
సండేకార్ట్.కామ్
ఇంటికి కావాల్సిన సామాన్లు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసి తెప్పించుకోవడం ఇప్పుడు చాలామంది చేస్తున్న పని. చాలా కంపెనీలు ఈ రకమైన సేవలు అందిస్తున్నాయి కూడా. అయితే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎ.ఎల్.టెక్నాలజీస్ సండేకార్ట్.కామ్ వెబ్‌సైట్ ద్వారా కొంచెం భిన్నమైన సేవలు అందిస్తోంది. మీకు నచ్చిన స్టోర్ నుంచే కొనుగోలు చేసే అవకాశం కల్పించడం ఈ వెబ్‌సైట్ ప్రత్యేకత. ఉదాహరణకు ఫలానా వస్తువు... ఫలానా సూపర్‌మార్కెట్‌లోనే బాగుంటుందని, చౌకగా లభిస్తుందని మీకు అనిపిస్తే అక్కడి నుంచే కొనుక్కోవచ్చు. లేదా ఏ స్టోర్‌లో ధరలు తక్కువున్నాయో తెలుసుకుని ఖరీదు చేయవచ్చు. చిన్న చిన్న కిరాణా దుకాణాల వివరాలు కూడా దీంట్లో ఉండటం విశేషం.
అంతేకాకుండా ఇంగ్లీషుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ సామాన్ల పేర్లు చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో సేవలందిస్తున్నామని, డిమాండ్‌నుబట్టి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా కూడా కొనుగోళ్లు చేసేందుకు వీలుగా మొబైల్ అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సొంతంగా వెబ్‌సైట్లు ఏర్పాటు చేసుకోలేని కిరాణా దుకాణాల వారికి తమ వెబ్‌సైట్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు.