కడప జైలుకు పుంగనూరు నిందితులు | Punganur Incident Accused To Kadapa Central Jail - Sakshi
Sakshi News home page

కడప జైలుకు పుంగనూరు నిందితులు

Published Tue, Sep 5 2023 12:13 PM | Last Updated on Tue, Sep 5 2023 12:35 PM

Punganur Accused To Kadapa Central Jail - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్‌ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్‌కు తరలించారు.

కాగా, ఆగస్ట్‌ 4వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో, చిత్తూరు జిల్లా పుంగనూరులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అప్పటికే పన్నిన పక్కా కుట్రతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, కిరాయి మూకలు రాళ్లు, కట్టెలతో దాడి చేసి సుమారు 47 మంది పోలీసు­లను గాయపరిచారు. రెండు పోలీస్‌ వాహ­నాలను తగలబెట్టారు. రణధీర్‌ అనే కానిస్టేబుల్‌ కంటి చూపు కోల్పోయాడు. ఈ విధ్వంసానికి సంబంధించి ఇప్పటి­వరకు 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు సహా నిందితులంతా పారిపోగా.. పోలీసులు ఇప్పటికే 110 మందిని అరెస్టు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

గత్యంతరం లేని పరిస్థితుల్లో...
టీడీపీ నేత చల్లా బాబును అదుపులోకి తీసుకునేందుకు జిల్లా పోలీస్‌ శాఖ 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చల్లా బాబు తన సెల్‌ఫోన్‌ పడేసి.. కొత్త ఫోన్‌ తీసుకున్నాడు. సిమ్‌కార్డులు మార్చేస్తూ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తిరిగినట్లు తెలిసింది. ఎన్నిసార్లు మకాం మార్చేసినా పోలీసులు సమీపిస్తుండటంతో చల్లా బాబుతో పాటు టీడీపీ మూకల్లో ఆందోళన తలెత్తింది.
చదవండి: నరం లేని నాలుక.. సీపీఐ మరీ దయనీయంగా..

ఈ నేపథ్యంలో తనపై నమోదైన 7 కేసుల్లో బెయిల్‌ కోరుతూ చల్లా బాబు హైకోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం మూడు కేసుల్లో బెయిల్‌ నిరాకరించింది. ఇక తిరగలేక, తప్పించుకోలేక చల్లా బాబు సహా 67 మంది నిందితులు సోమవారం పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వారికి మద్దతుగా టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, దొరబాబు, సుగుణమ్మ తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొద్దిసేపు పోలీస్‌స్టేషన్‌ వద్ద నినాదాలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. కాగా, ఆదివారం రాత్రి పుంగనూరుకు చెందిన సద్దామ్‌ హుస్సేన్, ఇమ్రాన్, ఫయాజ్, షామీర్, నూరుల్లాను రిమాండ్‌కు పంపించారు. 

పూచీకత్తు సమర్పించిన దేవినేని ఉమా
మదనపల్లె: అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో బెయిల్‌ పొందిన టీడీపీ నేత దేవినేని ఉమా సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో రూ.2 లక్షల బాండ్, ఇద్దరు జామీనుదారులను పూచీకత్తుగా సమర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement