హోమియో కౌన్సెలింగ్
నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా?
– రవికుమార్, నిడదవోలు
అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్స విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో వాడే మందులివి...
యాంట్ టార్ట్: జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
ఆర్స్ ఆల్బ్: దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ.
హెపార్‌సల్ఫ్: చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని–పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
సోరియమ్: ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది.
నేట్రమ్ సల్ఫ్: నేలమాళిగలు, సెలార్స్‌లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు.
రోడో: వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది.
మెర్క్‌సాల్: వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది.
పైన పేర్కొన్న మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులను వాడాలి. వాటిని తగిన పొటెన్సీలో ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ సమస్యను విపులంగా చర్చించి, మీకు తగిన మందును తీసుకోండి.
ఛాతీలో మంట... తగ్గేదెలా?
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 40 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతీలో మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. – జనార్దన్‌రావు, నల్లగొండ
మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి...
n మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం n కాఫీ, టీలను పూర్తిగా మానేయడం n పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం n బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం n భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి n తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి.
పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి.
నాకు ఈమధ్య కొంతకాలంగా కడుపులో నీరు వస్తోంది. కాళ్లవాపులు వస్తున్నాయి. దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. రెండు సమస్యలూ తగ్గిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత సమస్య మళ్లీ మొదలైంది. మందులు వాడితే తగ్గుతోంది. నేను దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఈ సమస్య వస్తోందా? నా సమస్య పరిష్కారానికి ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు.
– చలమయ్య, విజయవాడ
సాధారణంగా కిడ్నీలో సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. కాలేయం, గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మీరు దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెబుతున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ కాలేయం వల్ల వచ్చిన సమస్యే అయి ఉంటుంది. మీరు ఈ విషయమై ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకున్నారా లేదా అన్న సంగతి తెలపలేదు. మీరు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీటి పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు తీసుకొని మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు ఆ రిపోర్టుల ఆధారంగా మీ సమస్యను గుర్తించి, మీకు తగిన చికిత్స చేస్తారు.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్
అలర్జీ సమస్య తగ్గుతుందా?
Published Tue, Jan 24 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
Advertisement
Advertisement