చెన్నై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో బధించపడిన చిలక అని.. కేంద్రం ఎన్నికల కమిషన్, కాగ్ మాదిరి దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలో సీబీఐకి అధిక అధికారాలు, అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలి. అప్పుడే ప్రజలకు సీబీఐ మీద విశ్వాసం పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించింది.
ప్రస్తుత వ్యవస్థను సరిదిద్దడానికి తాము చేసిన 12 పాయింట్ల సూచనలలో ‘పంజరంలోని చిలుకలా ఉన్న సీబీఐని’ విడుదల చేసే ప్రయత్నం అని కోర్టు పేర్కొంది. చట్టబద్ధమైన హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ స్వయంప్రతిపత్తిని నిర్ధారించగలమని గమనించిన న్యాయస్థానం.. ‘చట్టబద్ధమైన హోదాను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి మరింత అధికారం కల్పించాలి.. దీని వల్ల సీబీఐపై ప్రభుత్వ పరిపాలనా నియంత్రణ లేకుండా క్రియాత్మక స్వయంప్రతిపత్తి కలుగుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
తమిళనాడులోని పోంజి కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ బీ పుగళేందిల ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఎలక్షన్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐ మరింత స్వయంప్రతిపత్తిగా ఉండాలి.. సీబీఐ డైరెక్టర్‌కు ప్రభుత్వ కార్యదర్శిగా అధికారాలు ఇవ్వబడతాయి.. డీఓపీటీ ద్వారా కాకుండా నేరుగా మంత్రి/ ప్రధాన మంత్రికి నివేదించాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కాగా, సంస్థలో మానవవనరుల కొరతతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించలేమని కేంద్రం పేర్కొంది. దీంతో ఈ అంశంపై నెల రోజుల్లోగా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. 1941లో ఏర్పడిన సీబీఐ.. ప్రధాన మంత్రి కార్యాలయం అధీనంలో ఉండే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ)కు బాధ్యత వహిస్తోంది. దీని డైరెక్టర్‌ను ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఎంపిక చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment