‘నీట్’ చిక్కుముడులు | editorial on supreme court order on NIIT | Sakshi
Sakshi News home page

‘నీట్’ చిక్కుముడులు

Published Sat, Apr 30 2016 2:11 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

‘నీట్’ చిక్కుముడులు - Sakshi

‘నీట్’ చిక్కుముడులు

ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకుని వైద్య విద్యా కోర్సుల్లో చేరాలనుకున్న విద్యా ర్థులకు ఇది నిజంగా పరీక్షా కాలం. ఏడాదంతా చదువుకుని వేర్వేరు ప్రవేశ పరీక్షలు రాసిన, రాయబోతున్న లక్షలాదిమంది విద్యార్థులు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)పై సుప్రీంకోర్టు గురు, శుక్రవారాల్లో వెలువరించిన తీర్పులతో అయో మయంలో పడ్డారు. 11నాటి తీర్పు ఫలితంగా నీట్ నిర్వహణ కోసం 2010లో జారీ అయిన నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిందని...కనుక ఈ ఏడాది నీట్ పెట్టి తీరాల్సిందేనని గురువారం అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టంచేసింది. 

మే1న నీట్ నిర్వహించాలని...అందులో పాల్గొనలేని వారికోసం జూలై 24న మరో పరీక్ష పెట్టాలని ఆ తీర్పులో తెలిపింది. ఇప్పటి కిప్పుడు పరీక్షంటే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని, కనుక మే 1 జరగబోయే పరీక్ష రద్దుచేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని శుక్రవారం ధర్మాసనం తోసిపుచ్చింది. రెండు పరీక్షలూ ఉండాల్సిందేనని చెప్పింది. గురువారం నాటి తీర్పులో సవరణలు అవసరమో కాదో తర్వాత నిర్ణయిస్తామన్నది.

అదేం శాపమో... నీట్ మొదలైనప్పటినుంచీ అది వివాదాల్లోనే చిక్కుకుం టున్నది. తొలిసారిగా 2012లో పరీక్ష నిర్వహించినప్పుడు సైతం నీట్ రాయాలా, వద్దా అని విద్యార్ధులు సంశయంలో పడ్డారు. ఎవరికేది ఇష్టమైతే అది రాసుకోవ చ్చునని సుప్రీంకోర్టు చివరకు తేల్చిచెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. నీట్ రాజ్యాంగ విరుద్ధమంటూ 2013 జూలైలో 2-1 మెజారిటీతో వెలువడిన తీర్పుతో సమస్య తీరిందనుకున్నారు. కానీ దాన్ని వెనక్కు తీసుకుంటున్నామని  జస్టిస్ దవే నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈనెల 11న తేల్చి చెప్పింది. దానికి కొనసాగింపుగానే గురువారంనాటి తీర్పు, శుక్రవారంనాటి వివరణా వెలువడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలనూ తప్పుబట్టాలి.

తగినంత వ్యవధి లేదు గనుక ఈసారి మాత్రం నీట్ నిర్వహణ సాధ్యంకాదని తీర్పు వెలువడటానికి ముందే కేంద్రం చెప్పి ఉండాల్సింది. వేర్వేరు సెట్లలో తలమునకలై ఉన్న రాష్ట్రాలు కూడా ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆత్రుత కనబరిచి, ఈ వ్యవహారంలో తమను కూడా పిటిషనర్లుగా చేర్చాలని ముందే కోరవలసింది. రెండు వైపులా అలా జరగలేదు. తీర్పు వెలువడ్డాక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాదినుంచి మాత్రమే అది వర్తిస్తుందన్నట్టు మాట్లాడింది. సీబీఎస్‌ఈ నేతృత్వంలో ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్(పీఎంటీ) మే 1న నిర్వహిం చాలని నిర్ణయించి గత డిసెంబర్‌లోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీతోసహా దేశంలోని కొన్ని వర్సిటీలు ఇప్పటికే అలాంటి ఎంట్రెన్స్‌లు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ శుక్రవారం ఎంసెట్ నిర్వహించింది. తెలంగాణ వేరే కారణంతో  వాయిదా వేసింది గానీ లేనట్టయితే మే 2న అక్కడ కూడా ఎంసెట్ జరిగేది.
 
వాస్తవానికి నీట్ నిర్వహణ బాధ్యతను ఎంసీఐకి అప్పగిస్తూ ఎంసీఐ చట్టానికి తలపెట్టిన సవరణల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల మే 1న సీబీఎస్‌ఈ నిర్వహించే ప్రీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ ‘నీట్’ అవుతుంది. జూలై 24న నిర్వహించాల్సిన రెండో దఫా పరీక్షను మాత్రం ఎంసీఐ నిర్వహిస్తుంది. ఇందువల్ల ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది. మే 1న నీట్ రాయబోయే విద్యార్ధులకు డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైనప్పుడే ఆ పరీక్ష స్వరూపస్వభావాలూ, ప్రశ్న పత్రం నమూనా వగైరాలన్నీ తెలిశాయి. అందుకనుగుణంగానే వారు నాలుగు నెలలుగా ఆ పరీక్షకు సంసిద్ధులవుతున్నారు. జూలైలో రాయబోయేవారికి మాత్రం మరికొన్ని రోజుల తర్వాత విడుదలయ్యే నోటిఫికేషన్ తర్వాతగానీ ఆ పరీక్ష తీరుతెన్నులు తెలిసే అవకాశం లేదు. తెలిశాక వారికుండే వ్యవధి మహా అయితే రెండు నెలలు మాత్రమే.

ఇప్పటికే ఆయా రాష్ట్రాల సెట్‌లు రాసినవారికీ, రాయబో తున్నవారికీ నీట్ అదనపు భారం. అంతేకాదు...తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు అసలు ఏ సెట్‌లూ లేకుండా ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తు న్నాయి. అలాంటి రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇప్పటికిప్పుడు అత్యవసరంగా సెట్‌లకు సంసిద్ధులు కావలసివస్తుంది. అసలు రాజ్యాంగ అధికరణ 371(డీ)కింద ప్రత్యేక కేటగిరీలోకొచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాల విద్యార్థులు నీట్ పరిధిలోకి వస్తారో, రారో సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. నీట్ పరిధిలోకి వారూ వస్తారని పార్లమెంట్‌లో కేంద్రం వివరణనిచ్చినా న్యాయస్థానం నుంచి ఆ మేరకు స్పష్టత వస్తే తప్ప అది ఆఖరి మాట కాదు.

ఇప్పటికే సెట్‌లు పూర్తయిన రాష్ట్రాలకూ, అలాంటి సెట్‌లే లేని రాష్ట్రాలకూ ఈసారికి మినహాయింపునివ్వాలన్న పిటిషన్లపై ఈరోజే తీర్పు వెలువరిద్దామ నుకున్నా అయిదుగురు న్యాయమూర్తులూ కలవడం సాధ్యంకాకపోవడంతో అది కాస్తా వాయిదా పడింది. ‘ముందు నీట్ జరగనీయండి... ఆ సంగతి తర్వాత చూద్దామ’ని జస్టిస్ ఏఆర్ దవే చెప్పారు. కనుక ఎంసెట్‌లు రాసినవారూ, రాయ బోతున్నవారూ, అసలు ఎలాంటి సెట్‌ల బెడదా లేనివారూ నీట్ రాయక తప్పదు. అంతేకాదు ఇప్పటికే తాము రాసిన సెట్‌లు బుట్టదాఖలవుతాయో, పనికొస్తాయో కూడా వారికి తెలియదు.

వైద్య విద్యా కోర్సుల్లో ప్రమాణాలు పెరగడం అవసరమే. ప్రైవేటు విద్యా సంస్థల సీట్లు కేటాయింపుల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్న మాటా వాస్తవమే. మెడిసిన్ చదవగోరే విద్యార్థి అనేక టెస్ట్‌లు రాయక తప్పనిస్థితి కూడా నిజమే. కానీ ఇలా ఆదరాబాదరగా... ఇంతటి అయోమయ పరిస్థితుల్లో ఈ ఏడాదే కొత్త విధానాన్ని ప్రారంభించాలా? ఎయిమ్స్, జిప్‌మర్‌వంటి సంస్థలు నీట్ పరిధిలోకొస్తాయో, రావో...హిందీ భాషలో ప్రశ్నపత్రం రాసేవారితో సమానంగా ప్రాంతీయ భాషల్లో రాసే విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందో, ఉండదో తేల్చకుండానే నీట్ జరిగితీరాలా? సర్వోన్నత న్యాయస్థానం ఆలోచించాలి. అందరికీ సమన్యాయం చేకూరేలా చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement