హైదరాబాద్, సాక్షి: ఇద్దరూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన మహిళా నేతలు. పైగా మంత్రులు. కానీ, ఒకరంటే ఒకరికి పడడం లేదు. కనిపిస్తే కనీసం పలకరించుకోవడం లేదు సరికదా.. కలిసి పని చేయడం లేదు కూడా. మేడారం జాతర, లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య విబేధాలు పబ్లిక్‌గా బయటపడ్డాయి.. అంటూ తాజాగా ఓ కథనం వెలువడింది. అయితే దీనిపై ఈ మంత్రులిద్దరూ స్పందించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందట. రాజకీయాలు, పాలనా విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయట. పైచేయి సాధించేందుకు ఇద్దరూ పోటాపోటీ వ్యూహాలను అమలు చేస్తున్నారట. గతంలో మేడారం జాతర సమయంలో వీరి మధ్య మొదలైన పంచాయితీ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జి మార్పు విషయంలో తీవ్రస్థాయికి చేరిందట.. అంటూ ఓ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. అయితే దీనిపై ఇద్దరూ మండిపడ్డారు.
తమ మధ్య విబేధాలు అనే వార్తలను సంయుక్తంగా ఈ ఇద్దరు మంత్రులు ఖండించారు. పరస్పర అవగాహనతో కలిసి మేం ముందుకు సాగుతున్నామని, మహిళా మంత్రుల మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని స్పందించారు. పైగా ఆ కథనాలు మహిళా గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతికి, రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలి అని మంత్రులిద్దరూ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment