
క్లిక్ చేస్తే అమూల్ పాలు!
♦ త్వరలో యాప్ అందుబాటులోకి
♦ అన్ని ఉత్పత్తులూ ఆర్డరివ్వొచ్చు
♦ అహ్మదాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డెయిరీ దిగ్గజం అమూల్... దేశంలో తొలిసారిగా యాప్ ద్వారా పాల ఉత్పత్తుల్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతానికి అహ్మదాబాద్‌లో ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని అందిస్తోంది. త్వరలో వాణిజ్య పరంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. అమూల్ తాజా పాలను విక్రయిస్తున్న నగరాల్లో దశలవారీగా యాప్ సర్వీసులను పరిచయం చేయనున్నట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. రూ.5 లక్షల కోట్ల భారత మిల్క్ మార్కెట్లో మిగిలిన బ్రాండ్లు కూడా అమూల్‌ను అనుసరించే అవకాశం లేకపోలేదు.
మార్కెట్లో సంచలనం..
ప్రస్తుతం దేశంలో ఏ కంపెనీ కూడా ఆన్‌లైన్‌లో తాజా పాలను విక్రయించడం లేదు. ఎక్కువ రోజులు మన్నిక ఉండే టెట్రా ప్యాక్ పాలను మాత్రమే అమెజాన్, బిగ్‌బాస్కెట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు అమ్ముతున్నాయి. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న యాడ్రోబ్‌దీ ఇదే స్థితి. ఐస్‌క్రీం, నెయ్యి, పెరుగు, చీజ్, పాల పొడి వంటివి కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. హైదరాబాద్‌లో రోజుకు 25 లక్షల లీటర్ల పాలకు డిమాండుంది. ఇక్కడ అమూల్ 1.50 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలను విక్రయిస్తోంది. యాప్ అందుబాటులోకి వస్తే అమ్మకాలు ఊహించని స్థాయికి చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పాల విపణి విలువ రూ.5 లక్షల కోట్లుంది. అమూల్ ప్రస్తుతం ఐస్‌క్రీం, పెరుగు, నెయ్యి, వెన్న, స్వీట్లు, చాకొలేట్లు, పనీర్, ఫ్లేవర్డ్ మిల్క్, మజ్జిగ వంటివి... అమూల్ బూత్‌లతో పాటు దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా రిటైల్ దుకాణాల ద్వారా అందిస్తోంది. అహ్మదాబాద్‌లో ఈ యాప్‌ను పరీక్షిస్తున్నట్టు అమూల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ ఆర్.ఎస్.సోధి వెల్లడించారు.
లక్ష్యాన్ని మించి టర్నోవర్..
అహ్మదాబాద్‌కు చెందిన ఇన్ఫిబీమ్ సంస్థ ఈ యాప్‌ను అభివృద్ధి చేయటంతో పాటు డెలివరీ బాధ్యతనూ తీసుకుంది. కస్టమర్ ఆర్డరు చేసిన ఉత్పత్తులను సమీపంలో ఉన్న డీలర్ లేదా దుకాణం నుంచి సరఫరా చేస్తారు. ప్రస్తుతం అమూల్ టర్నోవర్‌లో ఆన్‌లైన్ వాటా 1 శాతం లోపే ఉండగా ఆదాయంలో 7 శాతం మాత్రమే మోడర్న్ ట్రేడ్ ద్వారా సమకూరుతోంది. అమూల్ నిజానికి 1998-99లోనే ఈమెయిల్ ద్వారా ఆర్డర్ తీసుకుని సరఫరా చేయటం మొదలెట్టింది. కానీ ఇంటర్నెట్ విస్తరణ లేకపోవటంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. ఇపుడు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ విసృ్తతి అధికంగా ఉండటంతో ఈ సేవలు వేగంగా పెరుగుతాయని సంస్థ అంచనా వేస్తోంది.