
సాక్షి, అమరావతి: అఖిల భారత స్థాయి అధికారి విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ స్క్రూటినీ చేసి సిఫార్సు చేయాల్సి ఉంది. ఏ అధికారినైనా విదేశీ పర్యటనకు పంపాలంటే అందుకు సంబంధించి ఏదైనా ప్రయోజనం ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఉంటుందా, ఉండదా.. అనే కోణంలో సీఎస్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తిని అమెరికాలో శిక్షణకు పంపేందుకు ఎటువంటి స్క్రూటినీ లేకుండా ఏకంగా రూ.11 లక్షలను అడ్వాన్స్‌గా మంజూరు చేస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి సంబంధం ఉన్న కొండేపాటి రాజేందర్ కోసం ఆర్థికశాఖలో ఫైనాన్షియల్ ఎకనమిక్ అనాలసిస్ డివిజన్‌ను ఏర్పాటు చేసి.. దానికి డైరెక్టర్‌గా రాజేందర్‌ను నియమించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజేందర్ అనే ప్రైవేట్ వ్యక్తిని శిక్షణకు పంపాలని ఆర్థికశాఖ కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆ శిక్షణ కోసం రాజేందర్‌కు అడ్వాన్స్‌గా రూ.11 లక్షలు మంజూరు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీచేశారు.
రవిచంద్ర శుక్రవారం నుంచి సెలవులో వెళ్తుండగా గురువారం హడావిడిగా నగదు మంజూరు చేస్తూ.. జీవో ఇవ్వకుండా ఆఫీస్ ఆర్డర్ జారీచేశారు. ఆఫీస్ ఆర్డర్ అయితే ఎవ్వరికీ తెలియదనే భావనతో రవిచంద్ర ఇచ్చారు. ఆ శిక్షణ కూడా అమెరికాలో వచ్చే నెల 12 నుంచి 24 వరకు ఉంది. వచ్చే నెల ఉన్న శిక్షణ కోసం.. హడావిడిగా సెలవుపై వెళ్తున్న ఒక రోజు ముందు ఆఫీస్ ఆర్డర్ జారీ చేయడాన్ని సచివాలయ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఒక పక్క రవిచంద్ర 26 రోజుల పాటు.. అంటే వచ్చే నెల 19వ తేదీ వరకు వ్యక్తిగత కారణాలపై ఆర్జిత సెలవుపై వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా ఎలా?
రాజేందర్ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చాక బిల్లులు పెట్టుకుంటారని, అప్పుడు మరో రూ.11 లక్షలు చెల్లించనున్నారని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. హార్వర్డ్ కెనెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎ మార్కెట్ ఎకానమీ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ఇన్ ఎ ఛేంజింగ్ వరల్డ్ అనే అంశంపై శిక్షణ కోసం రాజేందర్‌ను పంపిస్తున్నట్లు ఆఫీస్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే రవిచంద్ర ఆఫీస్ ఆర్డర్ ఎలా జారీ చేస్తారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తి శిక్షణ కోసం ప్రజాధనాన్ని ఎలా ఇస్తారని కూడా ఆర్థికశాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకోవాల్సి ఉందని ఆర్థిక శాఖ వర్గాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment