odf district
-
‘స్వచ్ఛత’లో నం.1
సాక్షి, కరీంనగర్: స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో కరీంనగర్ జిల్లాకు మొదటిర్యాంకు వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛదర్పణ్‌లో కరీంనగర్ జిల్లాకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో మొదటిర్యాంకు రావడంతో గుర్తింపు వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లాలు వందశాతం మార్కులతో మొదటిర్యాంకు సొంతం చేసుకున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఉపయోగం, తడి,పొడి చెత్తనిర్వహణ, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రచార కార్యక్రమాలు, ప్రజలను భాగస్వాములను చేయడం, మహిళాసంఘాలు, స్వచ్ఛగ్రాహీల భాగస్వామ్యం, గ్రామస్థాయి ప్రజల సమన్వయంతో వివిధ అంశాలతో చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రాతిపదికన తీసుకున్నారు. ఓడీఎఫ్ కోసం విస్తృతప్రచారం.. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేపట్టింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మండలాలు, గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 2017లోనే జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. స్వచ్ఛభారత్‌కు సంబంధించిన ఐదు విభాగాల్లోనూ జిల్లాప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ–32, స్వచ్ఛభారత్‌పై అవగాహనలో 32మార్కులు లభించాయి. తడి,పొడి చెత్త సేకరణ, ఘన, ద్రవవ్యర్ధాల నిర్వహణలో 16మార్కులు, జియోట్యాగింగ్, కమ్యూనిటీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం, స్వచ్ఛభారత్ అనుబంధ కార్యక్రమాల విభాగంలో 20 మార్కులతో కలుపుకుని వందమార్కులు సాధించింది. జాతీయ,రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించడంతో గుర్తింపు లభించింది. బోర్డులతో గ్రామాల్లో స్వాగతం.. జిల్లావ్యాప్తంగా ఓడీఎఫ్ ప్లస్‌లో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రవేశానికి ముందు బోర్డులు ఏర్పా టు చేస్తున్నారు. ‘బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందిన గ్రామం’ మీకు స్వాగతం పలుకుతుందంటూ అన్ని గ్రామాల్లో స్వాగతబోర్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతీ గ్రామంలో ప్రధాన చౌరాస్తాల్లో మరుగుదొడ్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వాల్‌పెయింటింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లను వినియోగించడంపై అవగాహన కల్పిస్తున్నారు. -
ఓడీఎఫ్ సాధ్యమేనా.?
సాక్షి, ఆదిలాబాద్ : పల్లెల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దానిని ఆచరణలో సాధ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించిన ప్రభుత్వాలు మూడేళ్లలో జిల్లాలో 73శాతం మార్పు తీసుకొచ్చాయి. మిగతా 27 శాతం ప్రగతి సాధన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రాన్ని ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రం)గా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఓడీఎఫ్‌గా ప్రకటించబడుతాయి. దీంతో జిల్లాలోని 13పాత మండలాల పరిధిలోని 589 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. అంటే మన జిల్లాలోని గ్రామాలన్నీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలని దానర్థం. జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చేందుకు ఇంకా పక్షం రోజులే మిగిలింది. ఇందుకు అధికారులు గత నెల రోజులుగా తీరిక లేకుండా శ్రమిస్తూ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలతో మమేకమవుతున్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నా.. ఎందుకు పూర్తి కావడం లేదనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు. జిల్లాలో నిర్మాణాలు ఇలా.. 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాసాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్హెచ్ఎల్) ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 ఇళ్లకు లేవని అధికారులు తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. అదే ఏడాదిలో మరుగుదొడ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో మరో 10,292 మంది నిర్మించుకున్నారు. మిగతా 59,374 మంది నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. అయితే సొంత డబ్బులతో మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడం, కార్యాలయాలకు తిరిగి తిరిగి వేసారిపోవడం లాంటివి జరిగాయి. అంత పూర్తి అయినా.. ఆన్లైన్లో ఫొటోలను అప్లోడ్ చేయకపోవడంతో బిల్లులు ఆగిపోయిన సంఘటనలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న ప్రజలు మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ముందుకు రాలేదని అధికారులు అప్పట్లోనే గుర్తించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతో గత మూడేళ్ల క్రితం జిల్లాలో స్వచ్చభారత్ కింద 59,374 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటి వరకు 29,905 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 25,808 మరుగుదొడ్లు వివిధ స్థాయిలో నిర్మాణాల్లో ఉండగా, 3661 నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. పక్షం రోజుల్లో ‘లక్ష్యం సాధ్యమేనా’.? జిల్లాలో ఏ ఒక్క ఇంటిలో మరుగుదొడ్డి లేదని చెప్పేందుకు వీలులేకుండా అధికారులు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఇది వరకే పలుసార్లు ఆయా మండలాలను ఎంపీడీవోలను ఆదేశించారు. గతేడాది గ్రామాలను ఓడీఎఫ్‌గా చేసిన ఎంపీడీవోలకు, సర్పంచ్‌లకు, అధికారులకు గాందీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేసినా మార్పు కన్పించలేదు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 28 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇందుకు పక్షం రోజులే గడువుంది. ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయని అధికారులు పేర్కొనగా ప్రస్తుతం నిర్మించుకున్న వాటికి బిల్లులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. (ఓడీఎఫ్) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి రూ.16.20 కోట్లు విడుదల కావడంతో అప్పట్లో నిర్మాణాల్లో జాప్యం జరిగింది. కానీ ప్రస్తుతం సరిపడా నిధులు అందుబాటులో ఉన్న ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో నిర్మాణాలను వేగవంతం చేసేలా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, యువత, మిగతా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓడీఎఫ్‌గా ప్రకటిస్తే.. జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించిన తర్వాత గ్రామాల్లో మల విసర్జనకు ఆరు బయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. పరిశీలన చేసేందుకు గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’ని నియమించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు కేంద్రం అందజేయనుంది. దీంతో పాటు మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగేలా ప్రజలను చైతన్యపరిస్తే స్వచ్ఛగ్రహీలకు ప్రభుత్వం నగదు పురస్కారం ఇవ్వనుంది. గోబర్‌గ్యాస్ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 ప్రొత్సాహంగా అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్‌సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్ రోజును అమలు చేయడం, అంకితభావంతో పని చేసే స్వచ్ఛగ్రహీలకు సత్కరాలు, అవార్డులు ఇవ్వనుంది. స్వచ్ఛగ్రహీ ఉద్యోగం శాశ్వతం కాకపోయిన ఇంటిలో మరుగుదొడ్డి ఉన్న యువతను మాత్రమే ఎంపిక చేసుకునేలా రాష్ట్రాలను ఆదేశించింది. -
కలెక్టర్‌కు కోపమొచ్చింది..!
సాక్షి ప్రతినిధి, కడప: ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం ధర్నాలు చేయడం మనం ఇప్పటివరకు చూశాం.. ఏదైనా ప్రభుత్వ పథకం పక్కాగా అమలుకాకపోతే అధికారులపై చిందులు వేసే ఉన్నతాధికారులను చూశాం.. కానీ, జిల్లా కలెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఓడీఎఫ్ పథకం 100శాతం అమలు కోసం వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న గ్రామాల్లో ధర్నా చేపడతానని ప్రకటించడం విశేషం. నిర్దేశిత సమయానికి లక్ష్యం పూర్తి చేయలేకపోయినా అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తికాని గ్రామాల్లో తానే స్వయంగా ధర్నా చేపట్టి.. ఆ పరిస్థితికి కారణమైన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో హడలిపోయిన అధికారులందరూ పల్లెబాట పట్టారు. మరో వారంరోజులే గడువు.. జిల్లాను ఓడీఎఫ్(ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ)గా చేయాల్సిన గడువు మరో వారంరోజులతో ముగియనుంది. జనవరి నెలాఖరుకే జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా(ఓడీఎఫ్) చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇదేలక్ష్యంగా ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తొలుత డిసెంబర్ నెలాఖరులోగా లక్ష్యాలను పూర్తిచేయాలని నిర్దేశించింది. ఆ తర్వా త గడువును జనవరి చివరివరకు పెంచింది. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అన్ని ముఖ్యశాఖల అధికారులకు మరుగుదొడ్ల పనిలో నిమగ్నమయ్యారు. అయితే, పనుల పురోగతిని పరిశీలిస్తే మరో 2నెలలు సమయమిచ్చినా ఓడీఎఫ్ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 23 మండలాల్లో పూర్తికాని పనులు స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాలోని 50మండలాల్లో మొత్తం 3,40,823 మరుగుదొడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇప్పటివరకు 2,51,431 పూర్తిచేశారు. మిగిలిన 89,392లో 83వేల వరకు వివిధ దశలో పనులు జరుగుతున్నాయి. 9వేల పైచిలుకు మాత్రం ఇప్పటివరకు నిర్మాణానికి నోచుకోలేదు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 23 మండలాల్లో జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత పనులు చేపట్టి పూర్తయిన కొన్ని మరుగుదొడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చాలాచోట్ల మరుగుదొడ్లను నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ముద్దనూరులో 50శాతం లోపే.. సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలే లక్ష్యంగా ముద్దనూరు మండలంలో 50శాతం మరుగుదొడ్లను కూడా పూర్తి చేయలేదు. ఈ మండలంలో మొత్తం 3,095 నిర్మించాల్సి ఉండగా, 1,505 మాత్రమే పూర్తిచేశారు. పులివెందుల మండలంలోనూ 1,258 మరుగుదొడ్లను లక్ష్యంగా ఇచ్చారు. ఇప్పటివరకూ 655 మాత్రమే పూర్తిచేయగలిగారు. మిగిలిన వాటిలో కొన్నిచోట్ల ఇంకా పనులు ప్రారంభమే కాలేదు. అదేవిధంగా వల్లూరు మండలంలో మొత్తం 2,855 మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 1,443 మాత్రమే పూర్తి చేశారు. కలెక్టర్ హెచ్చరికతో ఉరుకులు పరుగులు ఓడీఎఫ్ పథకం అమలులో అధికారులు విఫలమయ్యారంటూ సోమవారం కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు హడలిపోయారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా అధికారులు ఉరుకులు పరుగులు పెట్టడం కనిపించింది. పైగా 23 మండలాల్లో పనితీరు సరిగలేకపోవడంపై బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయా మండలాలకు చెందిన అధికారులు నిర్దేశించిన టార్గెట్లను చేరుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నెల 27న మాస్ గ్రౌండింగ్ లక్ష్యాన్ని కలెక్టర్ నిర్దేశించడంతో పనులు వేగవంతానికి అధికారులు కృషిచేస్తున్నారు. -
ఓడీఎఫ్ జిల్లాగా తూర్పు
పెద్దాపురం : స్వచ్ఛ భారత్‌లో భాగంగా రాష్ట్రంలోనే తూర్పుగోదావరిని ఓడిఎఫ్ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. పంచాయతీరాజ్ మహోత్సవాల్లో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ స్థాయి ఓడిఎఫ్ గ్రామాల సమీక్షా సమావేశం సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు అ«ధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి రాజప్ప మాట్లాడుతూ జిల్లా అంతటా ఓడీఎఫ్ ప్రకటించడం జరిగిందని, సంపూర్ణ బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అన్ని పట్టణ, గ్రామాల్లో నూరు శాతం ఐఎస్ఎల్ నిర్మాణాలు పూర్తి చేసే దిశగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో సర్పంచ్‌లదే కీలకపాత్రని, గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ నియోజకవర్గంలో నూరుశాతం ఐఎస్ఎల్ నిర్మాణాలు జరగాలని, వచ్చే ఏడాది ఆగస్టు 15లోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. దీనికి ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖాధికారులు సత్వర చొరవ చూపాలన్నారు. పెద్దాపురం, సామర్లకోట జెడ్పీటీసీలు సుందరపల్లి శివనాగరాజు, గుమ్మల విజయలక్ష్మి, సామర్లకోట ఎంపీపీ గొడత మార్త, ఏఎంసీ వైస్ చైర్మ¯ŒS ఎలిశెట్టి నాని. సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు కొత్తెం కోటిలు మాట్లాడుతూ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గం ఆదర్శం కావాలంటే ప్రతి సర్పంచ్ ఐఎస్ఎల్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం సామర్లకోట, పెద్దాపురం ఓడిఎఫ్ గ్రామాల సర్పంచ్‌లను మంత్రి రాజప్ప చేతుల మీదుగా సత్కరించారు. ఎంపీడీవోలు పల్లాబత్తుల వసంతమాధవి, బి.నాగేశ్వరరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.