Farook
-
ఐఫోన్ హ్యాక్ కోసం యాపిల్‌కు ఆదేశాలు
న్యూయార్క్: కాలిఫోర్నియాలో నరమేధానికి కారణమైన ఉగ్రవాది ఫరూక్ ఐఫోన్‌ను హ్యాక్ చేయాలని కోర్టు యాపిల్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత కన్నా డిజిటల్ ప్రైవసీ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో ఉగ్రవాది ఐఫోన్‌ను హ్యక్ చేయడానికి కావలసిన సాంకేతికతను అందించి విచారణ అధికారులకు విలువైన సమాచారాన్ని సేకరించడంలో యాపిల్ సహకరించనుంది. డిసెంబర్ 2 న సయీద్ ఫరూక్, తష్ఫిన్ మాలిక్ దంపతులు సాన్ బెర్నార్డినోలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 14 మంది మృతికి కారణమై పోలీసుల కాల్పుల్లో వీరిద్దరూ హతమైన విషయం తెలిసిందే. అయితే ఫరూక్ ఐఫోన్‌ను డీకోడ్ చేసి సమాచారాన్ని సేకరించాలనుకున్న ఎఫ్‌బీఐ అధికారులకు యాపిల్ హై సెక్యూరిటీ టెక్నాలజీ అడ్డుగా నిలిచింది. దీంతో యాపిల్ సంస్థ ఎఫ్‌బీఐకి ఈ సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆ టెర్రర్ దంపతులను పూడ్చిపెట్టారు
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ కాల్పులతో మారణహోమం సృష్టించి పోలీసులు కాల్పుల్లో హతులైన ఆ ఇద్దరు ముస్లిం దంపతులను పూడ్చిపెట్టినట్లు కాలిఫోర్నియా అధికారులు తెలిపారు. ఈ మంగళవారం మధ్యాహ్నం వారి మృతదేహాలు పూడ్చేసినట్లు చెప్పారు. ఈ నెల 2 తెల్లవారుజామున సయెద్ రిజ్వాన్ ఫరుక్, తష్ఫీన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ హాలీడే పార్టీపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. ఈ ఘటనలో 21మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని, సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాలపై దాడులు చేస్తుండటంతో ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించింది. అయితే, అదే రోజు పోలీసులు తీవ్రంగా గాలింపులు జరిపిఎదురుకాల్పులు జరపగా వారిద్దరు ప్రాణాలుకోల్పోయారు. అప్పుడు స్వాధీనం చేసుకున్న వారి మృతదేహాలను మంగళవారం బయటకు తీసుకొచ్చి గంటల్లోనే ఎవరికీ సమాచారం అందించకుండా పూడ్చి వేశారు. దీనిపై అధికారులు ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు. -
'ఆ జంటకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి'
సాన్ బెర్నార్డినో: ఊహించిందే నిజమైంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దాడులకు పాల్పడిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఫరూక్, మాలిక్ యువజంటకు ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫరూక్ పలుమార్లు ఇస్లామిక్ తీవ్రవాదులతో సంభాషణలు జరిపినట్లు తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన సమయంలో వందలాది మందిని హతమార్చడానికి సరిపడే మారణాయుధాలు ఫరూక్ వద్ద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దాడుల తర్వాత ప్రాధమికంగా చేపట్టిన విచారణలో ఫరూక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే విషయం స్సష్టంకాలేదు. వారి కుటుంబంతో పరిచయం ఉన్నవారు సైతం వారు దాడులకు పాల్పడ్డారంటే నమ్మలేకుండా ఉన్నారు. గతంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎఫ్‌బీఐ నిఘా పరిధిలో ఫరూక్ దంపతులు లేరని అధికారులు వెల్లడించారు. -
టీడీపీలో నాలుగు స్తంభాలాట!
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకు నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం నలుగురు ప్రధాన నేతలు పార్టీలో ఉండటంతో ఎవరి నాయకత్వంలోకి వెళ్లాలో కార్యకర్తలకు అర్థం కావటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల వరకు మాజీమంత్రి ఫరూక్ నాయకత్వంలో పార్టీ కొనసాగేది. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇదిలా ఉండగా నంద్యాల పార్లమెంట్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు. ఫరూక్, శిల్పా మోహన్ రెడ్డిల మధ్యే ఐక్యత అంతంత మాత్రంగా ఉంటే ఎస్పీవై రెడ్డి చేరడంతో పార్టీలో మరింత గందరగోళం ఏర్పడిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీమంత్రి టీజీ వెంకటేష్ అనుచరుడిగా మరో స్థానిక నాయకుడు, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసుల శెట్టి పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే తమను ఓడించిన ఎస్పీవై రెడ్డిని టీడీపీలోకి తీసుకు రావడమే కాకుండా, ఎన్నికల సమయంలో తమకు సహకరించని పెసలకు మద్దతు ఇవ్వడంపై ఫరూక్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో నాలుగు స్తంభాల ఆట కొనసాగుతున్నదని ఏ స్తంభంతో ఎలాంటి సమస్య తలెత్తుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి.