tribals events
-
Covid-19: ఇలా చేయకండని ఎన్ని సార్లు చెప్పినా.. వీళ్లు మారరా?
సాక్షి, జయపురం( భువనేశ్వర్): కోవిడ్ మహమ్మారి ప్రజలను కబళిస్తుండగా, దాని కట్టడికి ప్రభుత్వం ఆంక్షలు విధించినా కొన్ని గ్రామాల ప్రజలు వాటిని పట్టించుకోకుండా యథాతథంగా జాతరలు, సంప్రదాయ పండగలు జరుపుకుంటున్నారు. ఆయా పండగల్లో భౌతికదూరం పాటించకుండా వేలాదిమంది మూకుమ్మడిగా పాల్గొంటున్నారు. ఇటువంటి సంఘటన నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితి కర్చమాల గ్రామంలో సంభవించింది. ఆదివాసీ ప్రజలు అనాదిగా జరుపుకొనే వ్యవసాయ పండగ బలిజాతర. ఈ నేపథ్యంలో కర్చమాల గ్రామ ప్రజలు శనివారం నిర్వహించిన బలిజాతరలో కోవిడ్ నియమాలు విస్మరించి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. జాతర సందర్భంగా సంప్రదాయ నృత్య నాట్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. భౌతికదూరం పాటించక పోవడమే కాకుండా బలిజాతరలో పాల్గొన్న ఏ ఒక్కరూ మాస్క్ ధరించలేదు. వేలాదిమంది పాల్గొన్న విషయం తెలుసుకున్న కొశాగుమడ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ సందర్భంగా కరోనా నియమాలు ఉల్లంఘించి బలిజాతర నిర్వహించిన కమిటీ సభ్యుల నుంచి పోలీసులు రూ.10 వేల జరిమానా వసూలు చేశారు. అలగే నియమాలు ఉల్లంఘించిన కమిటీపై కేసు నమోదు చేశారు. చదవండి: అత్యంత చవకగా కార్బేవ్యాక్స్ -
ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు!
బుట్టాయగూడెం: బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి తల్లి ఒడిలో.. గిరి శిఖర ప్రాంతాల్లో నివసించే కొండరెడ్ల గిరిజనుల జీవనం.. వారు పాటించే సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారి వివాహ తంతు సైతం ప్రత్యేకమే. కొండరెడ్ల వివాహ సమయంలో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు. వీరి పెళ్లిళ్లకు పిలుపులు ఉండవు. పిలవలేదు కదా అని వివాహాలకు ఎవరూ హాజరు కాకుండా ఉండరు. కుటుంబ సమేతంగా అందరూ హాజరవుతారు. పెళ్లి పనుల్లో గ్రామస్తులంతా విధిగా పాల్గొంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 1.25 లక్షల మంది గిరిజనులు ఉండగా.. వీరిలో సుమారు 10 వేల మంది కొండరెడ్డి తెగకు చెందిన వారు. కొండరెడ్డి గిరిజనుల్లో అత్యధికులు బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ఎత్తైన కొండల నడుమ గిరి శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని పద్ధతులు మారినా ఆచారం ప్రకారమే.. కొండరెడ్డి గ్రామాల్లో పెళ్లి విషయంలో 1980 తరువాత కొన్ని పద్ధతులు మారినా.. పూర్వ ఆచారాలనే కొనసాగిస్తున్నారు. 1980వ సంవత్సరానికి ముందు ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే.. ఆ విషయం పెద్దలకు చెప్పేవారు. తర్వాత ఆ అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని ఆ యువతిని తాను పెళ్లాడుతున్నానని బహిరంగంగా చెప్పేవాడు. అతడిని పెళ్లాడటం ఆ యువతికి ఇష్టం లేకపోయినా ఊరి పెద్దలు వారిద్దరికీ వివాహం చేసేవారు. మొదట ఊరి పెద్దలు వరుడు, వధువు తలపై నీళ్లు పోస్తే.. ఆ తరువాత వరుడు ఆ యువతి మెడలో నల్లపూసల దండ వేసేవాడు. ఇలా పెళ్లి తంతు పూర్తయ్యేది. పెళ్లికి పెద్దలే పురోహితులు. మంత్రాలు ఉండవు. వారిద్దరూ సుఖంగా ఎలా కాపురం చేసుకోవాలో నాలుగు మాటలు చెప్పటం ద్వారా తంతు ముగిసేది. ఇటీవల ఈ పద్ధతుల్లో కొంత మార్పు వచ్చింది. ఏ యువకుడైనా యువతిని ఇష్టపడితే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. వారు, ఊరి పెద్దలు కలిసి యువతి, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధం ఖాయం చేస్తారు. ఈ మధ్య కాలంలో తాళి కట్టే సంప్రదాయం కూడా మొదలైంది. పతాణాలు తప్పనిసరి పెళ్లి అనంతరం వధూవరులకు పతాణాల కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు వైపు వారు వధువును గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచేస్తారు. వరుడు, అతని తరఫు వారు వధువును వెతికి పట్టుకోవాలి. ఆ తరువాత వధూవరులు ఇంటికి వచ్చే సమయంలో గ్రామస్తులంతా వారిద్దరి కాళ్లకు అడ్డుపడుతూ బురదలో దొర్లుతారు. ఆ సమయంలో కింద దొర్లే వారికి పెళ్లికొడుకు డబ్బులు ఇవ్వడం ఆనవాయితీ. ఐదు రోజుల పాటు విందు తప్పనిసరి పెళ్లి చేసిన కుటుంబాలు తప్పనిసరిగా గ్రామస్తులందరికీ ఐదు రోజులపాటు సహపంక్తి భోజనాలు పెట్టవలసిందే. అందులో మాంసం తప్పనిసరి. మొదటి మూడు రోజులపాటు బంధువులు, చుట్టుపక్కల వారు భోజనాలకు వస్తారు. మూడో రోజున శోభనం జరిపిస్తారు. నాలుగో రోజున ఊరందరికీ భోజనాలు (ఊర బంతి) పెట్టి తీరాలి. దీనికి గ్రామంలో ఎవరైనా హాజరుకాకపోతే.. పెళ్లి వారింటి నుంచే వారికి భోజనం పంపిస్తారు. ఐదో రోజున మాత్రం పెళ్లి జరిగిన రెండు కుటుంబాల వారు, బంధువులకు భోజనాలు పెడతారు. ఇలా ఐదు రోజుల పెళ్లి సందడిగా.. సంప్రదాయబద్ధంగా సాగిపోతుంది. మా పెళ్లికి పెద్దలే పురోహితులు మా తెగల్లో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు. మంత్రాలు ఉండవు. తాళి»ొట్టు ఉండదు. నా పెళ్లి అలాగే జరిగింది. నేను ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. అదే విషయాన్ని పెద్దలకు చెప్తే వారు అమ్మాయివైపు వారితో మాట్లాడి వివాహం చేశారు. మెడలో నల్లపూసల దండ వెయ్యడంతో నా పెళ్లి అయిపోయింది. – కెచ్చెల బుల్లిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం పెద్దల మాటకు విలువిస్తాం పెళ్లి సమయంలో పెద్దల మాటకే విలువ ఇస్తాం. వారు చెప్పిందే వేదం. అదే ఆచారం. గ్రామ దేవతలు మా కుల దేవతలు. వారినే పూజిస్తాం. పంటలు చేతికి వచ్చే సమయంలో చేసే పండుగలో తప్పనిసరిగా గ్రామ దేవత పూజలు విధిగా చేస్తాం. – కెచ్చెల పద్మ, కొండరెడ్డి మహిళ, రేగులపాడు, బుట్టాయగూడెం మండలం -
అట్టహాసంగా గిరిజన దర్భార్
సాక్షి, ఆదిలాబాద్ : గిరిజన దర్బార్ అట్టహాసంగా జరిగింది. వేలాదిమంది ఆదివాసీలు తరలివచ్చారు. దీంతో నాగోబా జాతర ప్రాంగణం కళకళలాడింది. జాతర సందర్భంగా ప్రతియేటా నిర్వహించే దర్బార్‌కు ఆదివాసీలు ప్రాముఖ్యతనిస్తారు. సమస్యల పరిష్కారంతో పాటు తమ అర్జీకి న్యాయం జరుగుతుందన్న ఆశాభావం ప్రతిఒక్కరిలో కనిపిస్తుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, శాప్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య తదితరులు దర్బార్‌కు తరలివచ్చారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజనులు గిరిజన దర్బార్‌లో సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులు అర్జీలను స్వీకరించారు. వంద శాతం అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. దర్బార్ సందర్భంగా గిరిజన సంస్కాృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. గిరిజన సంప్రదాయాలు కళ్లకు కట్టేలా ప్రదర్శనలు చేపట్టారు. అంతకుముందు కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గోపి, ట్రైనీ ఐఏఎస్ అధికారి ప్రతీక్‌జైన్, ఐటీడీఏ మాజీ చైర్మన్ లక్కేరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఆర్వో నటరాజన్, డీపీఓ సాయిబాబా, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ట్రాన్స్‌కో ఎస్ఈ ఉత్తం జాడే, ఉట్నూర్ ఏఎస్పీ శబరీ ష్, మెస్రం వంశం పటేల్ వెంకట్రావు, ఎంపీటీïసీ భీంరావు, సర్పంచ్ రేణుక, ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత, తదితరులు పాల్గొన్నారు. పోడు భూములకు పరిష్కారం పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం. పోడు భూముల జోలికి అటవీ శాఖాధికారులు రాకుండా చూస్తాం. నాగోబా ఆలయ నిర్మాణానికి కావాలి్సన నిధులు ఇస్తాం. ఇప్పటికే రూ.50లక్షల నిధులను మంజూరు చేశాం. మరో రూ.50లక్షలు అందిస్తాం. రాజగోపురాలు, గ్రైనేట్, అర్చీల నిర్మాణాలకు రూ.5కోట్ల నిధులు కేటాయించాం. టెండర్‌దారులు ఎవరు ముందుకు రావడం లేదు. ఆలయ కమిటీ టెండర్లో పాల్గొని నిర్మాణం చేపట్టాలి. వెయ్యేళ్లపాటు ఆలయం చెక్కుచెదరకుండా ఉండేలా పనులు జరుగుతున్నాయి. అడవుల రక్షణకు విరివిగా మొక్కలు నాటాలి. ప్రతి గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ లైన్ వేసేలా చర్యలు చేపడతాం. ఐటీసీ ద్వారా 1159 మందికి శిక్షణ కల్పించాం. ఇందులో 24 మంది కానిస్టేబుళ్లు, 16 మంది ఆర్మీ సెలక్షన్‌కు ఎంపికయ్యారు. ఉపాధి అవకాశాల కోసం శిక్షణ కల్పిస్తున్నాం. 150 మంది విద్యార్థులను నర్సింగ్ శిక్షణ కోసం పంపిస్తే ప్రస్తుతం 62 మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. మిగితా వారు తిరిగి వచ్చారు. సొంత స్థలముంటే డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం త్వరలో చేపడతాం. నియోజకవర్గానికి 1400 ఇళ్లు మంజూరయ్యాయి. ఏజెన్సీలో రక్తహీనతతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. రక్తహీనత కారణాలను తెలుసుకోవడానికి హైదరాబాద్ నుంచి వైద్యులను పిలిపించి సర్వే చేయిస్తాం. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఇబ్బంది పెడితే.. తిరగబడతాం ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తే తిరగబడతాం. అడవిలోకి పశువులను పోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోడు వ్యవసాయం చేసేవారిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రానికి నోటీసులు పంపించింది. ప్రభుత్వం సమాధానం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆదివాసీలు విద్యతోనే రాణించే అవకాశముంది. తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపించాలి. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. – సోయం బాపురావు, ఎంపీ పిల్లల్ని బాగా చదివించాలి ఆదివాసీలు పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులను చేయాలి. పదో తరగతి ఫలితా ల్లో గిరిజనులు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడా ది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. నాలుగు జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయి. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం. అన్ని గ్రామాలకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. గిరి వికాసం పథకం కింద రూ.50కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకానికి 4వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. – కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ వెళ్లేందుకు బాధగా ఉంటుంది జిల్లా కలెక్టర్‌గా ఆదిలాబాద్‌కు బదిలీపై వస్తున్నప్పుడు బాధపడుతూ వచ్చా. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలను చూసి ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లాలనే ఆలోచన సైతం బాధ కలిగిస్తోంది. ఇక్కడకు బదిలీ అయినప్పుడు చెన్నైలో పంటినొప్పితో బాధపడుతున్నా. చీఫ్ సెక్రెటరీ బదిలీ అయ్యిందని సమాచారం అందించగా.. నాకు మినహాయింపు ఇవ్వాలని కోరిన. అప్పటి పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా విధుల్లో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఇతర జిల్లాకు వెళ్లాలంటే బాధగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా సంస్కృతి చాలా గొప్పది. అడవిలో ఎవరైన చెట్లు నరికితే గిరిజనులు పోలీ సులకు సమాచారం అందించాలి. హక్కులు, ఆశయాలు సాధించుకోవాలి. – దివ్యదేవరాజన్, ఆదిలాబాద్ కలెక్టర్ నాగోబాకు వందేళ్ల చరిత్ర కేస్లాపూర్‌లోని నాగోబా జాతరకు వందేళ్ల చరిత్ర ఉంది. ఆదివాసీలకు అడవి అంటే ఎంతో నమ్మకం. పూజ, ఆచార వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయి. ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో ఇతరులు ప్రవేశించవద్దు. కేస్లాపూర్లో జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఫిబ్రవరి 5న జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరుకావాలి. –సీతక్క, ములుగు ఎమ్మెల్యే -
ఆదివాసీ తెగల నుంచి లంబాడాలను తొలగించాలి
నిర్మల్అర్బన్ : ఆదివాసీ తెగల నుంచి లంబాడాలను తొలగించాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్స వాన్ని తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట గల కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం అక్కడి నుంచి వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వర కు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గుస్సాడి నృ త్యాలు అలరించాయి. అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడా రు. జిల్లా కేంద్రంలో ఆదివాసీ భవనం కోసం స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాల ని డిమాండ్ చేశారు. ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. 60 శాతం ఆదివాసీలు నివసిస్తున్న నాన్ షెడ్యూల్డు ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతాలుగా గుర్తించా లని కోరారు. ఆదివాసీలకు స్వయం పాలన కల్పి స్తూ ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకులతో సం బంధం లేకుండా అర్హులైన ఎస్టీలకు సబ్సిడీ రుణా లు ఇవ్వాలని, ఆదివాసీ విద్యార్థులకు జిల్లా కేం ద్రంలో స్టడీసెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీటీడీవో శ్రీనివాస్‌రెడ్డిని సన్మానించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు భూమేశ్, నాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షుడు మొసలి చిన్నయ్య, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సకెందర్, ఆదివాసీ రాంజీ గోండు జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌రావ్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. భీమేష్, తదితరులున్నారు. ఆదివాసీ దినోత్సవాన్నిఅధికారికంగా జరపాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం సంఘం ఆధ్వర్యంలో ‘ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుమురం భీం, రాంజీగోండ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలతో ప్రదర్శన నిర్వహించారు. చైన్గేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆదివాసీలకు డబుల్ బెడ్రూం, మూడెకరాల సాగు భూమి, సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డోల్, తుడుంపేప్రె, గుస్సాడి డేంసా తదితర పాటలపై ఆదివాసీలు చేసిన నృత్యాలు అలరించాయి. ఇందులో నాయకులు నైతం భీంరావు, సోయం సూర్యబావ్, ఉయిక భీంరావు, బుర్కె విశ్వనాథ్, సుదర్శన్, జంగు, నాగోరావు, సుంగన్న, గణపతి,తదితరులున్నారు. -
ఆ‘‘దీన’’వాసులు
పాల్వంచరూరల్ : ఉమ్మడి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. 4, 14,400 మంది గిరిజనులున్నారు. వీరిలో కోయ గిరిజనులు 2 లక్షల28 వేల 400 మంది, కొండరెడ్లు 1000మంది, నాయక్‌పోడు 2,500 మంది, యానాది 800మంది, ఎరుకల 4,100 మంది, లంబాడీలు1,48,900మంది, సంచార తెగలు 2,500మంది, గొత్తికోయలు సుమారు 35,000మంది నివసిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 5,06,400 మంది ఉండేవారు. మొత్తం ఆదివాసీ తెగలు 70కిపైగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 13 తెగలవారు ఉన్నారు. వీరిలో కోయ, కొండరెడ్లు, గొత్తికోయలు, నాయక్‌పోడ్, సంచార తెగలవారు నివసిస్తున్నారు. భద్రాద్రిజిల్లాలో సుమారు 35000 మంది ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన గొత్తి కోయలు ఉన్నారు. కానీ వీరికి మన రాష్ట్రంలో అధికారిక గుర్తింపు లేదు. దీంతో ప్రభుత్వం చేపట్టే అరకొర సంక్షేమ పథకాలు కూడా అందవు. భిన్నమైన ఆచార వ్యవహారాలు కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు, తినే ఆహారం ఇలా.. ఆదివాసీలవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఏళ్ల తరబడి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 1960 జనవరి 26 నుంచి రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిపుత్రులు, గిరిజనులు, అడవి బిడ్డలు, వనవాసీలు, ఆదివాసీలుగా పిలుస్తారు. ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొందరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. చీపుర్లు, తునికిపండ్లు, ఇప్పపువ్వు, తబ్తిబంక, తేనె, పరికిపండ్లు, నేరేడుపండ్లు, ముష్టిగింజలు, చిల్లిగింజలు, చింతగింజలు, తునికాకు సేకరించి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 1974లోనే ఐటీడీఏ ఏర్పాటు ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం 1974లో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులోకి పలు శాఖలను చేర్చి పాలన నిర్వహిస్తున్నారు. పాలకుల పట్టింపులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఆదివాసీ కుటుంబాలు ఇంకా అభివృద్ధికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారని బతుకులు 5వ షెడ్యూల్‌కు వచ్చే అటవీ హక్కుల చట్టాలు పీసా, 1/70 ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. ఆదివాసీల బతుకుల్లో మాత్రం మార్పు కన్పించడంలేదు. వారి గూడేల్లో, పల్లెల్లో కనీస మౌలిక సౌకర్యాలైన రహదారులు, తాగునీరు, విద్యుత్ ఉండదు. దీంతో అక్కడ నివాసం ఉండే ఆదివాసీ గిరిజనులు చెలిమ నీళ్లు, వాగుల్లో, కుంటల్లో లభించే నీటినే తాగుతున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. పాల్వంచ మండలంలోని రాళ్లచెలక, చిరుతానిపాడు, సీతారాంపురం, ఎర్రబోరు, ఒడ్డుగూడెం తదితర గ్రామాల్లో గిరిజనులపాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆర్చరీలో ఆరితేరి.. ఆదివాసీలు విలువిద్యలో రాణిస్తుంటారు. జిల్లాలో నుంచి అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చూపినవారూ ఉన్నారు. కిన్నెరసానిలో ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ క్రీడా పాఠశాలలో విలువిద్య లో ప్రత్యేక శిక్షణనిస్తారు. సుమారు 30మంది జాతీయ స్థాయిలో, 100మంది రాష్ట్రస్థాయిలో, మరో 150 మంది జిల్లాస్థాయిలో ఇక్కడి విద్యార్థులు ప్రతిభ చాటారు. పలువురు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు. స్పోర్ట్స్ ప్రతిభతో శివశంకర్ ఆర్మీలో, దుర్గ, ప్రసాద్‌లు ఫిజికల్ డైరెక్టర్లుగా, వెంకయ్య రైల్వేలో, శేఖర్ పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారు. ఆదివాసీల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి ఆదివాసీల దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం అధికారికంగా నిర్వహించడంతోపాటు సెలవుదినంగా ప్రకటించాలి. ఆదివాసీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, చట్టాలను అమలుచేసి, వారిని రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. –వాసం రామకృష్ణ దొర, రాజకీయ జేఏసీ చైర్మన్ ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి ఏజెన్సీలో అభివృద్ధికి ఆమడదూరంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను పటిష్టంగా అమలు చేయాలి. అటవీ హక్కుల చట్టం, పీసా, 1/70 చట్టం సక్రమంగా అమ లు జరగడంలేదు. పేద గిరిజనులకు సాగుభూమి ఇవ్వాలి. –కన్నెబోయిన నర్సయ్య, మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొత్తి కోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రా ష్ట్రంలోనికి వలస వచ్చి 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గొత్తికోయలను ఎస్టీజాబితాలో చేర్చాలి. ఆదివాసీ తెగలకు ప్రభుత్వం న్యా యం చేయాలి. ఏజెన్సీలో ఆర్ ఓఎఫ్ ఆర్ చట్టానికి అనుబంధంగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి. –పొడుగు శ్రీనాథ్,తుడుందెబ్బ రాష్ట్ర న్యాయసలహాదారు తెలంగాణలోనూ తొలగని కష్టాలు దుర్భరంగా వలస ఆదివాసీల బతుకులు = పోడు భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు భద్రాచలం: ఏజెన్సీలో ఆదివాసీలు ఎంతో కాలం గా అభివృద్ధికి దూరంగానే బతుకుతున్నారు. కొత్త రాష్ట్రంలోనూ వారి దుస్థితి మారలేదు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం ఏజెన్సీని రెండు ముక్కలు చేసి పాలకులు ఆదివాసీల అస్థిత్వానికి ప్రమాదం తెచ్చిపెట్టారు. గతంలో ఐటీడీఏకు వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుతం ఐటీడీఏలో దర ఖాస్తులు ఇచ్చినా ప్రయోజనం చేకూరడంలేదు. అరకొరగా అందిన సంక్షేమ పథకాలు రానురాను అందకుండాపోతున్నాయి. ట్రైకార్ ద్వారా రుణాలు వస్తున్నా.. సబ్సిడీ బినామీల పాలవతుందనే విమర్శ లు ఉన్నాయి. ఆదివాసీలు ఉపాధి, ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. అందుకే స్వయం పాలన కోసం ఆదివాసీలు పోరుబాట పట్టారు. పోడు సాగుదారులపై వేధింపులు తరతరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఇటీవల కాలంలో అటవీశాఖాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 31,961 మంది గిరిజనులకు 114082.23 లక్షల ఎకరాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి హక్కు పత్రాలు అందజేశారు. 2009లో ఆదివాసీ దినోత్సవం రోజున భద్రాచలంలో వీటిని పంపిణీ చేశారు. మహానేత మరణానంతరం పాలకులు పోడు సమస్యను పట్టించుకోకపోగా ఆదివాసీల చేతుల్లో ఉన్న భూములను లాక్కునేందుకు యత్నిస్తున్నారు. హరితహారం పేరుతో తమను భూముల నుంచి వెళ్లగొడుతున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కా గృహాలకు నోచుకోని ఆదివాసీలు ఎన్నో ఏళ్లుగా మారుమూల అటవీప్రాంతాల్లో నివసించే చాలా మంది ఆదివాసీలకు సరైన ఇళ్లు లేవు. గతంలో ఇందిరమ్మ పథకం పేరుతో మం జూరైన ఇళ్లు చాలా చోట్ల అసంపూర్తిగానే ఉన్నా యి. గిరిజనులకు 2,69,610 ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 2,15,109 పూర్తయినట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు చెల్లించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హౌసింగ్ బోర్డును పూర్తి గా ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కూడా మండల స్థాయిలో అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ నిర్మించే డబుల్బెడ్రూం ఇళ్లు ఆదివాసీలకు ఏమాత్రం సరిపోయేటట్లుగా లేవు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి..బతుకులు దుర్భరం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలస వస్తున్న ఆదివాసీలు మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడక జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొంత మంది హైదరాబాద్, విజయవాడ, పొరుగు రాష్ట్రాలకు కూడా వలస వెళుతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసానికి గురవుతునే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 220కి పైగా వల స ఆదివాసీ(గొత్తికోయ)గ్రామాలు ఉన్నాయి. కానీ ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. భద్రాద్రి జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో, గుండాల, ఆళ్లపల్లి, పినసాక, కరకగూడెం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో నేటికి సరైన మౌలిక వసతులు లేవు. అటవీ ప్రాంతం నుండి మండల కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నేటికి కొనసాగుతూనే ఉంది. వాహనాలు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. ఎవరైన జబ్బు పడినా, గర్భీణీలకు నొప్పులు వచ్చినా ఇబ్బందులు పడాల్సిందే. పీహెచ్‌సీలకు తీసుకువస్తున్న గర్భిణులు మార్గమధ్యంలోనే ప్రసవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అధికారుల, రాజకీయ నాయకుల ప్రకటనలే తప్ప ఆచరణలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తున్నప్పటకీ, అటవీశాఖ చర్యలతో వారి అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులు లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యలపై దృష్టి సారించటం లేదు. తొలకరి వేళ.. భూమి పండగ ములకలపల్లి : ఆదివాసీలు సంప్రదాయ వేడుకల్లో భూమి పండగ అతిముఖ్యమైనది. భూముల్లో బంగారు పంటలు పండాలని కోరుకుంటూ ప్రతియేటా తొలకరిలో ఈ వేడుక నిర్వహిస్తారు. మూడు రోజులపాటు ఉత్సవం జరుపుతారు. చివరి రోజు సామూహిక భోజనాలు చేస్తారు. భూమి పండగకు సుమారు వారం రోజుల ముందు గ్రామంలో నవధాన్యాలు సేకరించి గ్రామదేవతకు(సుంకు పండగ) సమర్పిస్తారు. అనంతరం ఏరువాక సాగుతారు. తొలిరోజు గ్రామం లో నిత్యావసర సేకరించి పురుషులు గ్రామశివారులోకి వెళ్ళి వంటలు చేసి, అక్కడే భోజనం చేస్తారు. ఆసమయంలో గ్రామంలోని మహిళలు గ్రామదేవత గద్దెను ముగ్గులతో అలంకరించి, ముగ్గు మధ్యలో ‘కోడిగుడ్డు’ను ఉంచుతారు. మగవారు గ్రామంలో ప్రవేశించగా, మహిళలతో కలిసి బాణాలు, అంబులు ధరిస్తారు. పాటలు, ‘రేలా’ నృత్యాలు చేస్తూ, గ్రామపెద్దమహిళతో దేవత వద్ద వుంచిన కోటిగుడ్డును బాణంతో పగులగొట్టిస్తారు. అనంతరం పూజలు చేసి, రేలా నృత్యాలు చేస్తారు. రెండో రోజు గ్రామ దేవతకు బోనా లు సమర్పిస్తారు. మూడో రోజు బలిచ్చిన జీవాలను దేవుళ్లకు సమర్పిస్తారు. గ్రామస్తులందరూ సామూహిక భోజనా లు చేస్తారు. ఆఖరులో గద్దెవద్ద ఉంచిన నవధాన్యాల(ధాన్యం) ను ఇళ్లకు తీసుకెళ్ళి తమ విత్తనాల్లో కలిపి తమ సేద్యపు భూముల్లో చల్లుతారు. పంచాయతీగా కొండరెడ్ల గ్రామందమ్మపేట: మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పూసుకుంట కొండరెడ్ల గిరిజన గ్రామం ఉంది. మొన్నటి వరకు అంకంపాలెం పంచాయతీ పరిధిలో ఉండేది. ఇక్కడికి రావాలంటే పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో ఉన్న రోడ్డు మార్గం ద్వారా నడిచిరావాలి. పంచాయతీల పునర్విభజనలో భాగంగా పూసుకుంట గ్రామాన్ని పంచాయతీగా చేశారు. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఆ గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం వరకు ఎక్కువ మందికి పెళ్లి కాలేదు. గ్రామంలో అందరూ బంధువులే కావడం, వరుసలు కలవకకపోవడం ఇందుకు కారణం. తర్వాత అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం, ఆంధ్రాలో విలీనమైన వేలేరుపాడు మండలం కొయిదా, కాచారం, పశ్చిమగోదావరి జిల్లాలోని పందిరిమామిడిగూడెం గ్రామాల కొండరెడ్లతో బంధుత్వాలు కలిసాక పూసుకుంటలో యువతీ, యువకులకు వివాహాలు జరుగుతున్నాయి. గ్రామానికి ఉమ్మడి ట్రాక్టర్, మ్యాజిక్ ఆటో పూసుకుంట కొండరెడ్లకు వ్యవసాయం చేసుకునేందుకు భద్రాచలం ఐటీడీఏ ఒక ట్రాక్టర్ ఇచ్చింది. ఎవరి పొలంలో నాటు అయితే వారే ఆ రోజు ట్రాక్టర్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. మరో టాటా మ్యాజిక్ ఆటోను ఇచ్చింది. వారం వారం దమ్మపేట సంతకు వెళ్లేందుకు, ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లటానికి దీన్ని వినియోగిస్తున్నారు. తీరనున్న రోడ్డు నిర్మాణ సమస్య ప్రధాన రహదారి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పూసుకుంట గ్రామం ఉంది. మధ్యలో మూడు పెద్ద వాగులను దాటాలి. వర్షాకాలంలో వర్షం వచ్చి వాగులు పొంగితే బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలే ఉండవు. ఆ రోడ్డు నిర్మాణానికి రెండు పర్యాయాలు ఐటీడీఏ నిధులు మంజూరు చేసింది. వాగుల్లో పెద్దపెద్ద పైపులు వేసి కల్వర్టు నిర్మాణాలు ప్రారంభించారు. తమ అనుమతులు లేవని అటవీశాఖ రోడ్డు కల్వర్టు పనులను అడ్డుకుంది. దీంతో రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. గతేడాది మార్చిలో మళ్లీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సర్వే చేయించింది. తాజాగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మధ్యలో వాగులపై వంతెనలు సైతం నిర్మాణం కానున్నా యి. ఈ పనులకు సంబంధించి టెండర్లు సైతం పూర్తి అయ్యాయి. అక్కడ కొండరెడ్ల గిరిజన యువత ఉపాధికి ఐటీడీఏ నిధులు వెచ్చిస్తోంది. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అక్కడ యువకులకు ఐదు తేనెటీగల పెంపకం యూనిట్లను మంజూరు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో ఉపాధి తేనెటీగల పెంపకంతో మాకు కొంత ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీడీఏ చర్యలు తీసుకుంది. తేనె విక్రయాలు ద్వారా కొంత ఆదాయం పొందుతున్నాం. కొండరెడ్ల యువతీ, యువకుల అభివృద్ధికి ఐటీడీఏ ఇంకా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. –కొమ్మిరెడ్డి, పూసుకుంట -
ప్రెగ్నెన్సీ వస్తేనే పెళ్లి!
చెన్నై: అడవుల్లో నివసించే ఆదివాసీల సంప్రదాయాలు ఆధునికులకు వింతగా ఉంటాయి. ఒక్కో తెగ పద్దతులు ఒక్కోలా ఉంటాయి. అలాగే తమిళనాడు అడవుల్లో నివసించే టోడ అనే గిరిజన తెగ సంప్రదాయాలు చూడటానికి, వినడానికి విచిత్రంగా ఉంటాయి. నీలగిరి అడవుల్లో ఉండే ఈ తెగ పెళ్లి విషయంలో వింత ఆచారాన్ని పాటిస్తారు. ఆ పెళ్లి స్పెషాలిటీ ఏమిటంటే.... టోడ గిరిజన తెగలో పెళ్లివేడుక సాధారణంగా నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత వధువు, వరుడితో గడుపుతుంది. అనంతరం వధువు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు కచ్ఛితంగా నెల తప్పాల్సిందే. గర్భం ధరించకపోతే ఆ వివాహం చెల్లదు. నెల తప్పితే ఏడో నెలకు భర్త అడవికి వెళ్ళి పవిత్రంగా భావించే చెట్టు కాండంతో విల్లు, బాణం తయారు చేసి భార్యకు ఇస్తారు. ఆవస్తువులు భార్యకు నచ్చి తీసుకొంటే అతడిని భర్తగా అంగీకరించినట్లు. అంతేకాదు కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిగా కూడా ఒప్పుకొంటుంది. ఈకార్యక్రమం అనంతరం విల్లు, బాణం వేడుకలు భారీ ఎత్తున జరుపుతారు. సంప్రదాయ నృత్యాలు పాటలతో ఘనంగా సంబరాలు చేసుకొంటారు. ఈ వేడుకలు అనంతరం ఇరువురు పెద్దల ఆశీర్వాదంతో అప్పటి నుంచి భార్యాభర్తల్లా జీవితాంతం కలిసి ఉంటారు. -
జాతరకు రూ.40 లక్షలు మంజూరు
ఇంద్రవెల్లి: తెలంగాణలో ఎంతో గుర్తింపు పొందిన నాగోబా జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న మెస్రం వంశీయుల మహాపూజతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసింది. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ ప్రత్యేక శ్రద్ధతో పనులు చేయిస్తున్నారు. జాతరలో భాగంగా ఆదివాసీ సంప్రదాయ ఆటలపోటీలు కూడా జరుగనున్నాయి.