నేడు గిరిజన దర్బార్‌ | Tribal Darbar in Keslapur Adilabad district | Sakshi
Sakshi News home page

నేడు గిరిజన దర్బార్‌

Jan 31 2025 1:37 AM | Updated on Jan 31 2025 1:37 AM

Tribal Darbar in Keslapur Adilabad district

ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో ఏర్పాట్లు పూర్తి 

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు దూరం

సాక్షి, ఆదిలాబాద్‌: నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం గిరిజన దర్బార్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనడం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్బార్‌కు వస్తారని అనుకున్నప్పటికీ కోడ్‌ నేపథ్యంలో వారు పాల్గొనే అవకాశాలు లేవని చెపుతున్నారు. 

నాగోబా పూజల్లో మాత్రం మంత్రి సీతక్క పాల్గొంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాగోబా జాతరలో.. గిరిజన దర్బార్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. 1940 కాలంలో గిరిజన పోరాట యోధుడు కొమురంభీం వీర మరణం తర్వాత అప్పటి నైజాం సర్కార్‌.. గిరిజనుల్లో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణం ఏమిటనే విషయంపై పరిశోధన కోసం మానవ పరిణామ శాస్త్రవేత్త, లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించారు. 

ఆయన అప్పట్లో తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో ఇక్కడికి వచ్చి జైనూర్‌ మండలం మార్లవాయిలో స్థిరపడ్డారు. ఆయన ఆదివాసీల జీవితాలపై పరిశోధించడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారంకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గిరిజనుల కోసం విద్య, ఇతర పథకాలను అమలు చేసేలా కృషి చేశారు. ఇదిలా ఉంటే గిరిజనులు అత్యధిక సంఖ్యలో కేస్లాపూర్‌లో కలుస్తారని, అక్కడ గిరిజన దర్బార్‌ ఏర్పాటు చేయాలని 1942 ప్రాంతంలో హైమన్‌డార్ఫ్‌ ప్రభుత్వానికి సూచించారు. 

ఈ దర్బార్‌లో గిరిజనులు అధికారుల వద్ద తమ సమస్యలను చెప్పుకొనేవారు. అధికారుల ద్వారా వారి వినతులు నైజాం సర్కార్‌ వరకు చేరేవి. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని కొనసాగిస్తూ వచ్చాయి. నాగోబా జాతరను అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఏటా గిరిజన దర్బార్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఈ దర్బార్‌లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటారు. ఏటా జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున గిరిజనులు తరలి వస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement