అందుకే వస్తోంది.. ఆస్తమా.. | Dr Vijaykumar Explained Causes Of Asthma | Sakshi
Sakshi News home page

అందుకే వస్తోంది.. ఆస్తమా..

Published Sat, Dec 14 2019 2:37 AM | Last Updated on Sat, Dec 14 2019 2:37 AM

Dr Vijaykumar Explained Causes Of Asthma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఒకప్పుడు బయటి వాతావరణ కాలుష్యం ఆస్తమాకు కారణమని అంతా భావించేవారు. ఇప్పుడీ ముప్పు నేరుగా ఇంట్లోనే తిష్టవేసుక్కూర్చుంది. ఇండోర్‌ పొల్యూషన్‌ (దుప్పట్లు, తలదిండ్లు, పర్‌ఫ్యూమ్‌లు, మస్కిటోకాయిల్స్, అగరొత్తులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే వాయువులు, దుమ్ముధూళి) ఆస్తమాకు ఎక్కువ కారణమవుతున్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సర్వేలో తేలింది. ఇంటా, బయటా కాలుష్య సమస్య వల్ల పట్టణాల్లో 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం మంది ఆస్తమాతో బాధపడుతుండగా, బాధితుల్లో 10–12 శాతం మంది చిన్నపిల్లలే ఉన్నట్లు సర్వే తేల్చింది. శుక్రవారం హోటల్‌ తాజ్‌కృష్ణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, ఛాతీ వైద్యనిపుణుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ ఆస్తమాకు కారణమవుతున్న అంశాలను వివరించారు.     

ఇంటా బయటా తంటానే.. 
గ్రేటర్‌లో 15 ఏళ్ల క్రితం ఉన్న 11 లక్షల వాహనాలు, 2019 నాటికి 55 లక్షలకు చేరాయి. వీటిలో పదిహేనేళ్ల సర్వీసు దాటినవి 10 లక్షలు. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. 
40 వేల వరకు ఉన్న పరిశ్రమలు వదిలే పొగ, వ్యర్థాల వల్ల క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 130–150 మైక్రోగ్రాముల వరకు వివిధ కాలుష్య స్థాయిలు నమోదవుతున్నాయి. 
సల్పర్‌డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్‌ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్‌మోనాక్సైడ్‌తో కూడిన గాలిని పీల్చడం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. 
ఇంట్లో వాడే మస్కిటోకాయిల్స్, పర్‌ఫ్యూమ్స్, పరుపు, తలదిండ్లలో పేరుకుపోయిన దుమ్ము ఆస్తమా కలిగిస్తున్నాయి. 
పోతపాలు, జంక్‌ఫుడ్, అతిగా యాంటీబయాటిక్స్‌ వాడటం వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాసనాళాలను దెబ్బతీస్తున్నాయి. వ యసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతున్నాయని తేలింది. 
ప్రసవం తర్వాత చాలామంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు పడుతున్నారు. సాధారణ జ్వరానికీ ఖరీదైన యాంటిబయాటిక్స్‌ వాడుతున్నారు. ఇది పిల్లల్లో ఆస్తమాకు కారణమవుతోంది. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువుపై ప్రభావం చూపుతోంది. 

నాడీ వ్యవస్థపై ప్రభావం 
– డాక్టర్‌ పి.సుదర్శన్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు 
ఆస్తమాకు బయట ఉండే వాహన, పారిశ్రామిక కాలుష్యం, ధూమపానం వంటి వాటి కంటే ఇండోర్‌ పొల్యూషన్‌ (మస్కిటో కాయిల్స్, పర్‌ఫ్యూమ్స్, అగరొత్తులు, పెట్స్, దుప్పట్లు, దిండ్లు) ఎక్కువ ప్రమాదకరం. ఆస్తమా వల్ల శ్వాసనాళాలు మూసుకుపోయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు, కిడ్నీల పనితీరు మందగిస్తుంది. 

ఇన్‌హేలర్‌తో ఉపశమనం 
– డాక్టర్‌ విజయ్‌కుమార్, ఫల్మనాలజిస్ట్, అపోలో ఆస్పత్రి 
ఇంట్లో ఇన్‌హేలర్‌ ఉండాలి. టాబ్లెట్స్, ఇంజక్షన్లు, నెబ్‌లైజర్‌తో పోలిస్తే ఇన్‌హేలర్‌తోనే ప్రయోజనం ఎక్కువ. వైద్య పరీక్షలతో పని లేకుండా క్లినికల్‌గానూ ఆస్తమాను నిర్ధారించవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే చాలు.  

ఆస్తమా లక్షణాలివీ.. 
తరచూ దగ్గడం.. ఆయాసం.. కడుపు ఉబ్బరంగా ఉండటం. 

వీటికి దూరంగా ఉండాలి.. 
ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్స్, పారిశ్రామిక, వాహన కాలుష్యం..  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement