
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు ఆదేశించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఘటన పూర్వాపరాలపై విచారణ జరపాలని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లను ఆదేశించామన్నారు. ఈ విషయమై శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
అక్కడ వాహనాలను సైతం టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని చెప్పారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. ఘటన స్థలిలో సీసీ కెమెరా పుటేజీలను విశ్లేషస్తున్నామని, ఇప్పటికే పలువురిని గుర్తించామని.. మరికొందరు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందన్నారు. చంద్రబాబు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు.