నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. కొండా సురేఖ కంటతడి
హైదరాబాద్, సాక్షి: మెదక్ పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ దండ వ్యవహారంపై నడుస్తున్న ట్రోలింగ్‌పై ఎంపీ రఘునందన్‌రావు తనకు క్షమాపణలు చెప్పారని కొండా రేఖ అన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తోంది బీఆర్‌ఎస్సేనని ఆమె మండిపడ్డారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు.
‘‘ఇంచార్జీ మినిస్టర్‌గా మెదక్ పర్యటనకు వెళ్లా. అక్కడి ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు నాకు చెప్పి.. గౌరవంగా చేనేత మాల నా మెడలో వేశారు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశాను. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది. కానీ, కొంతమంది పోగై నన్ను ట్రోల్ చేస్తున్నారు.
అయినా కూడా చెప్పుకోలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారు. నాకు మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళని కొట్టారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారామె.
రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్‌లో భారీ మార్పులు వచ్చాయి. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు.
‘‘ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్‌కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి. అమెరికా సంస్కృతి తెచ్చి బతుకమ్మకు అంటించింది మీ చెల్లి. బతుకమ్మ సహజత్వాన్ని చెదగొట్టిందే మీ చెల్లి’’ అంటూ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు..
ఈ విషయం తెలిసి.. రఘునందన్ ఫోన్ చేశారు. అక్కా.. క్షమించు కాళ్లు మొక్కుతా అన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా నన్ను అక్కా అని.. నా భర్తను బావా అని పిలుస్తారు.అలాంటిది మానసిక వేదనతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు. ఏదో ఒకరోజు ప్రజలూ తిరగబడుతారు అని కొండా సురేఖ హెచ్చరించారు.
ఇక.. సహచర మంత్రి కొండా సురేఖకు మరో మంత్రి సీతక్క బాసటగా నిలిచారు. కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ శ్రేణుల్ని ఆమె హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అని వ్యాఖ్యానించిన దుర్మార్గులున్న పార్టీ బీఆర్ఎస్. నా సోదరమైన మంత్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.
‘‘మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది. సీఎం కుటుంబాన్ని కూడా వదలడం లేదు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రీయా శీలకంగా పనిచేసే వాళ్లను లక్క్ష్యంగా చేసుకుని బురద జల్లుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలోనూ మహిళలు ఉన్నారు. వాళ్లేం చేశారో.. దేశం మొత్తానికి తెలుసు. అయినా సభ్యత కాదనే మేం నోళ్లు విప్పడం లేదు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.
ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలా?. ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటికి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. ఆడ కూతుర్లను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు వెనక్కు నెడుతున్నారు. మల్లి దోరల రాజ్యం తెవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న మేయర్ విజయ లక్ష్మీ, నిన్న నాపై,నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్. మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా?. బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకుని బుద్ది తెచ్చుకోండి.తక్షణమే క్షమాపణలు చెప్పి.. తమ సోషల్ మీడియా విభాగాలను కట్టడి చేయాలి అని సీతక్క హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment