టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాడి జరిగిందా! ఆయనపై హత్యాయత్నం జరిగిందా? అది నిజమే అయితే కచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందే. కాని అందుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ అన్న ప్రశ్న వస్తుంది. అంగళ్లు గ్రామం వద్ద, పుంగనూరు పట్టణం వద్ద జరిగిన గొడవలలో రెచ్చగొట్టిందే చంద్రబాబు అయితే, చిత్రంగా ఆయన తనపై హత్యాయత్నం జరిగిందని అంటున్నారు. తనకు రాళ్ల దెబ్బలు తగలకుండా ప్రత్యేక రక్షణ బృందం బుల్లెట్ ఫ్రూఫ్ షీట్ పెట్టిందట.
ఇవన్ని నిజమే అయితే ఈపాటికి..
సెక్యూరిటీ గార్డు అధికారి చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చంద్రబాబుపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పారట. ఇవన్ని నిజమే అయితే ఈపాటికి ఏమి జరిగి ఉండాలి. చంద్రబాబు ముందుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేసి ఉండేవారు. చంద్రబాబుపై ఎవరైనా రాళ్లు విసిరి ఉంటే ఆయన రక్షణకు ఉన్న ప్రత్యేక గార్డుల టీమ్ తగు చర్య తీసుకోవడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండేది. చంద్రబాబు తత్వానికి ఏ మాత్రం అవకాశం దొరికినా, అక్కడే సీన్ క్రియేట్ చేసి ఉండేవారు. వాహనం దిగి రోడ్డుపైనే బైఠాయించేవారు. తనపై హత్యాయత్నం జరిగిందని గగ్గోలు పెట్టేవారు. కాని ఇవేవి చేయకుండానే ఆయన తన దారిన తాను వెళ్లిపోయారు.
ఒకసారి గతం చూస్తే..
ఒకసారి గతంలోకి వెళ్లండి.. ఒక సందర్భంలో తిరుపతి విమానాశ్రయంలో పోలీసులు ఆయనను నిలుపుదల చేశారు. అప్పుడు ఆయన అక్కడే కూర్చుని హడావుడి చేశారు. అలా ఒకసారి కాదు.. ఆయన ప్రతిపక్షంలో ఉంటే అనేకసార్లు గందరగోళాలు సృష్టిస్తారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమం టైమ్‌లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారం నుంచి తప్పించుకునేందుకు బాబ్లి ప్రాజెక్టు అనే చిన్న ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ మహారాష్ట్రకు వెళ్లి గందరగోళం సృష్టించే యత్నం చేశారు.
చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి!
ఈ ప్రశ్నకు సమాధానం ఉందా?
అప్పుడు అక్కడి పోలీసులు చంద్రబాబును, ఆయనతో వెళ్లినవారందరిని అరెస్టు చేసి ఒక చోట నిలుపుదల చేశారు. తదుపరి ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వీరిని ప్రత్యేక విమానంలో ఏపీకి రప్పించారు.ప్రాజెక్టులకు సంబంధించి ఒక యాత్రను చేపట్టిన ఆయన ఆ పని చేసుకోకుండా రోడ్ షోలకు ఎందుకు దిగారో ముందుగా చెప్పాల్సి ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారుల కథనం ప్రకారం అంగళ్లు, పుంగనూరులలో ఆయన నిర్దిష్ట రూట్ మాప్‌ను పాలో కాలేదట. ప్రాజెక్టులు చూసి వెళ్లిపోకుండా ఆయా చోట్ల సభలు జరిపే యత్నం చేశారు.
దాడులు చేసేలా పురిగొల్పి..
ఆ క్రమంలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైసీపీ వారిపైన, అలాగే పోలీసులపైన దాడులు చేసేలా పురిగొల్పారు. అంగళ్లు వద్ద కార్యకర్తలు ఆయనను చూస్తూ వాహనం వైపు ఉన్నారు. కాని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దాడులు చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వగానే వారిలో పలువురు ఆ ప్రకారమే చేసేశారు. అంగళ్లు వద్ద రైతులు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. వారితో పాటు వైసీపీ వారు కూడా కొందరు ఉండవచ్చు. వారంతా కలిపి నలభై మంది కూడా లేరు. చంద్రబాబు రోడ్ షో లో ఒకటి, రెండువేల మంది ఉండవచ్చు. వారంతా దాడులకు పాల్పడితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఊహించుకోవచ్చు.
మళ్లీ ఏమి ఎరగనట్లు..
రైతులు నిరసన తెలపడం తనకు ఇష్టం లేకపోవచ్చు. వారు అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేకే అలా అనుచితంగా వ్యవహరించారనుకోవల్సి వస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టులకు ప్రభుత్వం చర్యలు చేపడితే వాటిని అడ్డుకుంది చంద్రబాబు, ఆయన పార్టీవారా?కాదా? మళ్లీ ఏమి ఎరగనట్లు ఆ ప్రాజెక్టులు చూడడానికి వెళ్లడం ఏమిటి?. దానిపై ఎవరూ ప్రశ్నించరాదా? అదే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే చంద్రబాబు, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియాలు ఏమని అంటున్నాయి?. ప్రజలంతా నిలదీస్తున్నారని, నిరసన తెలుపుతున్నారని ప్రచారం చేస్తున్నారా? లేదా? అదే చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అలా ఎలా వస్తారని అడుగుతున్నారు. ఇలా టీడీపీ, అనుబంధ మీడియా డబుల్ గేమ్ ఆడుతోంది.
బాబు కొత్త పాట..
గతంలో తిరుపతిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ వారు ఏకంగా రాళ్ల దాడికి దిగితే అదంతా పోరాటం అని చెప్పారు కదా! అప్పట్లో బీజేపీ ఏపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణపై అనంతపురంలో నిజంగానే దాడి చేశారు కదా! అవన్ని ఎందుకు?. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తే చంద్రబాబు నాయుడు ఏమి చేశారో గుర్తు లేదా?. ఆయనకు స్వాగతం చెప్పకపోగా, ఎందుకు వచ్చావంటూ నిలదీస్తూ దీక్షలు చేశారు. మోదీకి నల్లబెలూన్లు ఎగరవేసి నిరసన చెప్పారు. అది సరైనదేనా? ప్రధాని భద్రతకు అది ప్రమాదం కాదా?. ఇప్పుడు తనపై దాడి జరగకపోయినా, ఏకంగా హత్యాయత్నం జరిగిందని కొత్త పాట ఎత్తుకున్నారు.
చంద్రబాబు కాదనగలరా?..
చంద్రబాబు చేసిన ప్రసంగాలు, రెచ్చగొట్టిన సన్నివేశాల వీడియోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని విచారించిన తర్వాతే పోలీసులు చంద్రబాబుపై కేసు పెట్టారు. ఆ వెంటనే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్యాయం అంటూ ఆక్రోశం పెట్టారు. అంతే తప్ప, తాను బూతులు తిట్టలేదని, ఎవరిని రెచ్చగొట్టలేదని చెప్పలేకపోయారు. ఒక డీఎస్పీని బట్టలూడదీసి వెళ్లు అని చంద్రబాబు అన్నారా?. లేదా? అది అవమానించడం కాదా?. రాయలసీమ పర్యటన అంతా ముఖ్యమంత్రి జగన్ ను, వైసీపీ కార్యకర్తలను తిట్టడానికి, టీడీపీ వారిని రెచ్చగొట్టడానికే చేశారు. పుంగనూరు వద్ద దానిని మరింత తీవ్రం చేసి ఏకంగా పోలీసు వాహనాలనే దహనం చేసేవరకు తీసుకువెళ్లారు. వాటిని చంద్రబాబు కాదనగలరా?.
కనీసం సానుభూతి కూడా చెప్పలేదే?..
గతంలో తుని వద్ద కాపు రిజర్వేషన్ ఉద్యమకారులు ఒక రైలును దగ్దం చేస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రతిపక్షంపై ఎన్ని విమర్శలు చేశారు?. ఎన్ని ఆరోపణలు చేశారు. రాయలసీమ రౌడీలని, గూండాలని ఇలా ఏవేవో చెప్పారు. కాని పుంగనూరు వద్ద ఆయన కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాలను దహనం చేస్తుంటే ఎందుకు వారించలేదు? పోలీసులపై దాడులు చేసేలా టీడీపీ కార్యకర్తలను ఆయనే ప్రేరేపించారన్నది అభియోగం. ఈ దాడులలో 27 మంది పోలీసులకు గాయాలయిన మాట అవాస్తవమా? ఒక కానిస్టేబుల్ కన్ను పోయిన ఘటన గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోయారు. కనీసం సానుభూతి కూడా చెప్పలేదే?. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధ్వంసాలకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.
సవాళ్లు గుర్తు లేదా?
ఘటన జరిగిన ప్రాంతంలో మొత్తం ఐదువేల సిమ్ కార్డులు ఉన్నాయని, అందులో రెండు వేల సిమ్‌లు స్థానికులవి కావని చెబుతున్నారు. ఇప్పటికే ఎనభై మంది వరకు అరెస్టు అయ్యారు. ముఖ్యమంత్రిని పట్టుకుని ఎన్నిసార్లు తన్నుకుందాం.. రా.. అని చంద్రబాబు కాని, ఆయన కుమారుడు కాని సవాళ్లు చేశారో గుర్తు లేదా?. అలా ఒక సీనియర్ నేత మాట్లాడవచ్చా? చంద్రబాబు ఇంతకాలం తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా తనను ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమాతోనే ప్రవర్తించారు. కాని ఎప్పుడో అప్పుడు పరిస్థితి ఎదురు తిరుగుతుంది. అరాచకంగా ప్రవర్తించేవారిపై చర్య తీసుకునే అధికారులు కూడా వస్తారని ఇప్పుడు అర్దం అయి ఉండాలి.
అదేదో రెడ్ బుక్ పెట్టుకుని..
ప్రభుత్వ విధానాలపై , లోటుపాట్లుపై విమర్శలు చేయవచ్చు. అలాకాకుండా అచ్చంగా బూతులు తిట్టుకుంటూ, పోలీసులపై విరుచుకుపడుతూ మీ అంతు చూస్తా.. అంటూ బెదిరిస్తూ యాత్రలు చేయడం చంద్రబాబు, లోకేష్ లకు అలవాటైంది. లోకేష్ అయితే అదేదో రెడ్ బుక్ పెట్టుకుని అందరి పేర్లు రాసుకుంటున్నారట. అధికారం వస్తే అందరి సంగతి చూస్తారట. మరి అధికారం రాకపోతే ఆ రెడ్ డెయిరీని ఏమి చేస్తారో తెలియదు. ఇక జగన్‌కు అధికారం పిచ్చివాడి చేతిలో రాయి అని చంద్రబాబు అన్నారు. నిజానికి అది ఆయనకే వర్తిస్తుందని చెప్పాలి. తనకు అధికారం ఉందని చెప్పి గోదావరి పుష్కరాలలో తన కుటుంబ స్నానం కోసం గేట్లు మూయించి తొక్కిసలాటకు కారణమయ్యారు. ఫలితంంగా ఇరవైతొమ్మిది మంది మరణించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే..
తమిళ కూలీలు 20 మందిని తిరుమలలో ఎన్ కౌంటర్ చేసింది ఆయన ప్రభుత్వంలోనే. రాజధాని పేరుతో ముప్పైవేల ఎకరాలు సేకరించి అటు రైతులను, ఇటు ఏపీ ప్రజలను గందరగోళంలోకి నెట్టి రాజధాని అనే భ్రమరావతిని సృష్టించింది ఆయనే. ఇలాంటి వాటిని కదా?. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి అధికారాన్ని వాడారని చెప్పాల్సింది. జగన్ అధికారంలోకి వచ్చాక తన మానిఫెస్టో అమలు చేయడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుందా? చంద్రబాబు తన మానిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తొలగించడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుందా? లక్ష కోట్ల రూపాయల రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని అబద్దపు హామీ ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి.
ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే...
చంద్రబాబు కేవలం అక్కసుతో, ఈర్ష్యతో జగన్‌పై నోరు పారేసుకుంటున్నారు. ఆయనకు ఈనాడు, తదితర టీడీపీ మీడియా తాన అంటే తందానా అని వంతపాడుతున్నాయి. అదే చంద్రబాబుకు పెద్ద ప్రమాదం అవుతుంది. వారిని నమ్మే ఇప్పుడు చంద్రబాబు హత్యాయత్నం కేసులో చిక్కుకున్నారు. చంద్రబాబును నమ్మి టీడీపీ కార్యకర్తలు జైళ్ల పాలయ్యారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే, పద్దతులు మార్చుకుంటే వారికే మంచిది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment