను చేయాలి. పదో తరగతి ఫలితా ల్లో గిరిజనులు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడా ది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. నాలుగు జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయి. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం. అన్ని గ్రామాలకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. గిరి వికాసం పథకం కింద రూ.50కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకానికి 4వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. – కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ వెళ్లేందుకు బాధగా ఉంటుంది జిల్లా కలెక్టర్‌గా ఆదిలాబాద్‌కు బదిలీపై వస్తున్నప్పుడు బాధపడుతూ వచ్చా. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలను చూసి ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లాలనే ఆలోచన సైతం బాధ కలిగిస్తోంది. ఇక్కడకు బదిలీ అయినప్పుడు చెన్నైలో పంటినొప్పితో బాధపడుతున్నా. చీఫ్ సెక్రెటరీ బదిలీ అయ్యిందని సమాచారం అందించగా.. నాకు మినహాయింపు ఇవ్వాలని కోరిన. అప్పటి పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా విధుల్లో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఇతర జిల్లాకు వెళ్లాలంటే బాధగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా సంస్కృతి చాలా గొప్పది. అడవిలో ఎవరైన చెట్లు నరికితే గిరిజనులు పోలీ సులకు సమాచారం అందించాలి. హక్కులు, ఆశయాలు సాధించుకోవాలి. – దివ్యదేవరాజన్, ఆదిలాబాద్ కలెక్టర్ నాగోబాకు వందేళ్ల చరిత్ర కేస్లాపూర్‌లోని నాగోబా జాతరకు వందేళ్ల చరిత్ర ఉంది. ఆదివాసీలకు అడవి అంటే ఎంతో నమ్మకం. పూజ, ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయి. ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో ఇతరులు ప్రవేశించవద్దు. కేస్లాపూర్లో జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఫిబ్రవరి 5న జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరుకావాలి. –సీతక్క, ములుగు ఎమ్మెల్యే -
గంగాజలం కోసం పయనం
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజలకు కావాల్సిన గంగాజలం కోసం మెస్రం వంశీయులు శనివారం బయల్దేరారు. ముందుగా కేస్లాపూర్‌లోని దేవస్థానం ఉన్న ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు సమావేశమై గంగాజలం కోసం వెళ్లే రూట్‌ను ఎంపికచేశారు. అనంతరం కాలినడకన గంగాజలం కోసం బయల్దేరారు. శనివారం రాత్రి పిట్టబొంగరంలో బస చేయనున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. ఆదివారం తండ్రా, ఈ నెల 13న జామ్‌గామ్, 14న గౌరి, 15న గుమ్నూర్, 16న మొర్రిగూడ, 17న జన్నారం మండలం గోదావరి అస్తల మడుగు వద్దకు చేరుకుంటామని చెప్పారు. అక్కడ పూజలు నిర్వహించి గంగాజలం సేకరిస్తామన్నారు. తిరుగుపయనంలో 19న గౌరి, 26న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తామని తెలిపారు. అదేరోజు సాయంత్రం కేస్లాపూర్లో ఉన్న వడమర(మర్రి చెట్టు)వద్దకు చేరుకుంటామని చెప్పారు. ఆ చెట్టు వద్ద మూడు రోజులపాటు బస చేశాక 30న ఆలయం సమీపంలోని గోవడ్‌కు చేరుకుంటామని, అదేరోజు రాత్రి నాగోబా ఆలయంలో మహా పూజలు చేసి జాతర ప్రారంభిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3న ప్రజాదర్బర్ నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు మెస్రం వెంకట్రావు, మెస్రం కోసు కటోడ, మెస్రం శేఖు, మెస్రం హనుమంత్‌రావ్, మెస్రం తుక్డోజీ, మెస్రం వంశం ఉద్యోగుల సంఘం సభ్యులు మెస్రం మనోహర్, మెస్రం దేవ్‌రావ్, మెస్రం జంగులు పాల్గొన్నారు. ఓఎస్డీ పూజలు.. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో శనివారం కరింనగర్ రేంజ్ ఓఎస్డీ పనసారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వెంట తెచ్చిన జాగిలాలతో నాగోబాకు మొక్కించారు. ఆలయ చరిత్రను మెస్రం వంశీయులకు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీసీ పెద్దయ్య, ఇంద్రవెల్లి ఎస్సై హనోక్ ఉన్నారు.