ఐఫోన్ హ్యాక్ కోసం యాపిల్కు ఆదేశాలు
న్యూయార్క్: కాలిఫోర్నియాలో నరమేధానికి కారణమైన ఉగ్రవాది ఫరూక్ ఐఫోన్ను హ్యాక్ చేయాలని కోర్టు యాపిల్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత కన్నా డిజిటల్ ప్రైవసీ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో ఉగ్రవాది ఐఫోన్ను హ్యక్ చేయడానికి కావలసిన సాంకేతికతను అందించి విచారణ అధికారులకు విలువైన సమాచారాన్ని సేకరించడంలో యాపిల్ సహకరించనుంది.
డిసెంబర్ 2 న సయీద్ ఫరూక్, తష్ఫిన్ మాలిక్ దంపతులు సాన్ బెర్నార్డినోలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 14 మంది మృతికి కారణమై పోలీసుల కాల్పుల్లో వీరిద్దరూ హతమైన విషయం తెలిసిందే. అయితే ఫరూక్ ఐఫోన్ను డీకోడ్ చేసి సమాచారాన్ని సేకరించాలనుకున్న ఎఫ్బీఐ అధికారులకు యాపిల్ హై సెక్యూరిటీ టెక్నాలజీ అడ్డుగా నిలిచింది. దీంతో యాపిల్ సంస్థ ఎఫ్బీఐకి ఈ సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.