ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరాల్సిన స్టిక్కర్లు
సాక్షి, తిరుపతి : ఐదేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన పలుకరింపు కార్యక్రమం ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ అన్నచందంగా మారింది. ‘పలకరింపు– మీ చిన్నారి ఆరోగ్యం’ పేరుతో సోమవారం నుంచి ప్రారంభమైన కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. 0–5 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్లు వేశారా? లేదా? అని తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమానికి అవసరమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులు 4.67 లక్షల మంది ఉన్నారు. వీరిలో కొందరు చిన్నారులకు వ్యాక్సిన్లు వేయలేదు. వ్యాక్సిన్లు వేసుకునే సమయంలో తల్లిదండ్రులు చిన్నారులతో వేరొక చోటుకు వెళ్లటం, ముఖ్యంగా కూలీల కుటుంబాల్లో కొందరు చిన్నారులు వ్యాక్సిన్లు వేసుకోకుండా అనారోగ్యాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు అర్ధంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘పలకరింపు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇలా పలకరించాలి..
జిల్లాలో 644 ఆరోగ్య ఉపకేంద్రాలు, 104 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, మరో 14 సీఎం ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న ఏఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు, మెప్మా సిబ్బంది ప్రతి నివాసానికీ వెళ్లి ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారా? లేదా? అని తెలుసుకోవాలి. వారికి సరైన సమయంలో వ్యాక్సిన్లు వేసుకున్నారా? లేదా ఆరా తియ్యాలి. వేసుకున్నా, వేసుకోకపోయినా వారి వివరాలు నమోదు చేసుకోవాలి. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? గ్రహణమొర్రి, మానసిక స్థితి, పోలియో వంటి జబ్బులు ఉన్న వారిని గుర్తించాలి. అటువంటి వారికి వెంటనే వైద్య చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. వ్యాక్సిన్లు వేయించుకోలేదంటే వెంటనే వేయాల్సి ఉంటుంది. వివరాలన్నీ ఫాం–1, ఫాం–2, ఫాం–3లో నమోదు చేసుకోవాలి. నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ఆ నివాసానికి ప్రభుత్వం ఇచ్చిన ఒక స్టిక్కర్‌ను అంటించాలి. అలా ప్రతి ఒక్కరూ 50 నివాసాలు తిరిగి కనీసం పది మంది చిన్నారులను గుర్తించాలి.
ఇవేమీ లేకనే ఫీల్డ్‌లోకి..
కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సర్వే పత్రాలు, స్టిక్కర్లు, అవసరమైన వ్యాక్సిన్లు చేర్చాలి. అయితే జిల్లాలో నిన్నటి వరకు ఎటువంటి సామగ్రి చేరలేదు. చిత్తూరుకు మాత్రం ప్రతిరోజూ అవసరమైన సామగ్రి ఉంచుకున్నారు. పలకరింపు కార్యక్రమంలో భాగంగా ఇద్దరు చిన్నారులకు టీబీ ఉన్నట్లు గుర్తించారు. వారికి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేశారు. మిగిలిన ప్రాంతాలకు అతి తక్కువ మోతాదులో పత్రాలు, స్టిక్కర్లు, వ్యాక్సిన్లు సరఫరా చేసినట్లు తెలిసింది. వరదయ్యపాలెం పీహెచ్‌సీకి సుమారు 6 వేల నుంచి 7వేలు పత్రాలు, స్టిక్కర్లు, వ్యాక్సిన్లు అవసరమైతే సోమవారానికి కేవలం 200 నివాసాలకు సరిపడా పత్రాలు, స్టిక్కర్లు మాత్రమే సరఫరా చేసినట్లు తెలిసింది. అదేవిధంగా చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి 7వేలు అవసరమైతే కేవలం 60 నివాసాలకు సరిపడా పత్రాలు, స్టిక్కర్లను మాత్రం సరఫరా చేసినట్లు తెలిసింది. అవి కూడా సోమవారానికే అయిపోయినట్లు తెలిసింది. అందుకే వారు జిరాక్స్ చేసి వాడుతున్నారు. మంగళవారం నివాసాలు తిరగటం తప్ప చిన్నారుల వివరాలు నమోదు చేసుకోలేకపోయినట్లు సమాచారం. తిరుపతి నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లు, మంగళం, రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏ ఒక్క సామగ్రి చేరకపోవటం గమనార్హం.
ప్రచారంపై యావ..
చిన్నారుల ఆరోగ్య విషయంలో చేపట్టిన పలకరింపు కార్యక్రమంలోనూ టీడీపీ ప్రచార యావ తగ్గలేదు. నివాసాలు సర్వే చేసిన అనంతరం అంటించే స్టిక్కర్లపై సీఎం చంద్రబాబు ఫొటో ముద్రించి ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment