సాగు లెక్క..ఇక పక్కా | Formers Details entered In Online In Aadilabad | Sakshi
Sakshi News home page

సాగు లెక్క..ఇక పక్కా

Published Mon, Jul 8 2019 2:29 PM | Last Updated on Mon, Jul 8 2019 2:29 PM

Formers Details entered In Online In Aadilabad - Sakshi

జైనథ్‌ మండలంలోని పెండల్‌వాడలో  సర్వే నిర్వహిస్తున్న ఏవో

సాక్షి, జైనథ్‌(ఆదిలాబాద్‌) : ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీల ఏర్పాటుకు వీలుగా ఫిబ్రవరిలో ప్రారంభించిన రైతు సమగ్ర సర్వే ఇటీవల పూర్తయింది. వ్యవసాయాధికారులు జిల్లాలో ప్రతి రైతు కుటుంబం వివరాలు, వారు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. అధికారులు సర్వే ఫారాల్లో ముందుగానే ప్రింట్‌ చేసిన 13 అంశాలు కాకుండా మరో 14అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. రైతుకు మేలు చేసేందుకు  పంటకాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా రైతుల వివరాలు సేకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం కాలనీల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. 

ఇదీ సాగు లెక్కా..
జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో మొత్తం 5.10లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నట్లు తేలింది. 1.21లక్షల మంది రైతులు ఉండగా, ప్రధానంగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తి తరువాత సోయా, అంతర పంటగా కంది పంటలు తరువాత స్థానంలో నిలిచాయి. మొత్తం 18మండలాల్లోని 102 క్లస్టర్‌ల పరిధిలోని 508 గ్రామాల్లో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 105మంది సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 90వేల రైతు కుటుంబాలను జూన్‌ వరకు సర్వే చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా జైనథ్‌ మండలంలో 14113మంది రైతులు ఉండగా, మావల మండలంలో అత్యల్పంగా కేవలం 775మంది రైతులు మాత్రమే ఉన్నారు.

పంట కాలనీల ఏర్పాటుకు...     
ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండటంతో రైతుల పక్కా సమాచారం అవసరమైంది.  అయితే వ్యవసాయ శాఖ వారు ప్రతీ ఏటా రైతులు వేసిన పంటల వివరాలను సేకరిస్తారు. ఈ వివరాల్లో చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉండటంతో మరోసారి రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. గతంలో రైతుల సాగు వివరాలు తెలుసుకోవడం ఒక రకంగా చాలా కష్టంగా ఉండిందనే చెప్పవచ్చు. రైతులు బ్యాంకులో ఒక పంట పేరిట రుణం తీసుకుంటే.. బీమా కోసం మరో పంట నమోదు చేయించేవారు. దీంతో పాటు పంట రుణం కోసం ఇంకో పంట చూపించడం సాధారణంగా మారింది. దీంతో రైతులు అసలు ఏఏ పంటలు సాగు చేస్తున్నారు అని తెల్సుకోవడం కొంత ఇబ్బందిగానే మారింది. అయితే ఈ సమగ్ర సర్వేతో రైతుల పక్క వివరాలు తెలియడంతో పంట కాలనీల ఏర్పాటు దిశగా ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ సర్వే ద్వార ఒక ఒక నిర్ణీత ప్రదేశంలో ఎక్కువగా సాగయ్యే పంటలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించి, వాటి దిగుబడి పెంచేందుకు, విస్తృత మార్కెట్‌ కల్పించేందుకు అవకాశం కలుగనుంది. అలాగే ఫుడ్‌ ప్రాసెసిసింగ్, క్రాప్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకుర్చేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి.

కొనసాగుతున్న ఆన్‌లైన్‌..
సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలు ప్రత్యేకమైన పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్‌ గ్రామాల్లో ఆఫ్‌లైన్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేస్తున్నారు. వారికి ఇచ్చిన ట్యాబ్‌లలో ఈ పూర్తి సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కసారి ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి అయితే ఒక్క క్లిక్‌తో ఏ గ్రామంలోని వివరాలైన తెలుసుకునే వీలుటుంది. అన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తుండటంతో రైతుల సమస్త సమాచారం ఒకే చోటు లభించే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క రైతు వివరాలను ఆన్‌లైన్‌ చేసేందుకు కనీసం 20–30నిమిషాలు పడుతుండటంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ కొంత నెమ్మదిగా కొనసాగుతోంది. 

గ్రామాల వారీగా నివేదికలు పంపించాం
సమగ్ర సర్వేపై ప్రభుత్వానికి గ్రామాల వారీగా నివేదికలు పంపించాం. గ్రామాల వారీగా సాగు విస్తీర్ణం, పంటల వివరాలు ఆన్‌లైన్‌ చేశాం. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్, రైతుబంధు పనుల్లో కొంత సిబ్బంది బిజీగా ఉండటంతో రైతుల వారీగా ఆన్‌లైన్‌ చేసే పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నా యి. ఏఈవోలు వారి వారి క్లస్టర్‌ సమాచా రాన్ని ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశాలు జారీ చే సాం. త్వరలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ చే స్తాం. – ఆశాకుమారి, డీఏవో,ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement