![Amazon moves Karnataka HC seeking stay on CCI probe order - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/10/Amazon.jpg.webp?itok=2agx6IoO)
సాక్షి, బెంగళూరు: ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఆదేశాలను నిలిపి వేయాలని తన పిటిషన్‌లో కోరింది. ఈమేరకు సోమవారం కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 13 జనవరి 2020 న సీసీఐ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలని విన్నవించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా తమకు ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించింది.
ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు తమ వ్యాపారంలో పోటీ చట్టాల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయంటూ పలు సంఘాలు ఇదివరకే తీవ్ర ఆరోపణలు చేశాయి. ఫలితంగా రిటైలర్లకు అన్యాయం జరుగుతోందని ఆరోపించాయి. కొన్ని కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటూ మొబైల్‌ఫోన్ వంటి ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు అందజేస్తున్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటైలర్లు, చిన్న వ్యాపారాలు భారీగా నష్టపోతున్నాయని పేర్కొంటూ వ్యాపారుల సంఘం ఇటీవల సీసీఐకి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతోపాటు భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌కు పెద్ద ఉపకారమేమీ చేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ వార్తలపై అమెజాన్ ఇండియా స్పందించాల్సి వుంది.
Comments
Please login to add a commentAdd a comment