‘నారా’జకీయం: అటు పుంగనూరులో.. ఇటు తుక్కులూరులో.. | Chandrababu Naidu And Nara Lokesh Violence Politics In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

‘నారా’జకీయం: తండ్రి పుంగనూరులో.. కొడుకు తుక్కులూరులో..

Published Fri, Aug 25 2023 7:15 PM | Last Updated on Fri, Aug 25 2023 8:18 PM

Chandrababu And Lokesh Violence Politics In Ap - Sakshi

‘హింసే అజెండా. దాడులతో పేట్రేగిపోవడమే సిద్ధాంతం. ఎక్కడికక్కడ రచ్చ రాజేసి అరాచకం సృష్టించడమే లక్ష్యం. ఏం చేసి అయినా.. ఎంత హింస రాజేసి అయినా.. వార్తల్లో కెక్కాలన్నదే ఆలోచన. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోన్న విధ్వంస రాజకీయం. విద్వేషాలు రగులుస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. శాంతి భద్రతలను దెబ్బ తీసి పైశాచికానందం చూస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఎన్ని వెధవ్వేషాలు వెయ్యాలో అన్ని వేషాలూ వేస్తున్నారు. సరికొత్త రాకాసి సంస్కృతిని రాజకీయాల్లోకి తెచ్చి విలువలకు పాతరేస్తున్నారు.‘

ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయ్యింది. ఇంత కాలం తర్వాత ప్రభుత్వం పట్ల జనం వ్యతిరేకతతో  ఉండాలని ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు. కానీ  ఎక్కడా అసంతృప్తి లేకపోవడం ఆయనకు నచ్చలేదు. నాలుగున్నరేళ్ల తర్వాత అయిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి జనం బ్రహ్మరథం పడతారులే అని ఆయన అంచనా వేసుకున్నారు. కానీ అలాగా జరగలేదు. ఇప్పటికీ టీడీపీని జనం తిరస్కరిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తుగా ఓడించడం ద్వారా ప్రజలు టీడీపీని దూరం పెట్టేశామని చాటి చెప్పారు.

జనం దూరం అయిపోతే 2024 ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే పరిమితం కావల్సి వస్తుందన్న ఆలోచనే చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అందుకే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పక్కన పెట్టి సరికొత్త గూండా రాజకీయాలను తెరపైకి తెచ్చారు.

మొన్నటికి మొన్న పుంగనూరులో చంద్రబాబు తన స్వీయ దర్శకత్వంలో ఎంతటి హింస రాజేశారో అంతా చూశారు. చంద్రముఖిగా మారిన చంద్రబాబు వదనాన్నీ చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడికెళ్లినా తమ సభలకు ర్యాలీలకు జనం రాకపోతే.. స్పందన లేకపోతే.. మీడియాలో ప్రచారం దొరకదు కాబట్టి వార్తల్లోనే ఉండాలంటే విధ్వంసాలతో దూసుకుపోవడం ఒక్కటే మార్గమని చంద్రబాబు భావిస్తున్నట్లుందంటున్నారు పాలక పక్ష నేతలు.

చంద్రబాబు నాయుడి రోడ్ షోలకు జనం రావడం లేదు. బహిరంగ సభల్లో జనం ఉండడం లేదు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో యాత్ర చేసుకుపోతూ ఉంటే ఊళ్లల్లో జనం ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు తప్ప లోకేష్‌యాత్రను వీక్షించడం లేదు. జనం ఇలా తమని వెలి వేసేశారన్న కోపమో కడుపు మంటో తెలీదు కానీ  జనాన్ని కూడా వదలకూడదనుకున్న టీడీపీ నాయకత్వం ఆదేశాలతో లోకేష్ యాత్ర ఎక్కడికెళ్లినా రెచ్చగొట్టే తిట్ల పురాణాలు.. దాడులతో పేట్రేగిపోతున్నారు.

ఏలూరు జిల్లాలో లోకేష్‌ పాదయాత్రలో టీడీపీ శ్రేణులు వీధిరౌడీల్లా వ్యవహరించారు. పాదయాత్ర మార్గంలో ఉన్న ఇళ్లపై రాళ్లతో దాడులు చేశారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు టీడీపీ గుండాలు. చెవులు చిల్లులు పడేలా డీజే పాటలు పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చొగొట్టేలా వ్యవహరించారు. సౌండ్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన వైఎస్సార్‌సీపీ నేత విజయ్ కుమార్.. ఇంటిపై రాళ్లు రువ్వారు టీడీపీ శ్రేణులు. 

లోకేష్‌ ఆదేశాలతో రెచ్చిపోయిన పచ్చ పార్టీ కార్యకర్తలు వైసీపీ నేత విజయ్‌కుమార్‌ ఇంటిపై రాళ్ల దాడి చేశారు.. పచ్చ గూండాల దాడిలో వైసీపీ నేత ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.. అంతటితో ఆగకుండా, పక్కనే రోడ్డుపై నిల్చుని వున్న వైసీపీ కార్యకర్తలపైనా రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, మూడు బైక్‌లు ధ్వంసమయ్యాయి.

యువగళం అరాచకాన్ని చిత్రీకరిస్తున్న పలువురు మీడియా ప్రతినిధులపైనా పచ్చ గూండాలు దాడికి తెగబడ్డారు.. మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కున్నారు.. అడ్డొచ్చిన రూరల్‌ కానిస్టేబుల్‌పైనా దాడి  చేశారు.. అయితే, పోలీసులు స్పందించి టీడీపీ కార్యకర్తల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ శ్రేణులను చెదరగొట్టారు.

దీనికి ముందు రోజు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలోనూ  లోకేష్‌యాత్రలో టీడీపీ శ్రేణులు ఇలాగే  దాడికి దిగాయి. గ్రామంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి

నాన్న పుంగనూరు లో హింస ఎలా చేయాలో  చూపిస్తే తనయుడు లోకేష్  ఏక సంథాగ్రాహిలా దాన్ని అంది పుచ్చుకుని తండ్రికి మించిన తనయుడిల విద్వేషాలు.. విధ్వంసాలతో వికటాట్టహాసం చేసుకుపోతున్నారు. ఇటువంటి హింసా రాజకీయాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకోలేరని  రాజకీయ పండితులు అంటున్నారు. ఇటువంటి గూండాగిరీ వ్యవహారాలను ప్రజలు ఏవగించుకుంటారని ఎన్నికల్లో  ఇంతకు ఇంత గుణపాఠం చెబుతారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

::: సీఎన్‌ఎస్‌ యాజులు
సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement