ఆ‘‘దీన’’వాసులు | Tribal Day | Sakshi
Sakshi News home page

ఆ‘‘దీన’’వాసులు

Published Thu, Aug 9 2018 12:21 PM | Last Updated on Thu, Aug 9 2018 12:21 PM

Tribal Day  - Sakshi

2009లో వైఎస్‌ చేతుల మీదుగా పట్టా అందుకుంటున్న ఆదివాసీలు(ఫైల్‌)

పాల్వంచరూరల్‌ : ఉమ్మడి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం..  4, 14,400 మంది గిరిజనులున్నారు. వీరిలో కోయ గిరిజనులు 2 లక్షల28 వేల 400 మంది, కొండరెడ్లు 1000మంది, నాయక్‌పోడు 2,500 మంది, యానాది 800మంది, ఎరుకల 4,100 మంది, లంబాడీలు1,48,900మంది, సంచార తెగలు 2,500మంది, గొత్తికోయలు సుమారు 35,000మంది నివసిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 5,06,400 మంది ఉండేవారు. మొత్తం ఆదివాసీ తెగలు 70కిపైగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో 13 తెగలవారు ఉన్నారు. వీరిలో కోయ, కొండరెడ్లు, గొత్తికోయలు, నాయక్‌పోడ్, సంచార తెగలవారు నివసిస్తున్నారు. భద్రాద్రిజిల్లాలో సుమారు 35000 మంది ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన గొత్తి కోయలు ఉన్నారు. కానీ వీరికి మన రాష్ట్రంలో అధికారిక గుర్తింపు లేదు. దీంతో ప్రభుత్వం చేపట్టే అరకొర సంక్షేమ పథకాలు కూడా అందవు. 

భిన్నమైన ఆచార వ్యవహారాలు 

కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు, తినే ఆహారం ఇలా.. ఆదివాసీలవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఏళ్ల తరబడి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 1960 జనవరి 26 నుంచి రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిపుత్రులు, గిరిజనులు, అడవి బిడ్డలు, వనవాసీలు, ఆదివాసీలుగా పిలుస్తారు. ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొందరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. చీపుర్లు, తునికిపండ్లు, ఇప్పపువ్వు, తబ్తిబంక, తేనె, పరికిపండ్లు, నేరేడుపండ్లు, ముష్టిగింజలు, చిల్లిగింజలు, చింతగింజలు, తునికాకు సేకరించి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.  

1974లోనే ఐటీడీఏ ఏర్పాటు 

ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం 1974లో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులోకి పలు శాఖలను చేర్చి పాలన నిర్వహిస్తున్నారు. పాలకుల పట్టింపులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి ఆదివాసీ కుటుంబాలు ఇంకా అభివృద్ధికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మారని బతుకులు

5వ షెడ్యూల్‌కు వచ్చే అటవీ హక్కుల చట్టాలు పీసా, 1/70 ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. ఆదివాసీల బతుకుల్లో మాత్రం మార్పు కన్పించడంలేదు. వారి గూడేల్లో, పల్లెల్లో కనీస మౌలిక సౌకర్యాలైన రహదారులు, తాగునీరు, విద్యుత్‌ ఉండదు. దీంతో అక్కడ నివాసం ఉండే ఆదివాసీ గిరిజనులు చెలిమ నీళ్లు, వాగుల్లో, కుంటల్లో లభించే నీటినే తాగుతున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం లేదు. పాల్వంచ మండలంలోని రాళ్లచెలక, చిరుతానిపాడు, సీతారాంపురం, ఎర్రబోరు, ఒడ్డుగూడెం తదితర గ్రామాల్లో గిరిజనులపాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి.

ఆర్చరీలో ఆరితేరి..  

ఆదివాసీలు విలువిద్యలో రాణిస్తుంటారు. జిల్లాలో నుంచి అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చూపినవారూ ఉన్నారు. కిన్నెరసానిలో ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ క్రీడా పాఠశాలలో విలువిద్య లో ప్రత్యేక శిక్షణనిస్తారు. సుమారు 30మంది జాతీయ స్థాయిలో,  100మంది రాష్ట్రస్థాయిలో, మరో 150 మంది జిల్లాస్థాయిలో ఇక్కడి విద్యార్థులు ప్రతిభ చాటారు. పలువురు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు సాధించారు. స్పోర్ట్స్‌ ప్రతిభతో శివశంకర్‌ ఆర్మీలో, దుర్గ, ప్రసాద్‌లు ఫిజికల్‌ డైరెక్టర్‌లుగా, వెంకయ్య రైల్వేలో, శేఖర్‌ పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు సాధించారు.  

ఆదివాసీల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి  

ఆదివాసీల దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం అధికారికంగా నిర్వహించడంతోపాటు సెలవుదినంగా ప్రకటించాలి. ఆదివాసీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, చట్టాలను అమలుచేసి, వారిని రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలి.   –వాసం రామకృష్ణ దొర, రాజకీయ జేఏసీ చైర్మన్‌ 

ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి  

ఏజెన్సీలో అభివృద్ధికి ఆమడదూరంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను పటిష్టంగా అమలు చేయాలి. అటవీ హక్కుల చట్టం, పీసా, 1/70 చట్టం సక్రమంగా అమ లు జరగడంలేదు. పేద గిరిజనులకు సాగుభూమి ఇవ్వాలి. 

–కన్నెబోయిన నర్సయ్య, మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి 

గొత్తి కోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి 

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రా ష్ట్రంలోనికి వలస వచ్చి 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గొత్తికోయలను ఎస్టీజాబితాలో చేర్చాలి. ఆదివాసీ తెగలకు ప్రభుత్వం న్యా యం చేయాలి. ఏజెన్సీలో ఆర్‌ ఓఎఫ్‌ ఆర్‌ చట్టానికి అనుబంధంగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి. 

–పొడుగు శ్రీనాథ్,తుడుందెబ్బ రాష్ట్ర న్యాయసలహాదారు

తెలంగాణలోనూ తొలగని కష్టాలు

దుర్భరంగా వలస ఆదివాసీల బతుకులు  = పోడు భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు భద్రాచలం: ఏజెన్సీలో ఆదివాసీలు ఎంతో కాలం గా అభివృద్ధికి దూరంగానే బతుకుతున్నారు.  కొత్త రాష్ట్రంలోనూ వారి దుస్థితి మారలేదు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం ఏజెన్సీని రెండు ముక్కలు చేసి పాలకులు ఆదివాసీల అస్థిత్వానికి ప్రమాదం తెచ్చిపెట్టారు. గతంలో ఐటీడీఏకు వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉండేది.

కానీ ప్రస్తుతం ఐటీడీఏలో దర ఖాస్తులు ఇచ్చినా ప్రయోజనం చేకూరడంలేదు. అరకొరగా అందిన సంక్షేమ పథకాలు రానురాను అందకుండాపోతున్నాయి. ట్రైకార్‌ ద్వారా రుణాలు వస్తున్నా.. సబ్సిడీ బినామీల పాలవతుందనే విమర్శ లు ఉన్నాయి. ఆదివాసీలు ఉపాధి, ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. అందుకే స్వయం పాలన కోసం ఆదివాసీలు పోరుబాట పట్టారు. 

పోడు సాగుదారులపై వేధింపులు 

తరతరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఇటీవల కాలంలో అటవీశాఖాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో  31,961 మంది గిరిజనులకు  114082.23 లక్షల ఎకరాలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హక్కు పత్రాలు అందజేశారు. 2009లో ఆదివాసీ దినోత్సవం రోజున భద్రాచలంలో వీటిని పంపిణీ చేశారు. మహానేత మరణానంతరం పాలకులు పోడు సమస్యను పట్టించుకోకపోగా  ఆదివాసీల చేతుల్లో ఉన్న భూములను లాక్కునేందుకు యత్నిస్తున్నారు. హరితహారం పేరుతో  తమను భూముల నుంచి వెళ్లగొడుతున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

పక్కా గృహాలకు నోచుకోని ఆదివాసీలు 

ఎన్నో ఏళ్లుగా మారుమూల అటవీప్రాంతాల్లో నివసించే చాలా మంది ఆదివాసీలకు సరైన ఇళ్లు లేవు.  గతంలో ఇందిరమ్మ పథకం పేరుతో మం జూరైన ఇళ్లు చాలా చోట్ల అసంపూర్తిగానే ఉన్నా యి. గిరిజనులకు 2,69,610 ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో  2,15,109 పూర్తయినట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి.  పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు చెల్లించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హౌసింగ్‌ బోర్డును పూర్తి గా ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  ప్రకటించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కూడా మండల స్థాయిలో అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ నిర్మించే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఆదివాసీలకు ఏమాత్రం సరిపోయేటట్లుగా లేవు.  

ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి..బతుకులు దుర్భరం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వలస వస్తున్న ఆదివాసీలు మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడక జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొంత మంది హైదరాబాద్, విజయవాడ, పొరుగు రాష్ట్రాలకు కూడా వలస వెళుతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసానికి గురవుతునే ఉన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో  220కి పైగా వల స ఆదివాసీ(గొత్తికోయ)గ్రామాలు ఉన్నాయి.

కానీ ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. భద్రాద్రి జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో,  గుండాల, ఆళ్లపల్లి, పినసాక, కరకగూడెం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో నేటికి సరైన మౌలిక వసతులు లేవు. అటవీ ప్రాంతం నుండి మండల కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నేటికి కొనసాగుతూనే ఉంది. వాహనాలు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు.  

ఎవరైన  జబ్బు పడినా, గర్భీణీలకు నొప్పులు వచ్చినా ఇబ్బందులు పడాల్సిందే. పీహెచ్‌సీలకు తీసుకువస్తున్న గర్భిణులు మార్గమధ్యంలోనే ప్రసవించిన  సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అధికారుల, రాజకీయ నాయకుల ప్రకటనలే తప్ప ఆచరణలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా ఉంది.  

కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తున్నప్పటకీ, అటవీశాఖ చర్యలతో వారి అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులు లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యలపై దృష్టి సారించటం లేదు.

తొలకరి వేళ.. భూమి పండగ 

ములకలపల్లి : ఆదివాసీలు సంప్రదాయ వేడుకల్లో భూమి పండగ అతిముఖ్యమైనది. భూముల్లో బంగారు పంటలు పండాలని కోరుకుంటూ ప్రతియేటా తొలకరిలో ఈ  వేడుక నిర్వహిస్తారు. మూడు రోజులపాటు ఉత్సవం జరుపుతారు. చివరి రోజు సామూహిక భోజనాలు చేస్తారు.  భూమి పండగకు సుమారు వారం రోజుల ముందు గ్రామంలో నవధాన్యాలు సేకరించి  గ్రామదేవతకు(సుంకు పండగ) సమర్పిస్తారు. అనంతరం ఏరువాక సాగుతారు.

తొలిరోజు గ్రామం లో నిత్యావసర సేకరించి పురుషులు గ్రామశివారులోకి వెళ్ళి వంటలు చేసి, అక్కడే భోజనం చేస్తారు. ఆసమయంలో గ్రామంలోని మహిళలు గ్రామదేవత గద్దెను ముగ్గులతో అలంకరించి, ముగ్గు మధ్యలో ‘కోడిగుడ్డు’ను ఉంచుతారు. మగవారు గ్రామంలో ప్రవేశించగా, మహిళలతో కలిసి బాణాలు, అంబులు ధరిస్తారు. పాటలు, ‘రేలా’ నృత్యాలు చేస్తూ, గ్రామపెద్దమహిళతో దేవత వద్ద వుంచిన కోటిగుడ్డును బాణంతో పగులగొట్టిస్తారు.

అనంతరం పూజలు చేసి, రేలా నృత్యాలు చేస్తారు.  రెండో రోజు గ్రామ దేవతకు బోనా లు సమర్పిస్తారు.   మూడో రోజు బలిచ్చిన జీవాలను దేవుళ్లకు సమర్పిస్తారు.  గ్రామస్తులందరూ సామూహిక భోజనా లు చేస్తారు. ఆఖరులో గద్దెవద్ద ఉంచిన నవధాన్యాల(ధాన్యం) ను ఇళ్లకు తీసుకెళ్ళి తమ  విత్తనాల్లో కలిపి తమ సేద్యపు భూముల్లో చల్లుతారు. పంచాయతీగా కొండరెడ్ల గ్రామందమ్మపేట: మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పూసుకుంట కొండరెడ్ల గిరిజన గ్రామం ఉంది.

మొన్నటి వరకు అంకంపాలెం పంచాయతీ పరిధిలో ఉండేది. ఇక్కడికి రావాలంటే పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో ఉన్న రోడ్డు మార్గం ద్వారా నడిచిరావాలి. పంచాయతీల పునర్విభజనలో భాగంగా  పూసుకుంట గ్రామాన్ని పంచాయతీగా చేశారు. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఆ గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం వరకు ఎక్కువ మందికి పెళ్లి కాలేదు.

గ్రామంలో అందరూ బంధువులే కావడం, వరుసలు కలవకకపోవడం ఇందుకు కారణం. తర్వాత అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం, ఆంధ్రాలో విలీనమైన వేలేరుపాడు మండలం కొయిదా, కాచారం, పశ్చిమగోదావరి జిల్లాలోని పందిరిమామిడిగూడెం గ్రామాల కొండరెడ్లతో బంధుత్వాలు కలిసాక పూసుకుంటలో యువతీ, యువకులకు వివాహాలు జరుగుతున్నాయి.   

గ్రామానికి ఉమ్మడి ట్రాక్టర్, మ్యాజిక్‌ ఆటో 

పూసుకుంట కొండరెడ్లకు వ్యవసాయం చేసుకునేందుకు భద్రాచలం ఐటీడీఏ ఒక ట్రాక్టర్‌ ఇచ్చింది. ఎవరి పొలంలో నాటు అయితే వారే ఆ రోజు ట్రాక్టర్‌ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. మరో టాటా మ్యాజిక్‌ ఆటోను ఇచ్చింది. వారం వారం దమ్మపేట సంతకు వెళ్లేందుకు, ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లటానికి దీన్ని వినియోగిస్తున్నారు. 

తీరనున్న రోడ్డు నిర్మాణ సమస్య 

ప్రధాన రహదారి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పూసుకుంట గ్రామం ఉంది. మధ్యలో మూడు పెద్ద వాగులను దాటాలి. వర్షాకాలంలో వర్షం వచ్చి వాగులు పొంగితే బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలే ఉండవు. ఆ రోడ్డు నిర్మాణానికి రెండు పర్యాయాలు ఐటీడీఏ నిధులు మంజూరు చేసింది. వాగుల్లో పెద్దపెద్ద పైపులు వేసి కల్వర్టు నిర్మాణాలు ప్రారంభించారు. తమ అనుమతులు లేవని అటవీశాఖ రోడ్డు కల్వర్టు పనులను అడ్డుకుంది.

దీంతో రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. గతేడాది మార్చిలో మళ్లీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సర్వే చేయించింది. తాజాగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.  మధ్యలో వాగులపై వంతెనలు సైతం నిర్మాణం కానున్నా యి. ఈ పనులకు సంబంధించి టెండర్లు సైతం పూర్తి అయ్యాయి. అక్కడ కొండరెడ్ల గిరిజన యువత ఉపాధికి ఐటీడీఏ నిధులు వెచ్చిస్తోంది. తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అక్కడ యువకులకు ఐదు తేనెటీగల పెంపకం యూనిట్లను మంజూరు చేసి ఉపాధి కల్పిస్తున్నారు.

తేనెటీగల పెంపకంతో ఉపాధి 

తేనెటీగల పెంపకంతో మాకు కొంత ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీడీఏ చర్యలు తీసుకుంది. తేనె విక్రయాలు ద్వారా కొంత ఆదాయం పొందుతున్నాం. కొండరెడ్ల యువతీ, యువకుల అభివృద్ధికి ఐటీడీఏ ఇంకా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 

–కొమ్మిరెడ్డి, పూసుకుంట  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు

2
2/3

సంప్రదాయ వేషధారణలో ఆదివాసీ యువతి

3
3/3

సంప్రదాయ కొమ్ము నృత్యం చేస్తున్న ఆదివాసీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement