సాక్షి,ముంబై: అక్రమ టెలిఫోన కనెక్షన్ల స్కాం లో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్‌లకు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్ కనెక్షన్ల స్కాంకు సంబంధించి మారన్ బ్రదర్స్ కళానిధి మారన్, దయానిధి మారన్‌లను స్పెషల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సీబీఐ సవాల్ చేసింది.
మారన్ బ్రదర్స్‌కు విముక్తి కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్‌లో మారన్ బ్రదర్స్ సహా మరో ఏడుగురిని విడుదల చేసిన మూడు నెలల్లో (మార్చి, 14) సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ జి జయచంద్రన్ జూన్20న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏడుగురు నిందితులకు నోటీసులు జారీ చేశారు.
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ ఉన్న సమయంలో తన అన్న కళానిధి మారన్ సారథ్యంలోని సంస్థలకు చట్టవిరుద్ధంగా వందల సంఖ్యలో టెలిఫోన్ కనెక్షన్లు కేటాయించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి .దయానిధి మారన్ తన ఇంట్లో ఓ ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. 764 టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సన్ టీవీ డేటాను చట్టవిరుద్ధంగా అప్‌లింక్ చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా చేయడం వల్ల చెన్నైలోని బీఎస్ఎన్ఎల్, ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్‌లకు రూ.1.78 కోట్లు నష్టం వాట్లినట్టు సీబీఐ ఆరోపించింది. బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ జీఎం బ్రహ్మనాథన్, మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంపీ వేలు స్వామి, దయానిధి వ్యక్తిగత కార్యదర్శి గౌతం ఇతర నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు.. ఇందులో వారిద్దరి పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ మారన్ సోదరులకు విముక్తి కల్పించిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment