Keslapur Nagoba Temple
-
నాగోబా వైభవం: ఆడపడుచులు... కొత్తకోడళ్లు
నాగోబా అంటే మహిళామణుల మహా జాతర దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర ‘నాగోబా’ మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జాతర మొదలైంది. ‘ఈరోజు కోసమే’ అన్నట్లుగా సంవత్సరమంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు, కెస్లాపూర్ పరిసరాలు పండగ కళతో వెలిగిపోతున్నాయి. ఈ జాతరలో మహిళలది ప్రేక్షక పాత్ర కాదు. అడుగడుగునా ప్రధాన పాత్ర...నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల్లోని ఆదివాసీ మెస్రం వంశీయులకు సర్ప దేవుడు ఆరాధ్య దైవం. భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో ఆ దేవుడికి మహాపూజలు అందించడం ద్వారా ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాపూజకు ముందు, వెనకాల జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రతువులో వీరిద్దరి భాగస్వామ్యం మనకు కనిపిస్తుంది.ఆడపడుచులకు ప్రాధాన్యతమెస్రం వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మహాపూజకు ముందు కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందు ఉంటారు. ముందుగా పురుషులు అందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. మహిళలు బిందెల్లో నీళ్లు, గుళ్లల్లో ఆవుపేడను తీసుకొస్తారు. ఆలయ ప్రవేశం తర్వాత అందరు కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు. ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు, తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు. అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగిస్తారు. ఆపై ఆడపడుచులు పుట్టమట్టి, ఆవుపేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు.కొత్త కోడళ్లు వస్తారునాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ఈ కత్రువులో ఆవిష్కృతం అవుతుంది. ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.ఎప్పుడు వచ్చినా కొత్తగానే..‘కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తాం. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. కొత్త కోడళ్లు దేవుడి దర్శనం ద్వారా మా సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటారనేదే ఈ కార్యంప్రాధాన్యత’ అంటున్నాడు ఉట్నూర్‌కు చెందిన మెస్రం మనోహర్.‘నాగోబా జాతరకు ఎన్నోసార్లు వచ్చాను. విశేషం ఏమిటంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విశేషం తెలుసుకుంటూనే ఉంటాను. నాగోబా జాతర అంటే మహిళలకుప్రాధాన్యత ఇచ్చే మహా జాతర’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన గిరిజ.‘నాగోబా’ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. తరగని మౌఖిక కథలు ఉన్నాయి. అన్నింట్లో మహిళ మహారాణిగా, మíßమాన్వితంగా వెలిగిపోతూనే ఉంటుంది. అదే ఈ మహ జాతర ప్రత్యేకత. పవిత్రత. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి. -
ఆదిలాదాబాద్ : వైభవంగా నాగోబా జాతర..గంటల తరబడి క్యూలో భక్తులు (ఫొటోలు)
-
కేస్లాపూర్ నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ నేడు(ఆదివారం) రానున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కేశ్లాపూర్ చేరుకోనున్నారు. గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు. కాగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల రాకతో జిల్లా నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో అర్జున్ ముండా, బండి పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తరువాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మొదలైన నాగోబా జాతర ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. చదవండి: ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్ -
కొత్త కోడళ్ల బేటింగ్
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా సోమవారం అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబాకు అభిషేకం చేశారు. మహా పూజ నిర్వహించారు. అనంతరం బస చేసిన గోవడ్ నుంచి సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకుని రాత్రి 1 గంట నుంచి మంగళవారం వేకువజాము 4 గంటల వరకు మెస్రం వంశంలోని 72 మంది కొత్త కోడళ్లకు బేటింగ్ (పరిచయ) కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు కొత్త కోడళ్లు నాగోబా ఆలయం పక్కనే ఉన్న సతీ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. బేటింగ్ అనంతరం కొత్త కోడళ్లు మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. జాతర ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల్లో మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి కళ్లకుకట్టేలా నాగోబా ఆలయం రూపు దిద్దుకుంటోంది. నాగదేవత పడగ ఆకారంలో గర్భగుడి ద్వారం, ఆలయ మండపంలో మెస్రం చరిత్రను తెలిపేలా రూపొందిన శిల్పాలు దర్శనమిస్తాయి. ఒకప్పటి గోండ్వాన రాజ్యం చిహ్నాలు కూడా కనిపించేలా నిర్మాణం చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆలయ రాతికట్టడం పునర్నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. రానున్న పుష్యమాసంలో నాగోబా జాతర నిర్వహిస్తారు. ఈసారి కరోనా నేపథ్యంలో జాతరను సంప్రదాయ పూజలకే పరిమితం చేయనున్నారు. చదవండి: ఇళ్ల నిర్మాణాలకు పక్కా ప్రణాళిక నాగోబా ఆలయ ఆవరణలో కొనసాగుతున్న మండప నిర్మాణం, భావితరాలకు చరిత్ర తెలిసేలా: మెస్రం వంశీయుల ఇంటి దేవుడు నాగోబా. పూర్వం ఈ ప్రాంతం గోండ్వాన రాజ్యంలో ఉండేది. అప్పుడు ఒక గుడిసె కింద నాగోబా పూజలు అందుకున్నట్లు మెస్రం వంశీయులు చెబుతుంటారు. 2005లో రూ. 10 లక్షలతో నాగోబా ఆలయాన్ని విస్తరించారు. నాగోబా చరి త్రను భావితరాలకందించేలా ఆలయ నిర్మాణం ఉండాలని యోచించిన మెస్రం వంశీయులు 2017 జూన్‌లో రూ.3 కోట్లతో పనులు ప్రారంభిం చారు. ప్రస్తుతం రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. పైకప్పు పనులు జరగాల్సి ఉంది. గర్భగుడులకు మెస్రం వంశీయులే విరాళాలు ఇస్తుండగా, మండప నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్ష లు అందించనుంది. ఏపీ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి తలారి రమేశ్.. ఈ శిల్పాలు చెక్కుతున్నారు. ఫిబ్రవరిలో గోదావరి నుంచి గంగాజలాన్ని కేస్లాపూర్‌కు తీసుకురావడంతో పూజలు ప్రారంభమవుతాయి. -
38 మంది కొత్త కోడళ్లకు భేటింగ్
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి నాగోబాకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి ఘనంగా పూజలు చేశారు. మెస్రం వంశంలోని 38 మంది కొత్త కోడళ్లను భేటింగ్ చేయించారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టిన చొంగ్తూ నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, జాతర నిర్వహణ, అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలు సుకున్నారు. ఆదివాసీలు జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి వెలుగులు నింపిన హైమన్‌డార్ఫ్ శిష్యుడు మైకెల్ యోర్క్, మైకెల్ వాలరీ నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు వారికి అతిథి మర్యాదలు చేసి శాలువాలతో సన్మానించారు. మైకెల్ యోర్క్ దంపతులు గోడవ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులను గోండి భాషలో పలకరించి సందడి చేశారు. మైకెల్యోర్క్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది. -
నేడే నాగోబాకు మహాపూజ
ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఈ మహాపూజ నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సర్వం సిద్ధం చేశారు. మెస్రం వంశీయుల మహాపూజలతో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకు అధికారికంగా..15 వరకు అనధికారికంగా జాతర జరగనుంది. గోదావరి నది హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం తీసుకొని కాలినడకన మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ మర్రిచెట్టు (వడమర్ర)వద్దకు చేరుకున్నారు. అక్కడ వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశం లో మృతి చెందిన 91 మంది పేరిట ‘తుమ్’పూజలను ఆదివారం తెల్లవారు జామున నిర్వహించారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు సోమవా రం ఉదయం నాగోబా ఆలయానికి చేరుకొని పూజలు చేయనున్నారు. మహాపూజ అనంతరం అతిథులుగా వచ్చే జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. మహాపూజ చేసిన మెస్రం వంశీయులు సోమ వారం రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు భేటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని మె స్రం వంశం కోడళ్లను నాగోబా దర్శనం చేయించి వారి వంశం పెద్దలను పరిచయం చేసి ఆశీస్సులు అందజేస్తారు. ఈ భేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. ఈ కార్యక్రమాలతో కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమైనట్లు పెద్దలు ప్రకటిస్తారు. సామాజిక శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ శిష్యు డు మైకేల్ యోర్క్ జాతరకు రానున్నారు. -
ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో ఉన్న కొమురం భీమ్ విగ్రహం మంగళవారం ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కేస్లాపూర్ కొమురం భీమ్ కమిటీ, సర్పంచ్ మెస్రం నాగ్నాథ్ ఆధ్వర్యంలో 73వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, ఉట్నూర్ ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝాలకు కేస్లాపూర్ గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. భీమ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మాట్లాడుతూ, గిరిజన యువత ఐక్యంగా ఉండి కొమురం భీమ్ ఆశయ సాధనకు కృషి చేయూలన్నారు. కాగా, గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అవి వస్తే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. ఈ సందదర్భంగా గిరిజన నాయకులు సిడాం భీమ్రావ్, కనక తుకారం, కనక లక్కేరావ్ గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పోలీసు శాఖలో ప్రభుత్వం విడుదల చేస్తున్న ఐఏపీ నిధులతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయూలని ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అలాగే గిరిజన యువకులు శాంతిభద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. రాయిసెంటర్ జిల్లా మెడి మెస్రం దుర్గు, మాజీ ఎంపీపీ కనక తుకారం, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యాదర్శి కనక లక్కేరావ్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, జాతీయ మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావ్, పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రాథోడ్, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, కేస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్, ఐటీడీఏ మాజీ చైర్మన్ సిడాం భీమ్రావ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మీర్జా యూకూబ్‌బేగ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు మధు, మాజీ ఎంపీటీసీ కినక జంగు, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రావ్, అర్క ఖమ్ము పాల్గొన్నారు. గిరిరాజులుగా బతకాలి ఆదివాసీ గిరిజనులుగా కాకుండా గిరి రాజులుగా సమాజంలో గర్వంగా బతకాలని ఏఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా అన్నారు. కేస్లాపూర్లో భీమ్ వర్ధంతి కార్యక్రమానికి ముందుగా గిరిజనులు, గిరిజన నాయకులతో సమావేశమయ్యారు. గిరిజనుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.