గల్ఫ్ బాధితులకు ఊరట
నిర్మల్ : కన్నవారిని.. ఉన్న ఊరిని.. భార్యా, పిల్లలను వదిలి ఎడారి దేశాలకు ఉపాధి కోసం పయనమైన వారిలో కొందరు మోసాల బారిన పడుతున్నారు.. మరికొందరేమో దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతూ దినదినగండంగా కాలం నెట్టుకొస్తున్నారు. ఇంకొందరేమో అటు ఆ దేశం పెట్టే బాధలు భరించలేక.. పనులు లేక.. చేసిన అప్పులు చెల్లించకముందే ఇళ్లకు పయనమవుతున్నారు. ఇన్ని బాధలు పడుతున్న గల్ఫ్ బాధితులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనిస్తోంది. గల్ఫ్ బాధితులకు అండగా ఉంటామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ఆయా కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఎడారి దేశాలకు..
ఉపాధి కోసం జిల్లాలోని నిర్మల్, ముథోల్, బోథ్, ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూర్, ఆదిలాబాద్ తదితర నియోజకవర్గాల నుంచి దుబాయి, మస్కట్, సౌదీ, ఓమన్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు నిత్యం వలస వెళ్తున్నారు. జిల్లాలో దాదాపు 30 వేలకు పైనే గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ప్రధానంగా వీరంతా ఉన్న ఊరిలో చేసేందుకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, సాగు లాభసాటి కాకపోవడంతో చేసిన అప్పులు తీర్చేందుకు, తమ కుటుంబాలకు ఆర్థికంగా మంచి హోదాలో ఉంచాలన్న ఆశతో రూ.లక్షల్లో అప్పులు చేసి గల్ఫ్ బాటపడుతున్నారు. అయితే కొందరు ఏజెంట్లు చేసే మోసాల బారినపడి వారు ఎడారి దేశాల్లో కడు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చేసేందుకు సరైన పనులు లేక, అప్పులు తీర్చే మార్గాలు లేక, వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. మరికొందరైతే అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇంకొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
దయనీయ పరిస్థితుల్లో కుటుంబాలు..
ఎడారి దేశ ఆశలు అనేక కుటుంబాలను దయనీయ పరిస్థితులకు నెట్టేశాయి. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు తీర్చే మార్గాలు లేకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఆ అప్పులను తీర్చలేక ఉన్న భూములను అమ్ముకుంటున్నారు. మరికొందరైతే అక్కడ జరిగే ప్రమాదాల బారినపడి విగతజీవులుగా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గానీ, సాధారణంగా గానీ మృత్యువాతపడితే ఆ మృతదేహం వచ్చేందుకు నెలల తరబడి వేచిచూసే పరిస్థితి ఉంది.
అందని ఆసరా..
కొందరు ఏజెంట్లు, కొన్ని కంపెనీలు చేసిన మోసాలతో రూ.లక్షల్లో అప్పులతో తిరిగి స్వగ్రామాలకు వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. గతంలో దుబాయి ప్రభుత్వం, ఇటీవల సౌదీ ప్రభుత్వం జారీ చేసిన నితాఖత్ చట్టాలతో వందలాది మంది తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే వారు వెళ్లేందుకు చేసిన అప్పులు అలాగే మిగిలిపోయాయి. దీంతో తీర్చే మార్గాలు లేక నిత్యం అనేక అష్టకష్టాలు పడుతున్నారు. వీరి కోసం ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలూ ప్రత్యేక చర్యలు తీసుకోలేదు.
కేంద్రం భరోసా..
గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న వారిని తాము అన్నివిధాలా ఆదుకుంటామని విదేశాంగ, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. ఈ మేరకు గత సోమవారం ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 మంది ఎంపీలతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఇరు ప్రాంతాల నుంచి అత్యధికంగా గల్ఫ్‌లో ఉండడంతో ఈ సమావేశం నిర్వహించినట్లు కేంద్ర మంత్రి వారితో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ అష్టకష్టాలు పడుతున్న గల్ఫ్ వాసులతోపాటు, అప్పుల కుంపట్లో కొట్టుమిట్టాడుతూ తిరిగి స్వగ్రామాలకు వచ్చిన గల్ఫ్ బాధితులకూ బాసటాగా నిలవాలని నిర్ణయించారు. దీనిపై జిల్లా గల్ఫ్ బాధితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పట్టించుకుని తమలాంటి వారికి సాయం అందించాలని కోరుతున్నారు.