Aadilabad
-
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుడిహత్నుర్ మండలం మేకలగండి సమీపంలో మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40),అలీ (8),ఉస్మానొద్దీన్ (10),ఉస్మాన్ (12)పోలీసులు గుర్తించారు. మృతులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన వారని తెలుస్తోంది. భైంసాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
మహనీయుల కలలను నిజంచేస్తా
సాక్షి, ఆదిలాబాద్: లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని, వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఉట్నూర్ మండలం దంతన్‌పల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్గమధ్యలో ముత్నూర్ వద్ద కుమ్రంభీం విగ్రహానికి, ఇంద్రవెల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘అందరూ అనుకున్నట్టుగా నేను ఫలానా పార్టీలో అభ్యర్థి అనేది ఫేక్ న్యూస్.. ప్రజలు నమ్మొద్దు’అని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాన్యవార్ కాన్షీరాం, కుమ్రంభీం, పూలే వంటి మహనీయుల ఆశయాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, వారి కలలను నిజం చేసేందుకే తాను ముందుకొచ్చానని తెలిపారు. వీఆర్ఎస్ ఒకరు చెబితే చేసింది కాదని, మనస్సాక్షిగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 26 ఏళ్ల వృత్తిలో గిరిజన, దళిత, బహుజన బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేశానని, అది కేవలం ఒక శాతమేనన్నారు. మిగిలిన 99 శాతం కూడా సాధించేందుకే తన ఈ ప్రయత్నమన్నారు. పేద బిడ్డల అభ్యున్నతే నిజమైన సామాజిక విప్లవమని, ఇదే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధిని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఎజెండాగా ముందుకుసాగుతామని వెల్లడించారు. ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖా స్తు చేసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. 26 ఏళ్లుగా పోలీస్ శాఖలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన, తొమ్మిదేళ్లుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా ఉంటూ, ఆ విద్యాసంస్థలకు గుర్తింపు తెచ్చిన సంగతి విదితమే. ఆయన స్థానంలో ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్రాస్కు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పొచ్చర జలపాతం వద్ద యువకుడి గల్లంతు
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం వద్ద జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన గోనె హరీశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరంజి గ్రామానికి చెందిన గోనె హరీశ్, నరేశ్, మహారాష్ట్రలోని పిప్పల్‌కోఠికి చెందిన రమేశ్, భీంసరి గ్రామానికి చెందిన ఆడెపు వెంకట్ ఆదివారం మధ్యా హ్నం పొచ్చర జలపాతానికి వచ్చారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో జలపాతానికి వరద నీరు పోటెత్తింది. వీరు తిరిగి వెళ్తున్న దారిలోఉన్న వంతె నపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన దాటే ప్రయత్నంలో రమేశ్ జారి పడడంతో హరీశ్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వర ద ఉ«ధృతికి హరీశ్ కొట్టుకుపోయాడు. రమేశ్ వంతెనను పట్టుకుని బయటపడ్డాడు. హరీశ్(25)కు 6 నెలల క్రితమే వివాహం అయింది. ఆయన తండ్రి విఠల్ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. గాలింపు కొనసాగిస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఓడీఎఫ్ సాధ్యమేనా.?
సాక్షి, ఆదిలాబాద్ : పల్లెల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దానిని ఆచరణలో సాధ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించిన ప్రభుత్వాలు మూడేళ్లలో జిల్లాలో 73శాతం మార్పు తీసుకొచ్చాయి. మిగతా 27 శాతం ప్రగతి సాధన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రాన్ని ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రం)గా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఓడీఎఫ్‌గా ప్రకటించబడుతాయి. దీంతో జిల్లాలోని 13పాత మండలాల పరిధిలోని 589 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. అంటే మన జిల్లాలోని గ్రామాలన్నీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలని దానర్థం. జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చేందుకు ఇంకా పక్షం రోజులే మిగిలింది. ఇందుకు అధికారులు గత నెల రోజులుగా తీరిక లేకుండా శ్రమిస్తూ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలతో మమేకమవుతున్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నా.. ఎందుకు పూర్తి కావడం లేదనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు. జిల్లాలో నిర్మాణాలు ఇలా.. 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాసాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్హెచ్ఎల్) ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 ఇళ్లకు లేవని అధికారులు తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. అదే ఏడాదిలో మరుగుదొడ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో మరో 10,292 మంది నిర్మించుకున్నారు. మిగతా 59,374 మంది నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. అయితే సొంత డబ్బులతో మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడం, కార్యాలయాలకు తిరిగి తిరిగి వేసారిపోవడం లాంటివి జరిగాయి. అంత పూర్తి అయినా.. ఆన్లైన్లో ఫొటోలను అప్లోడ్ చేయకపోవడంతో బిల్లులు ఆగిపోయిన సంఘటనలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న ప్రజలు మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ముందుకు రాలేదని అధికారులు అప్పట్లోనే గుర్తించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతో గత మూడేళ్ల క్రితం జిల్లాలో స్వచ్చభారత్ కింద 59,374 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటి వరకు 29,905 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 25,808 మరుగుదొడ్లు వివిధ స్థాయిలో నిర్మాణాల్లో ఉండగా, 3661 నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. పక్షం రోజుల్లో ‘లక్ష్యం సాధ్యమేనా’.? జిల్లాలో ఏ ఒక్క ఇంటిలో మరుగుదొడ్డి లేదని చెప్పేందుకు వీలులేకుండా అధికారులు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఇది వరకే పలుసార్లు ఆయా మండలాలను ఎంపీడీవోలను ఆదేశించారు. గతేడాది గ్రామాలను ఓడీఎఫ్‌గా చేసిన ఎంపీడీవోలకు, సర్పంచ్‌లకు, అధికారులకు గాందీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేసినా మార్పు కన్పించలేదు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 28 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇందుకు పక్షం రోజులే గడువుంది. ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయని అధికారులు పేర్కొనగా ప్రస్తుతం నిర్మించుకున్న వాటికి బిల్లులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. (ఓడీఎఫ్) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి రూ.16.20 కోట్లు విడుదల కావడంతో అప్పట్లో నిర్మాణాల్లో జాప్యం జరిగింది. కానీ ప్రస్తుతం సరిపడా నిధులు అందుబాటులో ఉన్న ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో నిర్మాణాలను వేగవంతం చేసేలా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, యువత, మిగతా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓడీఎఫ్‌గా ప్రకటిస్తే.. జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించిన తర్వాత గ్రామాల్లో మల విసర్జనకు ఆరు బయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. పరిశీలన చేసేందుకు గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’ని నియమించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు కేంద్రం అందజేయనుంది. దీంతో పాటు మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగేలా ప్రజలను చైతన్యపరిస్తే స్వచ్ఛగ్రహీలకు ప్రభుత్వం నగదు పురస్కారం ఇవ్వనుంది. గోబర్‌గ్యాస్ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 ప్రొత్సాహంగా అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్‌సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్ రోజును అమలు చేయడం, అంకితభావంతో పని చేసే స్వచ్ఛగ్రహీలకు సత్కరాలు, అవార్డులు ఇవ్వనుంది. స్వచ్ఛగ్రహీ ఉద్యోగం శాశ్వతం కాకపోయిన ఇంటిలో మరుగుదొడ్డి ఉన్న యువతను మాత్రమే ఎంపిక చేసుకునేలా రాష్ట్రాలను ఆదేశించింది. -
ఆటోలపై పోలీస్ పంజా..
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్) : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో అక్రమ దందాలకు, అసాంఘిక కార్యకలపాలకు చరమగీతం పాడేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను నేర రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు అక్రమార్కులపై రామగుండం కొత్వాల్ కొరడ ఝలిపిస్తున్నారు. ఇదే క్రమంలో కమిషనర్ సత్యనారాయణ ఆటో డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆటోలపై ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో సుమారు 10 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కొందరు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆటోలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. మరి కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి ప్రయాణికులను టార్గెట్ చేసి దాడికి పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. దీంతో పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెండు జిల్లాల పోలీస్ అధికారులకు గురువారం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆటోల్లో అదనపు సీట్ల తొలగింపు ఆటోడ్రైవర్ సీటు పక్కన అదనపు సీట్లు ఏర్పాటు చేసి పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదనపు సీటు కలిగి ఉండి పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండగా పట్టుబడిన ఆటోలకు మొదటి సారి రూ. 1000 జరిమానా విధించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. మరో సారి అదే తప్పు చేసి పట్టుబడితే రూ. 2 వేలు జరిమానాతో పాటు ఆటో సీజ్ చేసి 10 రోజులు పోలీస్‌స్టేషన్‌లో ఉంచుతారు. మూడో సారి అలానే జరిగితే క్రిమినల్ కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తారు. ఓనర్లు లైసెన్స్ లేని డ్రైవర్లకు ఆటోలు నడపడానికి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నుంచి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారిపై, ఆటో యజమానులపై కేసులు నమోదు చేయనున్నారు. ఆరుగురిని మించి తరలించరాదు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలో ఆరుగురు కంటే ఎక్కువ విద్యార్థులను తరలించరాదు. కానీ చాలా ఆటోల్లో 10కి మించి స్కూల్ పిల్లలను తరలిస్తున్నారు. దీని వల్ల ప్ర మాదం జరిగే అవకాశాలు ఎ క్కువ. అంతే కాకుండా పొరపాటున ఏదైన ప్రమాదం జరిగినా తీవ్ర నష్టం సంభవిస్తుంది. ఇక నుంచి ఆరుగురి కంటే ఎక్కువ స్కూల్ విద్యార్థులను ఆటోలో తరలిస్తే డ్రైవర్లతో పాటు పాఠశాల యాజమాన్యాలపై సైతం కేసులు నమోదు చేస్తారు. అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ప్రయాణికుల పట్ల ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆటొలో ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేసి మా యలో పడేసి దాడులకు పాల్పడుతున్నారు. ప్ర యాణికుల వద్ద అధిక కిరాయి వసూలు చేసిన వారిపై సైతం చర్యలు తీసుకోనున్నారు. పట్ట ణాల్లో బ్లూ కోట్ పోలీసులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. కొందరు పోలీసులు ఎవరికి తెలియకుండా మఫ్టిలో ఉంటూ నిఘా పెట్టనున్నారు. రహదారులపై ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఆటోలు నడిపినా, పార్కింగ్ చేసినా, మూల మలుపుల వద్ద ఆటోలు నిలిపినా కఠిన చర్యలు తప్పవు. కాలం చెల్లిన ఆటోలపై నజర్ కమిషనరేట్ పరి«ధిలో కాలం చెల్లిన ఆటోలపై పోలీసులు దృష్టి సారించారు. ఫిట్నెస్ లేని ఆటోలను సీజ్ చేయడం జరుగుతోంది. కాలం ముగిసిన వాహనాలు నడుపడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతోంది. కాలం చెల్లిన వాహనాలు రోడ్డుపై కనిపిస్తే డ్రైవర్లు, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. -
మా వారిని రక్షించండి
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్) : అకారణంగా జైళ్లో వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న ఇరాక్ ప్రభుత్వం బారినుంచి తమ వారిని రక్షించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన బాధిత కుటుంబసభ్యులు ఢిల్లీబాట పట్టారు. తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంతరెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో విదేశాంగశాఖ మంత్రిని కలిసేందుకు వెళ్లారు. ముందుగా సీఏఆర్ఏ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ మంద రాంచంద్రరెడ్డిని కలిశారు ఎందుకు పట్టుకెళ్లారో తెలియని పరిస్థితి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల ఎల్లయ్య, లచ్చవ్వ దంపతుల కొడుకు కుంటాల లచ్చన్న. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన షేర్ల లక్ష్మి, లచ్చన్న దంపతుల కుమారుడు రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, అందరిలో ఉన్నతంగా బతుకాలనే ఉద్దేశంతో లచ్చన్న, రాజు 2015 ఆగస్టు 22న ఇరాక్ దేశం వెళ్లారు. వీసా కోసం నిజామాబాద్ జిల్లాకు చెం దిన ఏజెంట్‌కు రూ.1.50 లక్షలు చెల్లించారు. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్ మోసం చేశాడని తెలుసుకున్నారు. విజిట్ వీసాతో తమను పంపాడని తెలుసుకున్నారు. అకామా లేకుండా ఇరాక్‌లో ఉం డటం చాలా ఇబ్బంది. ఇది తెలిసి.. తెలిసిన వారి వద్ద ఉంటూ దొంగచాటున పనులు చేస్తూ జీవిం చారు. ఏడాది పాటు పనిచేసిన డబ్బులతో అకా మా చేయించుకున్నారు. అకామా వచ్చాక ఎర్బిల్లోని బాల పాఠశాలలో పనికి కుదిరారు. ఈ క్రమంలో ఏప్రిల్ 16న పోలీసులు వచ్చి ఎలాంటి కారణం చూపకుండా వీరిద్దరినీ పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారో..? ఎన్ని రోజులుంచుకుంటారో..? తెలియని పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల నుంచి మాట్లాడలే ఏప్రిల్ 16న పోలీసులు పట్టుకెళ్లక ముందు (మూడునెలల క్రితం) ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫోన్లు బంద్ అయ్యాయి. తాజాగా ఈ నెల 12న ఫోన్ చేసి.. తమను ఎందుకు జైళ్లో వేశారో తెలియదని.. తాము ఏ తప్పూ చేయలేదని.. చాలా టార్చర్ చేస్తున్నారని ఏడుస్తూ తెలిపారని శేర్ల రాజు కుటుంబ సభ్యులు అంటున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలలో జరిగిన సంఘటనపై వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారని, ఆ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సంఘటన ఏం జరిగిందో..? వీరిపాత్ర ఎంతవరకు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిమంది కూడా ఢిల్లీకి వెళ్లినట్లు వారు పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిని కలిసి విన్నవిస్తాం ఇరాక్‌లో ఇరుక్కుపోయిన వారిని విడిపించేలా విదేశాంగ శాఖ మంత్రిని కలిసి విన్నవిస్తాం. వీరితోపాటు వివిధ జిల్లాలకు చెందిన పలువురి ఇదే పరిస్థితితో బాధపడుతున్నారు. వారందరిని తీసుకుని ఢిల్లీకి వెళ్లాం. ఇప్పటికే ఇరాక్ ఎంబసీ డైరెక్టర్ జనరల్ మణిపాల్‌సింగ్‌తో ఫోన్లో మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే తప్ప వారు విడుదలయ్యే అవకాశం లేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. – పాట్కూరి బసంతరెడ్డి, గల్ఫ్‌వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు -
సాగు లెక్క..ఇక పక్కా
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్) : ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీల ఏర్పాటుకు వీలుగా ఫిబ్రవరిలో ప్రారంభించిన రైతు సమగ్ర సర్వే ఇటీవల పూర్తయింది. వ్యవసాయాధికారులు జిల్లాలో ప్రతి రైతు కుటుంబం వివరాలు, వారు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. అధికారులు సర్వే ఫారాల్లో ముందుగానే ప్రింట్ చేసిన 13 అంశాలు కాకుండా మరో 14అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. రైతుకు మేలు చేసేందుకు పంటకాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా రైతుల వివరాలు సేకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం కాలనీల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇదీ సాగు లెక్కా.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో మొత్తం 5.10లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నట్లు తేలింది. 1.21లక్షల మంది రైతులు ఉండగా, ప్రధానంగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తి తరువాత సోయా, అంతర పంటగా కంది పంటలు తరువాత స్థానంలో నిలిచాయి. మొత్తం 18మండలాల్లోని 102 క్లస్టర్ల పరిధిలోని 508 గ్రామాల్లో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 105మంది సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 90వేల రైతు కుటుంబాలను జూన్ వరకు సర్వే చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా జైనథ్ మండలంలో 14113మంది రైతులు ఉండగా, మావల మండలంలో అత్యల్పంగా కేవలం 775మంది రైతులు మాత్రమే ఉన్నారు. పంట కాలనీల ఏర్పాటుకు... ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండటంతో రైతుల పక్కా సమాచారం అవసరమైంది. అయితే వ్యవసాయ శాఖ వారు ప్రతీ ఏటా రైతులు వేసిన పంటల వివరాలను సేకరిస్తారు. ఈ వివరాల్లో చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉండటంతో మరోసారి రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. గతంలో రైతుల సాగు వివరాలు తెలుసుకోవడం ఒక రకంగా చాలా కష్టంగా ఉండిందనే చెప్పవచ్చు. రైతులు బ్యాంకులో ఒక పంట పేరిట రుణం తీసుకుంటే.. బీమా కోసం మరో పంట నమోదు చేయించేవారు. దీంతో పాటు పంట రుణం కోసం ఇంకో పంట చూపించడం సాధారణంగా మారింది. దీంతో రైతులు అసలు ఏఏ పంటలు సాగు చేస్తున్నారు అని తెల్సుకోవడం కొంత ఇబ్బందిగానే మారింది. అయితే ఈ సమగ్ర సర్వేతో రైతుల పక్క వివరాలు తెలియడంతో పంట కాలనీల ఏర్పాటు దిశగా ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ సర్వే ద్వార ఒక ఒక నిర్ణీత ప్రదేశంలో ఎక్కువగా సాగయ్యే పంటలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించి, వాటి దిగుబడి పెంచేందుకు, విస్తృత మార్కెట్ కల్పించేందుకు అవకాశం కలుగనుంది. అలాగే ఫుడ్ ప్రాసెసిసింగ్, క్రాప్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకుర్చేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. కొనసాగుతున్న ఆన్లైన్.. సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలు ప్రత్యేకమైన పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ గ్రామాల్లో ఆఫ్‌లైన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. వారికి ఇచ్చిన ట్యాబ్‌లలో ఈ పూర్తి సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కసారి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి అయితే ఒక్క క్లిక్‌తో ఏ గ్రామంలోని వివరాలైన తెలుసుకునే వీలుటుంది. అన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తుండటంతో రైతుల సమస్త సమాచారం ఒకే చోటు లభించే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క రైతు వివరాలను ఆన్లైన్ చేసేందుకు కనీసం 20–30నిమిషాలు పడుతుండటంతో ఆన్లైన్ ప్రక్రియ కొంత నెమ్మదిగా కొనసాగుతోంది. గ్రామాల వారీగా నివేదికలు పంపించాం సమగ్ర సర్వేపై ప్రభుత్వానికి గ్రామాల వారీగా నివేదికలు పంపించాం. గ్రామాల వారీగా సాగు విస్తీర్ణం, పంటల వివరాలు ఆన్లైన్ చేశాం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్, రైతుబంధు పనుల్లో కొంత సిబ్బంది బిజీగా ఉండటంతో రైతుల వారీగా ఆన్లైన్ చేసే పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నా యి. ఏఈవోలు వారి వారి క్లస్టర్ సమాచా రాన్ని ఆన్లైన్ చేయాలని ఆదేశాలు జారీ చే సాం. త్వరలో పూర్తిస్థాయిలో ఆన్లైన్ చే స్తాం. – ఆశాకుమారి, డీఏవో,ఆదిలాబాద్ -
రూ.లక్షల్లో టోకరా..
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : దాదాపు ఏడెనిమిదేళ్లుగా స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తూ అందరి వద్ద సుమారు రూ. 20 లక్షలపైన అప్పులు చేసి ఓ వ్యాపారి ఉడాయించినట్లు భైంసాలో పుకార్లు వ్యాపించాయి. భైంసా పట్టణంలోని బోయిగల్లి ప్రాంతంలో మిఠాయిల దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి గత కొంత కాలంగా అప్పుల వాళ్లకు డబ్బులు చెల్లించకుండా తిప్పుకుంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా దుకాణానికి రావడం లేదని, రెండు రోజులుగా దుకాణం మూసి ఉండడంతో, దుకాణంలో పాలు పోసే వారు ఆదివారం దుకాణం వద్ద గుమిగూడారు. ఒక్కొక్కరికి రూ. లక్ష నుంచి రూ. 3లక్షల వరకు చెల్లించాల్సి ఉందని వారు వాపోయారు. అంతేకాకుండా సదరు వ్యాపారి తన చిన్న కుమారుడి సెల్‌ఫోన్‌కు అప్పుల బాధ తాళలేక చనిపోతున్నానంటూ మెసేజ్ పెట్టడంతో, అతని కుమారుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 1 న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. హోటల్లో గుమాస్తా నుంచి.. నేరడిగొండ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి కుటుంబం గత ఏడెమినిదేళ్ల క్రితం భైంసాకు వలస వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట్లో స్థానిక హోటల్లో స్వీట్లు చేసే పనికి కుదిరాడు. ఇక్కడి వారితో పరిచయాలు పెరగడంతో నాలుగేళ్ల క్రితం బోయిగల్లిలో సొంతంగా స్వీట్ దుకాణం ప్రారంభించాడు. కానిస్టేబుల్‌నూ వదల్లేదు.. దుకాణం నడిపే క్రమంలో తెలిసినవాళ్ల వద్ద అప్పులు చేయడం ప్రారంభించాడు. తన దుకాణంలో పనిచేసే మాస్టర్(వంటవాడు) వద్దే రూ. 3.5 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలుస్తోంది. తన యజమాని అడగడంతో వంటవాడు భార్య నగలు కుదువపెట్టి మరీ వ్యాపారికి అప్పు ఇచ్చినట్లుగా సమాచారం. దుకాణంలో పాత్రలు కడిగే మహిళ వద్ద రూ. 40 వేలు అప్పు తీసుకున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.ఇక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద, తెలిసిన వారి నుంచి దొరికిన చోటల్లా అప్పులు చేసినట్లు చెబుతున్నారు. భైంసా పట్టణానికి చెందిన ఓ కానిస్టేబుల్ వద్ద కూడా అప్పు చేసినట్లు స్థానికులు చెప్పారు. ఇక ఆయన దుకాణంలో పాలు పోసే వారు దాదాపు పదిమంది వరకు ఉన్నారు. వీరు ప్రతిరోజు 20 నుంచి 60 లీటర్ల వరకు పాలు పోసేవారని చెబుతున్నారు. పాలు పోస్తున్న తమకు మూడు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నాడని వారు పేర్కొన్నారు. వారం రోజులుగా దుకాణంలో సదరు వ్యక్తి కనిపించకపోవడం, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని వాపోయారు. అదృశ్యం కేసు నమోదు.. మిఠాయిల దుకాణం నిర్వహించే సదరు వ్యాపారి అప్పుల బాధ తాళలేక వెళ్లిపోతున్నానంటూ ఈ నెల 1 న తన కొడుకు సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడని అతని కొడుకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇటీవలే కూతురి పెళ్లి కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడని తెలిపాడు. ఇక తన కోసం వెతకవద్దని, దుకాణం నడిపి అప్పులు తీర్చాలంటూ వాయిస్ మెసెజ్ పెట్టినట్లు ఫిర్యాదులో కుమారుడు పేర్కొనడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. మూడునెలలుగా తిప్పుతున్నాడు నేను గత మూడేళ్లుగా స్థానిక బోయిగల్లిలో మిఠాయి దుకాణంలో పాలు పోస్తున్నాను. నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాడు. అయితే మూడు నెలలుగా మాత్రం డబ్బుల కోసం తిప్పుకున్నాడు. కూతురి పెళ్లి చేశానని, త్వరలో చెల్లిస్తానని చెప్పేవాడు. ప్రతిరోజు 30 లీ పాలు పోసేవాడిని. మూడునెలల బకాయిలు రావాల్సి ఉంది. – రాజు, పాల వ్యాపారి, భైంసా నమ్మకంతో పోసేవాళ్లం మేం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పోసేవాళ్లం. రోజుకు 30 లీటర్ల వరకు పాలు తీసుకునేవాడు. నమ్మకంగా డబ్బులు చెల్లించేవాడు. అయితే గత కొద్ది నెలలుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. రేపు, మాపు అంటూ తిప్పి పంపేవాడు. మా లాగే ఇంకా కొందరికి డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు. – రాజేందర్, ప్రసాద్, భైంసా -
టీఆర్ఎస్ కుట్రలకు రైతులు బలి
మంచిర్యాల(ఆదిలాబాద్) : టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలకు అమాయకపు ప్రజలను బలిచేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, పలు నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జిలతో కమిటీ వేశారు. గత నెల 30న కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాలలో జరిగిన సంఘటన వివరాలను తెలుసుకునేందుకు గురువారం ఈ కమిటీ సభ్యులు సార్సాలకు వెళ్తుండగా మం చిర్యాల సమీపంలో పోలీసులు అడ్డుకునే ప్రయ త్నం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వారిని పోలీసు వాహనాల్లో ఎక్కించుకుని మంచిర్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు గంటకు పైగా పోలీస్ స్టేషన్లోనే ఉంచి అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగులో ఉన్న పోడు భూములపై ఆ రైతులకే హ క్కు కల్పించాలని నాడు సోనియాగాంధీ నేతృ త్వంలో హక్కుపత్రాలు ఇప్పించామన్నారు. ఇటీ వల జరిగిన ఎన్నికల సమయంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామన్న హామిని కేసీఆర్ విస్మరించి, నేడు అవే పోడు భూములను లాక్కునే ప్రయత్నం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేక, తన తమ్ముడిచే ఇలాంటి దాడులను చేయించడం చాలా హీనమైన చర్యగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపునకు గురైన అటవీప్రాంతానికి ప్రత్యామ్నయంగా సార్సాలలోని భూములను తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. మూడెకరాల భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామిని విస్మరించి ఉన్నభూమిని లాక్కుంటుందని ఆరోపించారు. పోడు భూమిని లాక్కుని అక్కడి రైతులను నిర్వాసితులుగా మార్చేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం సార్సాల నుంచే ఆరంభం అవుతుందన్నారు. బాధ్యులను శిక్షించాలి సార్సాలలో దాడులకు పాల్పడిన వారిని కఠినం గా శిక్షించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, సిర్పూర్ ఇంచార్జి పాల్వాయ్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారిపై ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పే కేసీఆర్ ఎన్నికలు అయిపోగానే ఆ హామీలను బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి కాంగ్రెస్ ఇన్చార్జి అడ్లూరి లక్ష్మన్ కుమార్, రామగుండం ఇన్చార్జి మక్కాన్ సింగ్, చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యం, భూపాల్‌పెల్లి ఇన్చార్జి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రాథమిక విచారణ చేయనివ్వరా? మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సార్సాలకు వెళ్లి పూర్తిస్థాయిలో విషయ సేకరణ చేయాలని వెళ్తుండగా ముందుగానే మంచిర్యాలలో తమను ముందస్తు అరెస్టు చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశ ప్రభుత్వంలో మనం ఉన్నమా? అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయమన్నారు.1950కి సంబంధించిన శాటిలైట్ మ్యాప్స్ ప్రకారం వాటిని అటవీశాఖకు సంబంధించిన భూములుగా పేర్కొంటూ ట్రెంచ్‌లను కొట్టడం ఎంతవరకు న్యాయమన్నారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని హరీశ్, సీతక్క ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోకుండా ఒక మహిళా అధికారిపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అదే పార్టీకి చెందిన వారు దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఓవైపు ప్రభుత్వం అటవీశాఖ, పోలీస్ శాఖ అధికారులను పంపించి పోడు భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను పంపించి గొడవలు సృష్టించి ఒక డ్రామా ఆడుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. అధికారులు, సీఎం, అక్కడి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించాలన్నారు. ఉన్న చట్టాలను సరిౖయెన విధానంలో అమలు చేసి, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేసి, 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలతో పాటు, పట్టాపాసు పుస్తకాలను ఇచ్చి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. – ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వాస్తవాలను ఎందుకు తెలుసుకోనివ్వడం లేదు.. గత నెల 30న సార్సాలలో జరిగిన ఘటనలోని వాస్తవాలను ప్రజల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే తమను ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. పోడు భూముల మీద ఈ సీఎంకు ఎలాంటి స్పష్టత, ఒక విధానం లేదని, ఓట్ల కోసం హామీలను ఇస్తూ పోడు భూములకు పట్టాలను ఇస్తామని గత ఎన్నికల్లో హామీలను గుప్పించారన్నారు. ఎప్పుడో ఉన్న చట్టాలను ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తుందన్నారు. జై జంగిల్ జమీన్ అంటూ ఉద్యమ సమ యంలో చెప్పిన కేసీఆర్ నేడు నిజాం పాలనను గుర్తు చేసేలా ఆయన విధానాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురైన అటవీ ప్రాంతానికి ప్రత్యామ్నయంగా రాష్ట్రంలో ఎక్కడా అటవీ భూములు లేవాఅని ప్రశ్నించారు. – ఎమ్మెల్యే సీతక్క -
ఇక అబద్ధాలు చెప్పలేరు
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్) : హాలో.... ఎక్కడున్నావ్... నేను అడవిలో ఉన్న సార్... అని ఇంట్లో ఉండి అబద్దం చెబుతాడు ఓ అధికారి. గత వేసవిలో ఓ హోటల్లో భోజనం చేస్తున్న ఓ బీట్ అధికారికి ఎఫ్‌డీవో ఫోన్ చేసి మీ ఏరియాలోని అడవిలో అగ్ని ప్రమాదం జరిగిందంట, అక్కడికి వెళ్లి చూసుకో అని సమాచారం ఇస్తాడు. లేదు సార్ నేను అడవిలోనే ఉన్నాను. మీకు వచ్చిన సమాచారం అబద్ధమని తప్పించుకున్నాడు. ఇకనుంచి అబద్ధం చెప్పడానికి వీలులేకుండా చేస్తోంది కొత్త సాఫ్ట్వేర్. ఇంట్లో కూర్చోని పనిచేశాను. అడవిలో తిరుగాను, అంత బాగానే ఉందని చెప్పి తప్పించుకునే అవకాశం లేదు. ఆ అబద్ధాలు చెప్పి తప్పించుకునే వారికి స్వస్తి పలుకుతుంది నూతనంగా రూపొందించిన ఎంస్ట్రైబ్ సాఫ్ట్వేర్. సత్ఫలితాలిస్తున్న సాఫ్ట్వేర్ వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వారు రూపొందించిన ఎంస్ట్రైబ్ సాఫ్ట్వేర్ సత్ఫలితాలిస్తోంది. గతంలో కొందరు కిందిస్థాయి అటవీశాఖ సిబ్బంది విధుల్లో లేకున్న తమ స్వంతపనులపై వెళ్లినా విధుల్లోనే ఉన్నామని అబద్ధాలు చెప్పుకుని విధులకు ఎగనామం పెట్టే వారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఈ ఎంస్ట్రైబ్ సాఫ్ట్వేర్ అధికారుల పని తీరును గమనించడమే కాకుండా వన్యప్రాణులు, అడవుల నరికివేత, పశువులు వివరాలు, నీటి వనరులు, వన్యప్రాణుల ఆనవాళ్లు తదితర అంశాలను సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తే అధికారులు తెలుసుకునే వీలుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను రెండు సంవత్సరాల క్రితం వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు దేశంలోని టైగర్‌జోన్ ప్రాంతాలలో ఈ సాఫ్ట్వేర్ ఇచ్చారు. కవ్వాల్ టైగర్జోన్లోనూ ఇచ్చిన ఆ సాఫ్ట్వేర్ వినియోగంలోకి రాలేదు. ఇటీవల అటవీశాఖ అధికారులకు ప్రభుత్వం అండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వడంతో సాఫ్ట్వేర్ ఆ ఫోన్లో వేసి అధికారుల పనితీరు పరిశీలించిన అంతగా ఫలితాలు కనిపించలేదు. నెలకు 26 రోజులు తప్పనిసరి కవ్వాల్ టైగర్‌జోన్‌లో పని చేసే బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు ఎంస్ట్రైబ్ సాఫ్ట్‌వేర్‌లో నెలకు 26 రోజులు పర్యటన వివరాలు పొందురుచాలి. ఒక్క రోజు పొందుపరుచకపోయిన వారు ఆ రోజు విధులకు ఎగనామం పెట్టినట్లే అర్థం. అంతే కాకుండా రోజు ఒకే వైపు వెళ్లిన, బైక్‌పై వెళ్లిన కూడా గుర్తించవచ్చు. వెంటనే వారికి మెమో ఇచ్చి జీతంలో కోత విధిస్తారు. ఒక్కో అధికారి రోజుకు 4 కిలో మీటర్ల దూరంలో పర్యటన చేసిన 55మంది రోజుకు 220 కి.మీ దూరం పర్యటన జరుగుతుందని. దీంతో టైగర్‌జోన్‌లో ప్రొటెక్షన్ జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బీట్ అధికారి, సెక్షన్ అధికారి తమ విధులు సక్రమంగా నిర్వహించడమే కాకుండా, వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు ఉంటుంది. ఉద్యోగులు సాఫ్ట్‌వేర్‌ను వాడేలా చేస్తున్నాం వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రడూన్ వారు రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌తో అనేక ఫలితాలున్నాయి. సిబ్బందిపై మానిటరింగ్ కాకుండా పలు విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సిబ్బంది తమ రేంజ్ కార్యాలయాల్లో రోజువారి డాటా డౌన్లోడ్ చేసి కంప్యూటర్లో పొందుపరుస్తారు. రేంజ్ అధికారులు డివిజన్‌కు ఇస్తారు. వాటిని డివిజన్ వారిగా సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేస్తాం. దీంతో ఇక్కడి విషయాలు టైగర్ కన్జర్వేషన్ సోసైటీ దృష్టికి వెళ్తోంది. ఈ విషయంలో సిబ్బందికి సాఫ్ట్‌వేర్‌కు అలవాటు పడి ప్రతి రోజు విధులు నిర్వహణ చేసేలా అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు సిబ్బంది ప్రతి అంశాన్ని సాఫ్ట్వేర్లోనె పొందుపరుస్తున్నారు. – మాధవరావు, ఎఫ్‌డీవో -
రూ.120 కోట్లు కావాలి !
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలోని సర్కారు బడుల్లో సమస్యలు వేధిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల కొరత, ప్రహరీలు లేకపోవడం, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏటా సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం, వసతుల కల్పనకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2019– 20 విద్యాసంవత్సరానికి అవసరం అయ్యే నిధుల కోసం అధికారులు ప్రణాళిక తయారు చేసి ఇటీవల ప్రభుత్వానికి పంపించారు. రూ.120 కోట్లతో ప్రతిపాదనలు జిల్లాలో 1,282 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. వీటిలో 94,737 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా విద్యాశాఖ అధికారులు విద్యాసంవత్సరంలో పాఠశాలల నిర్వహణ, వాటిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమయ్యే నిధుల కోసం కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి రూ.120.55 కోట్ల ప్రతిపాదనలు పంపిం చారు. ఏయే అవసరాలకు ఎన్ని లక్షల నిధులు అవసరమవుతాయనే వివరాలతో సమగ్ర నివేదికను తయారు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి నివేదిక పంపారు. ఈ నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆమోదిస్తే నిధులు విడుదల అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి నిధులు విడుదల చేస్తుంది. నిధులు మంజూరు కాగానే పాఠశాలల్లో మౌలిక వసతులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ అధికారులు చేపడుతారు. కాగా అధికారులు ప్రతిపాదనలు పంపిన వాటిలో పాఠశాలల బలో పేతం కోసం రూ.40 కోట్లు, విద్యార్థుల రవాణాభత్యం కోసం రూ.37లక్షలు, ఉచిత పాఠ్యపుస్తకాల కోసం రూ.2.36 కోట్లు, వసతిగృహల నిర్వహణ కోసం రూ.46 లక్షలు, గుణాత్మక విద్యకురూ.18 కోట్లు, స్కూల్ గ్రాంటు కోసం రూ.4 కోట్లు, డిజిటల్ తరగతులు, ఉపాధ్యాయుల శిక్షణ, మధ్యాహ్న భోజ న పథకం, ఉచిత యూనిఫాం, మౌలిక వసతులు కోసం ప్రణాళిక తయారు. అలాగే కేజీబీవీల కోసం రూ.37.44 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. వేధిస్తున్న సమస్యలు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో సమస్యలు వేధిస్తున్నాయి. పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో నిర్వాహకులు వర్షాకాలంలో వంట చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు ఉన్నా నీటిసౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కూడా లేదు. అదేవిధంగా ప్రహరీలు లేవు, కొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కింద చదువులు సాగుతున్నాయి. గతంలో ఆర్వీఎం పథకం ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అధిక మొత్తంలో విడుదలయ్యేవి. ఈ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, తదితర కార్యక్రమాలు నిర్వహించే వారు. అయితే ఆర్వీఎంను సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో విలీనం చేయడంతో తక్కువ మొత్తంలో నిధులు విడుదల అవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనల్లో దాదాపు 60 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో పాఠశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. కాగా ఈ విద్యాసంవత్సరం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,644 కోట్ల విడుదల చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జిల్లాకు రూ.70కోట్ల నిధుల వరకు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపాదనలు పంపించాం విద్యావార్షిక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. రూ.120కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. విడుదలైన నిధులతో పాఠశాలలో మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, యూనిఫాం, విద్యార్థులకు వసతులు కల్పిస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు విడుదలైన నిధులు ఖర్చు చేస్తాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
సాక్షి, నిర్మల్ (ఆదిలాబాద్) : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకున్నాయి. నిర్మల్ మండలానికి చెందిన లింగన్నను కారు ఢీకొనడంగా మృతి చెందగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారక ఉపసర్పంచ్ స్వామి హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మండలంలోని చిట్యాల్ బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముజ్గి గ్రామానికి చెందిన వంటల లింగన్న(45) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వంటల లింగన్న తన భార్య లక్ష్మితో కలిసి గ్రామం నుంచి నిర్మల్ వెళ్తున్నారు. చిట్యాల బ్రిడ్జి వద్దకు రాగానే వెనుకనుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో లింగన్న ఎగిరి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లక్ష్మీకి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉండే లింగన్న గత నెల క్రితం తన తల్లి చనిపోవడంతో సొంతూరికి వచ్చాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దండేపల్లి మండలంలోని ద్వారక మాజీ సర్పంచ్ గొర్రె స్వామి(42) హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్వామి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్టీసీలో బస్ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం ద్వారకకు తీసుకువచ్చి అంతక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపై పలువురుమండల నాయకులు విచారం వ్యక్తం చేశారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్‌అర్బన్: ‘బ్యూటీ పార్లర్స్’ ఏర్పాటు చేసుకోవడానికి అర్హత గల గిరిజన మహిళలు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహకారం కింద జిల్లాలో మొత్తం 10 బ్యూటీ పార్లర్స్ మంజూరైనట్లు తెలిపారు. 10వ తరగతి పాస్, లేదా ఫెయిల్, 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు, వార్షిక ఆదాయం ఏజెన్సీలో రూ.1.50లక్షలు మైదాన ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదన్నారు. బ్యూటీషియన్, ఆరోగ్య పరిరక్షణలో శిక్షితులైన అభ్యర్థులై ఉండాలని తెలిపారు. ఇందుకుగాను ఒక్కొక్క యూనిట్ అంచనా రూ.2 లక్షలు కాగా ఇందులో 70 శాతం సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మిగతా నిధులు జాతీయ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించన్నుట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ 31లోపు పూర్తి చేసి అర్హత గల గిరిజన మహిళలకు అర్థిక సహాయంతోపాటు, స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల గిరిజన మహిళలు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో పని వేళల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కాశ్మీర్ తరహా టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం!
హైదరాబాద్: గిరిజన హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమరం భీమ్ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 8 తేదిన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో జరిగే కొమరం భీమ్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర ఆటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రామన్న అన్నారు. జిల్లాను కాశ్మీర్ తరహా టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు. 200 ఎకరాల్లో కొమరం భీమ్ గౌరవార్థం ఓ పార్క్ ను ఏర్పాటు చేస్తామని జోగు రామన్న తెలిపారు. -
ఆదిలాబాద్ జిల్లా పేరును మార్చండి: సోనేరావు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పేరును గిరిజనల కోసం పోరాటం సాగించిన ఉద్యమ నేత కొమరం భీమ్ పేరుగా మార్చాలని ఆయన మనవడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్క్షప్తి చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో కేసీఆర్ ను కొమరం భీమ్ మనవడు సోనే రావు కలిసి విజ్క్షాపన పత్రాన్ని సమర్పించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి, గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రారంభించాలని కేసీఆర్ కు సోనేరావు సూచించారు.