విహాన్ వయసు మూడున్నరేళ్లు. తన తోటి పిల్లలు చురుకుగా ఆడుతూ, కేరింతలు కొడతూ, చిట్టిచిట్టి మాటలతో అలరిస్తుంటే తాను మాత్రం ఏమి పట్టనట్లు దిగాలుగా ఉంటున్నాడు. రోజంతా మొబైల్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. మాటలు రావడం లేదని తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళితే అసలు విషయం బోధపడింది. చిన్నప్పటి నుంచి తనకు మొబైల్ చూపించడంతో దానికి బానిసయ్యాడని తెలిసింది.
టెక్నాలజీ పెరుగుతోందని సంబరపడాలో..అది మన తర్వాతి తరాలకు శాపంగా మారబోతుందని బాధపడలో తెలియని పరిస్థితి నెలకొంది. పుట్టి ఎడాదిన్నర కావస్తున్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైలే ప్రపంచమైంది. చిట్టిపొట్టి మాటలు నేర్చుకుంటూ తాత, అమ్మమ్మలూ, నాయనమ్మలతో సంతోషంగా గడపాల్సిన బాల్యం ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు బానిసవుతుంది. గతంలో ఇంట్లో పెద్దవారు పిల్లలకు మాటలు, మంచి అలవాట్లు నేర్పుతూ కాలం గడిపేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయడంతో పిల్లలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. వివిధ కారణాల వల్ల తాతలు, అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లల వద్ద ఉండలేకపోతున్నారు. దాంతో తెలిసి తెలియక తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలను ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలుగా మారుస్తున్నారు.
పేరెంట్స్ నుంచే పిల్లలకు
కేవలం పిల్లల చేతిలోని ఫోనే కాకుండా, తల్లిదండ్రులు వాడే ఫోన్ వల్ల కూడా పిల్లలకు మాటలు రావడం లేదని ఎస్తోనియా దేశంలోని టార్టూ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్యయనం ద్వారా తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్‌ని అతిగా చూసే అలవాటు ఉంటే అది పిల్లలకూ వస్తుందట. వాళ్ల స్క్రీన్‌టైం సమయం కూడా దాదాపు ఉండటం గమనించారు. రెండు నుంచి నాలుగున్నరేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసుకుని వారి భాషానైపుణ్యాలని పరిశీలించారు. పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ రోజులో ఎంత సమయం ఫోన్‌లో గడుపుతున్నారో చూశారు. స్క్రీన్ టైమ్ అతితక్కువగా ఉన్న తల్లిదండ్రులూ, పిల్లల మధ్య భాషానైపుణ్యాలని పరీక్షించారు. ఈ తరహా పిల్లల్లో భాషానైపుణ్యాలు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’
సమయం గడపాలి
మొబైల్ ఫోన్లు చూపించడానికి బదులుగా పిల్లలతో ఎక్కవ సమయం గడిపేందుకు చొరవ చూపాలని శాస్త్రవేత్తలు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి అవుట్‌డోర్‌లో ఆడేందుకు సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి పిల్లలతో గడపాలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment