ఓడీఎఫ్‌ సాధ్యమేనా.? | Adilabad district becomes a ODF District In Telangana | Sakshi
Sakshi News home page

ఓడీఎఫ్‌ సాధ్యమేనా.?

Published Mon, Jul 15 2019 11:52 AM | Last Updated on Mon, Jul 15 2019 11:52 AM

Adilabad district becomes a ODF District In Telangana - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : పల్లెల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, దానిని ఆచరణలో సాధ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించిన ప్రభుత్వాలు మూడేళ్లలో జిల్లాలో 73శాతం మార్పు తీసుకొచ్చాయి. మిగతా 27 శాతం ప్రగతి సాధన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వం  ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రాన్ని ఓడీఎఫ్‌ (బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రం)గా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఓడీఎఫ్‌గా ప్రకటించబడుతాయి.

దీంతో జిల్లాలోని 13పాత మండలాల పరిధిలోని 589 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. అంటే మన జిల్లాలోని గ్రామాలన్నీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలని దానర్థం. జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చేందుకు ఇంకా పక్షం రోజులే మిగిలింది. ఇందుకు అధికారులు గత నెల రోజులుగా తీరిక లేకుండా శ్రమిస్తూ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలతో మమేకమవుతున్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నా.. ఎందుకు పూర్తి కావడం లేదనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు.  

జిల్లాలో నిర్మాణాలు ఇలా.. 
2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాసాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్‌హెచ్‌ఎల్‌) ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 ఇళ్లకు లేవని అధికారులు తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. అదే ఏడాదిలో మరుగుదొడ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో మరో 10,292 మంది నిర్మించుకున్నారు. మిగతా 59,374 మంది నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. అయితే సొంత డబ్బులతో మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడం, కార్యాలయాలకు తిరిగి తిరిగి వేసారిపోవడం లాంటివి జరిగాయి. అంత పూర్తి అయినా.. ఆన్‌లైన్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేయకపోవడంతో బిల్లులు ఆగిపోయిన సంఘటనలున్నాయి.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న ప్రజలు మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ముందుకు రాలేదని అధికారులు అప్పట్లోనే గుర్తించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతో గత మూడేళ్ల క్రితం జిల్లాలో స్వచ్చభారత్‌ కింద  59,374 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవకాశం కల్పించింది.  ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటి వరకు 29,905 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 25,808 మరుగుదొడ్లు వివిధ స్థాయిలో నిర్మాణాల్లో ఉండగా, 3661 నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి.  

పక్షం రోజుల్లో ‘లక్ష్యం సాధ్యమేనా’.?
జిల్లాలో ఏ ఒక్క ఇంటిలో మరుగుదొడ్డి లేదని చెప్పేందుకు వీలులేకుండా అధికారులు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఇది వరకే పలుసార్లు ఆయా మండలాలను ఎంపీడీవోలను ఆదేశించారు. గతేడాది గ్రామాలను ఓడీఎఫ్‌గా చేసిన ఎంపీడీవోలకు, సర్పంచ్‌లకు, అధికారులకు గాందీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేసినా మార్పు కన్పించలేదు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 28 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇందుకు పక్షం రోజులే గడువుంది. ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయని అధికారులు పేర్కొనగా ప్రస్తుతం నిర్మించుకున్న వాటికి బిల్లులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. (ఓడీఎఫ్‌) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి రూ.16.20 కోట్లు విడుదల కావడంతో అప్పట్లో నిర్మాణాల్లో జాప్యం జరిగింది. కానీ ప్రస్తుతం సరిపడా నిధులు అందుబాటులో ఉన్న ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో నిర్మాణాలను వేగవంతం చేసేలా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, యువత, మిగతా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఓడీఎఫ్‌గా ప్రకటిస్తే.. 
జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించిన తర్వాత గ్రామాల్లో మల విసర్జనకు ఆరు బయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. పరిశీలన చేసేందుకు గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’ని నియమించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు కేంద్రం అందజేయనుంది. దీంతో పాటు మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగేలా ప్రజలను చైతన్యపరిస్తే స్వచ్ఛగ్రహీలకు ప్రభుత్వం నగదు పురస్కారం ఇవ్వనుంది. గోబర్‌గ్యాస్‌ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 ప్రొత్సాహంగా అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్‌వాడీలు, పీహెచ్‌సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్‌ రోజును అమలు చేయడం, అంకితభావంతో పని చేసే స్వచ్ఛగ్రహీలకు సత్కరాలు, అవార్డులు ఇవ్వనుంది. స్వచ్ఛగ్రహీ ఉద్యోగం శాశ్వతం కాకపోయిన ఇంటిలో మరుగుదొడ్డి ఉన్న యువతను మాత్రమే ఎంపిక చేసుకునేలా రాష్ట్రాలను ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement