న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైస్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
సీబీఐ సమన్లు జారీ చేయటంపై స్పందించారు సిసోడియా. గతంలో సీబీఐ దాడులు చేపట్టగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే, దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ‘నా ఇంటిలో సీబీఐ 14 గంటల పాటు సోదాలు నిర్వహించింది. కానీ, ఏమీ లభించలేదు. వారు నా బ్యాంకు లాకర్‌ను సైతం తనిఖీ చేశారు. అక్కడా ఏమీ లభించలేదు. మా గ్రామంలోనూ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నేను వెళ్లి వారికి పూర్తిగా సహకారం అందిస్తాను.’ అని తెలిపారు సిసోడియా.
ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.
ఇదీ చదవండి: రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్ 12వ విడత నిధుల విడుదల
Comments
Please login to add a commentAdd a comment