అట్టహాసంగా గిరిజన దర్భార్‌ | Ostentatiously Nagoba Jatara In Adilabad | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా గిరిజన దర్భార్‌

Published Thu, Jan 30 2020 8:26 AM | Last Updated on Thu, Jan 30 2020 8:26 AM

Ostentatiously Nagoba Jatara In Adilabad  - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : గిరిజన దర్బార్‌ అట్టహాసంగా జరిగింది. వేలాదిమంది ఆదివాసీలు తరలివచ్చారు. దీంతో నాగోబా జాతర ప్రాంగణం కళకళలాడింది. జాతర సందర్భంగా ప్రతియేటా నిర్వహించే దర్బార్‌కు ఆదివాసీలు ప్రాముఖ్యతనిస్తారు. సమస్యల పరిష్కారంతో పాటు తమ అర్జీకి న్యాయం జరుగుతుందన్న ఆశాభావం ప్రతిఒక్కరిలో కనిపిస్తుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, శాప్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య తదితరులు దర్బార్‌కు తరలివచ్చారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజనులు గిరిజన దర్బార్‌లో సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులు అర్జీలను స్వీకరించారు.

వంద శాతం అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. దర్బార్‌ సందర్భంగా గిరిజన సంస్కాృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. గిరిజన సంప్రదాయాలు కళ్లకు కట్టేలా ప్రదర్శనలు చేపట్టారు. అంతకుముందు కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ గోపి, ట్రైనీ ఐఏఎస్‌ అధికారి ప్రతీక్‌జైన్, ఐటీడీఏ మాజీ చైర్మన్‌ లక్కేరావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ డీఆర్వో నటరాజన్, డీపీఓ సాయిబాబా, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తం జాడే, ఉట్నూర్‌ ఏఎస్పీ శబరీ ష్, మెస్రం వంశం పటేల్‌ వెంకట్‌రావు, ఎంపీటీïసీ భీంరావు, సర్పంచ్‌ రేణుక, ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.

పోడు భూములకు పరిష్కారం
పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం. పోడు భూముల జోలికి అటవీ శాఖాధికారులు రాకుండా చూస్తాం. నాగోబా ఆలయ నిర్మాణానికి కావాలి్సన నిధులు ఇస్తాం. ఇప్పటికే రూ.50లక్షల నిధులను మంజూరు చేశాం. మరో రూ.50లక్షలు అందిస్తాం. రాజగోపురాలు, గ్రైనేట్, అర్చీల నిర్మాణాలకు రూ.5కోట్ల నిధులు కేటాయించాం. టెండర్‌దారులు ఎవరు ముందుకు రావడం లేదు. ఆలయ కమిటీ టెండర్‌లో పాల్గొని నిర్మాణం చేపట్టాలి. వెయ్యేళ్లపాటు ఆలయం చెక్కుచెదరకుండా ఉండేలా పనులు జరుగుతున్నాయి. అడవుల రక్షణకు విరివిగా మొక్కలు నాటాలి. ప్రతి గ్రామానికి త్రీఫేస్‌ విద్యుత్‌ లైన్‌ వేసేలా చర్యలు చేపడతాం. ఐటీసీ ద్వారా 1159 మందికి శిక్షణ కల్పించాం. ఇందులో 24 మంది కానిస్టేబుళ్లు, 16 మంది ఆర్మీ సెలక్షన్‌కు ఎంపికయ్యారు. ఉపాధి అవకాశాల కోసం శిక్షణ కల్పిస్తున్నాం. 150 మంది విద్యార్థులను నర్సింగ్‌ శిక్షణ కోసం పంపిస్తే ప్రస్తుతం 62 మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు.  మిగితా వారు తిరిగి వచ్చారు. సొంత స్థలముంటే డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణం త్వరలో చేపడతాం. నియోజకవర్గానికి 1400 ఇళ్లు మంజూరయ్యాయి. ఏజెన్సీలో రక్తహీనతతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. రక్తహీనత కారణాలను తెలుసుకోవడానికి హైదరాబాద్‌ నుంచి వైద్యులను పిలిపించి సర్వే చేయిస్తాం. 
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి

ఇబ్బంది పెడితే.. తిరగబడతాం
ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తే తిరగబడతాం. అడవిలోకి పశువులను పోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోడు వ్యవసాయం చేసేవారిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రానికి నోటీసులు పంపించింది. ప్రభుత్వం సమాధానం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆదివాసీలు విద్యతోనే రాణించే అవకాశముంది. తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపించాలి. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.
– సోయం బాపురావు, ఎంపీ 

పిల్లల్ని బాగా చదివించాలి
ఆదివాసీలు పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులను చేయాలి. పదో తరగతి ఫలితా ల్లో గిరిజనులు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడా ది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. నాలుగు జూనియర్‌ కళాశాలలు మంజూరయ్యాయి. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం. అన్ని గ్రామాలకు త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. గిరి వికాసం పథకం కింద రూ.50కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకానికి 4వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.  
– కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ 

వెళ్లేందుకు బాధగా ఉంటుంది
జిల్లా కలెక్టర్‌గా ఆదిలాబాద్‌కు బదిలీపై వస్తున్నప్పుడు బాధపడుతూ వచ్చా. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలను చూసి ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లాలనే ఆలోచన సైతం బాధ కలిగిస్తోంది. ఇక్కడకు బదిలీ అయినప్పుడు చెన్నైలో పంటినొప్పితో బాధపడుతున్నా. చీఫ్‌ సెక్రెటరీ బదిలీ అయ్యిందని సమాచారం అందించగా.. నాకు మినహాయింపు ఇవ్వాలని కోరిన. అప్పటి పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా విధుల్లో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఇతర జిల్లాకు వెళ్లాలంటే బాధగా ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా సంస్కృతి చాలా గొప్పది. అడవిలో ఎవరైన చెట్లు నరికితే గిరిజనులు పోలీ సులకు సమాచారం అందించాలి. హక్కులు, ఆశయాలు సాధించుకోవాలి. –
దివ్యదేవరాజన్, ఆదిలాబాద్‌ కలెక్టర్‌

నాగోబాకు వందేళ్ల చరిత్ర
కేస్లాపూర్‌లోని నాగోబా జాతరకు వందేళ్ల చరిత్ర ఉంది. ఆదివాసీలకు అడవి అంటే ఎంతో నమ్మకం. పూజ, ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయి. ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో ఇతరులు ప్రవేశించవద్దు. కేస్లాపూర్‌లో జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఫిబ్రవరి 5న జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరుకావాలి.
–సీతక్క, ములుగు ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement