సాక్షి, కొత్తగూడెం: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 228 మంది అభ్యర్థులు 246 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలు చేసిన వారిలో మహిళలు, ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉంది. దాఖలైన మొత్తం నామినేషన్లలో 136 మంది మహిళలు, ఇండిపెండెంట్లు 49 మంది అభ్యర్థులు ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి చైర్‌పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో వివిధ పార్టీల నాయకులు ఎక్కువ సంఖ్యలో వారి సతీమణులతో నామినేషన్లు దాఖలు చేయించారు.
కొన్ని వార్డుల్లో దంపతులు ఇరువురు నామినేషన్లు దాఖలు చేసి బరిలో ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 24వ వార్డు నుంచి బాలిశెట్టి సత్యభామ నామినేషన్ వేయగా, ఆమె భర్త బాలిశెట్టి సుందర్‌రావు 35వ వార్డులో నామినేషన్ వేశారు. 16 వార్డు నుంచి మాచర్ల రాజకుమారి, 19వ వార్డు నుంచి మాచర్ల శ్రీనివాస్ (వీరిద్దరు దంపతులు) నామినేషన్లు దాఖలు చేశారు. వారితో పాటుగా 15వ వార్డు నుంచి సోదరులు పల్లపు రాజు, పల్లపు లక్ష్మణ్ నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
బుజ్జగింపులు మొదలు..
నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. స్క్రూటినీ మొదలైన క్రమంలో వార్డుల్లో బలంగా ఉన్న అభ్యర్థులు, బలహీనంగా ఉన్న వారిని ఎంచుకొని పోటీలో నుంచి తప్పించేందుకు బేరసారాలు మొదలు పెట్టినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. పోటీదారుల సంఖ్య తక్కువగా ఉన్న వార్డులను ఏకగ్రీవం చేసేందుకు సైతం మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం.
స్క్రూటిని, నామినేషన్ల ఉపసంహరణ తరువాత లిస్ట్ ఫైనల్‌కు చేరుకున్నాక అందరూ ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశముంది. ఇప్పటి నుంచే బలంగా ఉన్న అభ్యర్థులు, వారి వార్డుల్లో పోటీగా నామినేషన్ వేసిన వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులతో మంతనాలు సరిగ్గా జరిగితే నామినేషన్ల ఉపసంహరణలోపు చాలామంది విత్ డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో 190 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ప్రస్తుతం 246 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment