ఆన్‌లైన్‌లో టపాసులు!
- దీపావళి సందర్భంగా విక్రయాలు
- కోరుకున్న టపాసులు ఆర్డర్ చేసే అవకాశం
- అందుబాటులో ఆఫర్లు
- పేమెంట్ విషయంలో జాగ్రత్త!
తిరుపతి గాంధీరోడ్డు : దీపావళి వస్తుందంటే చాలు చిన్నా పెద్దా ఆనందంలో మునిగిపోతారు. టపాసుల కోసం దుకాణాలకు పరుగులు తీస్తారు. వాటిని తీసుకొచ్చి కాల్చి ఎంజాయ్ చేస్తారు. అయితే టపాసుల కోసం ఇప్పుడు దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే చాలు.. ఆర్డర్ చేసిన 24 గంటల్లోనే మీరు కోరుకున్న టపాసులు మీ ఇంటికి చేరుతాయి. ఆన్‌లైన్‌పై అవగాహన ఉన్న వారు ఈ తరహా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. సమయం ఆదాతో పాటు అనేక రకాల టాపాసులను తీరిగ్గా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
గిఫ్ట్ ప్యాక్‌లలో...
ఆప్తులు, శ్రేయోభిలాసులకు గిఫ్టుగా పంపాలంటే ఆన్‌లైన్ ద్వారానే సాధ్యమౌతుంది. రూ.500 మొదలుకొని రూ.5000 పైబడి గిఫ్ట్‌ప్యాకులు అందుబాటులో ఉన్నా యి. హైదరాబాద్ జంట నగరాల్లో 12 లేదా 24 గంటల్లోపే డెలివరీ చేస్తున్నారు. ప్రముఖ కంపెనీలు ఏ ప్రాంతానికైనా సరఫరా చేస్తున్నాయి.
ముందుగా వచ్చిన ఆర్డర్లకు ఆఫర్లు
దీపావళి దగ్గర పడుతుండడంతో ఆన్‌లైన్‌లో వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. పలువురు డిస్కౌంట్లు ప్రకటిస్తుండగా మరికొందరు ఆఫర్ కింద టపాసులు అదనంగా ఇస్తున్నారు. టపాసులే కాక దీపావళి గిఫ్ట్, దివాలీ స్వీట్స్ ప్యాక్‌లను డిస్కౌంట్ ధరల్లో వినియోగదారులకు అందజేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో కొంటున్నారా? అయితేజాగ్రత్త..!
ఆన్‌లైన్‌లో టపాసుల విక్రయం దీపావళి సందర్భంలోనే ఉంటుంది. అయితే ఆర్డర్ ఇచ్చే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొందరు అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. మరికొం దరు బ్లాగ్ స్పాట్‌లు ఏర్పరుచుకుని ఆర్డర్లు కోరతారు. ఇలాంటి సమయంలో ఆచీతూచి వ్యవహరించాలి. ముఖ్యంగా అప్పటికప్పుడు పుట్టుకొచ్చే ఆన్‌లైన్ స్టోర్స్‌లో కార్డు ఉపయోగించడం, నెట్‌బ్యాంకింగ్ ద్వారా డబ్బు చెల్లించడం అంత మంచిదికాదు. ఆన్‌లైన్ కొనుగోలు సమయంలో స్క్రీన్ పై ఉన్న విర్చువల్ కీబోర్డును ఉపయోగిస్తే కొంత వరకు సేఫ్. ఇలాంటి వాటిల్లో క్యాష్ ఆన్ డెలివరీకి మొగ్గుచూపాలి.
చాలా సులభం
ఒకప్పుడు అంగడికి వెళ్లి టపాసులు కొనేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా సులభంగా ఆర్డర్ చేస్తే టపాసులు ఇంటికి వస్తున్నాయి. మా మేనకోడలు కడప దగ్గర మైదుకూర్‌లో ఉంది. తనకోసం ఆన్‌లైన్‌లో టపాసులు బుక్ చేశాను. పండుగ లోపల తనకు చేరుతాయి. ఈ పద్ధతి ఎంతో బాగుంది.
- ఏ.సంధ్య, తిరుపతి
టపాసులు పంపించేశా
రాజస్థాన్‌లో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నా... పండుగకు సెలవు లేదు. సరదాగా నెట్ చూస్తుంటే కొన్ని ప్రముఖ సైట్లు కన్పించాయి. అందులో చూసి జైపూర్ నుంచి టపాసులు బుక్ చేశాను. తీరా బుక్ చేశాక నా సెలవు మంజూరైంది. దీపావళి నాకు ముందే వచ్చింది అనుకున్నా... టపాసులు నాకన్నా ముందే ఇంటికి వచ్చేశాయి.
- సురేంద్రబాబు, తిరుపతి
టపాసులు లభించే సైట్లు
http://www.buyonlinecracers.in/
http://www.store.patakawala. com/
http://www.143gifts.com/
http://www.sivakasifireworks.in/